'ప్రసారాలలో హింసాత్మక అంశాలు తగ్గించాలి' | Sakshi
Sakshi News home page

'ప్రసారాలలో హింసాత్మక అంశాలు తగ్గించాలి'

Published Sat, Sep 27 2014 11:44 AM

'ప్రసారాలలో హింసాత్మక అంశాలు తగ్గించాలి'

విజయవాడ: టెలివిజన్ ప్రజా జీవితంలో పెనవేసుకుపోయిందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం విజయవాడలో ఆయన విజయవాడ దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ను వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ... పోటీ ప్రపంచంలో ఆలస్యానికి అర్థం లేదని అన్నారు. వార్తను వార్తగానే వ్యాఖ్యానాన్ని వ్యాఖ్యానంగానే చెప్పాలని ఆయన మీడియాకు హితవు పలికారు. సత్యానికి దగ్గరగా, సంచలనాలకు దూరంగా మీడియా పని తీరు ఉండాలని ఆకాంక్షించారు.

టీవీ ఛానెళ్ల మధ్య పోటీతత్వం పెరిగిందన్నారు. విశ్వసనీయత తగ్గితే వెనకపడి పోవడం ఖాయమన్ని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. టీవీలు, సినిమాలలో హింసాత్మక సంఘటనలు తగ్గించాలని సూచించారు. ఓ ఘటనను పదేపదే ప్రసారం చేస్తే మనుషుల మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. దూరదర్శనకు 1417 ట్రాన్స్మీటర్లు, 32 ఛానెళ్లు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. దూరదర్శన్ కేంద్రానికి జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్ర్య సమరయోధుడు  పింగళి వెంకయ్య పేరు పెట్టడం పట్ల వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement