చెక్‌పోస్టుపై మళ్లీ పంజా | check post centres alert | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్టుపై మళ్లీ పంజా

Dec 30 2013 3:56 AM | Updated on Sep 2 2017 2:05 AM

ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులోని బీవీపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రంపై ఏసీబీ మరోసారి పంజా విసిరింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు చెక్‌పోస్టులపై వెంట వెంటనే దాడులు చేసి అవినీతి అధికారుల గుండెల్లో గుబులు రేపుతున్నారు.

బీవీపాళెం(తడ), న్యూస్‌లైన్ :  ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులోని బీవీపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రంపై ఏసీబీ మరోసారి పంజా విసిరింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు చెక్‌పోస్టులపై వెంట వెంటనే దాడులు చేసి అవినీతి అధికారుల గుండెల్లో గుబులు రేపుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీ, ఈ నెల 20వ తేదీన ఏసీబీ డీఎస్పీ జే భాస్కర్‌రావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు తాజాగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడులు చేపట్టారు.


  ఈ సందర్భంగా ఓ ప్రైవేటు వ్యక్తితో సహా పలు విభాగాల్లో రూ.59,610 పట్టుబడింది. ఇన్‌కమింగ్ చెక్‌పోస్టులో రూ.31,390, వివిధ శాఖలు ఉన్న అవుట్ గోయింగ్‌లో రూ.6,910, రవాణా శాఖ వద్ద రూ.21, 310 లభ్యమయింది. వారం క్రితం జరిపిన దాడిలో రూ.1,10,990 పట్టుబడగా ఈ సారి మాత్రం అందులో సగం లభించింది. ఇప్పటికే ఏసీబీ దాడులు, చార్జ్ మెమోలతో భయాందోళనలతో ఉన్న సిబ్బంది కొంత జాగ్రత్తగానే వ్యవహరించడంతో ఏసీబీ అధికారులకు పెద్దగా పట్టుబడలేదు.
 
 డ్రైవర్లు, క్లీనర్ల వేషధారణలో దాడులు
 ఈ నెల 20వ తేదీ జరిగిన దాడుల తరహాలోనే ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి డ్రైవర్లు, క్లీనర్ల వేషధారణలో చెక్‌పోస్టుపై దాడులు చేశారు. ఈ దఫా ఇరిగేషన్‌శాఖ అధికారులను మధ్యవర్తులుగా పెట్టుకుని దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్‌పీ భాస్కర్‌రావు నేతృత్వంలో ముగ్గురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఒక ఇన్‌స్పెక్టర్, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు ఈ దాడిలో పాలుపంచుకున్నారు. శనివారం రాత్రి 12.30 ప్రాం తంలో లుంగీలు, బనియన్లు ధరించి తలపాగాలు  చుట్టకుని లారీ డ్రైవర్లు, క్లీనర్ల వేషధారణలో కొందరు, చెక్‌పోస్టు సిబ్బందిగా మరికొంత మంది చెక్‌పోస్టులో అడుగుపెట్టారు. వీరు చెక్‌పోస్టులో వచ్చిపోయే మార్గంలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, ఇతర శాఖల సముదాయ కార్యాలయం వద్ద, రవాణాశాఖ, ఎక్సైజ్ శాఖల వద్దకు చేరి పరిస్థితులు గమనించారు. కొంత పరిశీలన అనంతరం అధికారులందరూ మూకుమ్మడిగా రంగంలోకి దిగారు. దాడిని గుర్తించిన చెక్‌పోస్టు సిబ్బంది తమ వద్ద ఉన్న అక్రమ సంపాదనను విసిరి పారేశారు.
 
 ఇలా పారేసిన నగదు రవాణా శాఖ వద్ద రెండు వేర్వేరు ప్రాంతాల్లో రూ.2,300, రూ.1,900 లభిం చగా, వాణిజ్యపన్నుల శాఖ ఇన్‌కమింగ్ కార్యాలయం వద్ద రూ.13 వేల వరకు లభించింది. నెల్లూరుకు చెందిన నాగిశెట్టి పెంచలయ్య అనే ఓ ప్రైవేటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రవాణా శాఖ వద్ద స్టాంపు డ్యూటీ నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌తో పాటు మరో కానిస్టేబుల్‌ను, ఇన్‌కమింగ్ సిటీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఏసీటీఓ వద్ద సొంత సొమ్ముగా చూపిన రూ.500 కన్నా అధికంగా రూ.610 లభించింది. ఔట్‌గోయింగ్‌లో అటెండర్‌గా ఉన్న వ్యక్తి వద్ద రూ.70  దొరకడంతో వారిపై కేసులు నమోదు చేశారు.
 
 గత దాడుల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖలో మాత్రం ఈ దఫా సిబ్బంది అందరూ విధులకు హాజరైనట్టు డీఎస్పీ తెలిపారు. 2012లో జరిపిన దాడులకు సంబంధించి విచారణలు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. చెక్‌పోస్టుతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ దాడులు చేస్తున్నామని, చెక్‌పోస్టు నుంచి లారీల వారి వద్ద నుంచి ఫోనుల్లో ఫిర్యాదులే తప్ప ప్రత్యక్షంగా ఎవరూ ముందుకురాని పరిస్థితుల్లో తాము సుమోటోగా దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ దాడుల్లో సీఐలు కే వెంకటేశ్వరావు, కృపానందం, టీవీ శ్రీనివాస్(ఒంగోలు), ఇన్‌స్పెక్టర్ ఎస్. వెంకటేశ్వరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement