
చంద్రబాబు పర్యటన వివరాలు
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాకు రానున్నారు. అయోధ్య మైదానంలో జరిగే ప్రజాగర్జనకు హాజరుకానున్నారు.
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాకు రానున్నారు. అయోధ్య మైదానంలో జరిగే ప్రజాగర్జనకు హాజరుకానున్నారు. దీనికి సంబంధించి పార్టీ జిల్లా నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. 15 నిమిషాల విశ్రాం తి అనంతరం 2.30 గంటలకు గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి ఆర్‌అండ్‌బీ, ఎత్తుబ్రిడ్జి మీదుగా బాలాజీ కూడలికి చేరుకుంటారు. అక్కడి నుంచి సత్య కళాశాల మీదుగా కోటకు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా వెళ్తారు. సింహాచలం మేడ వద్ద తెలుగు యువత, తెలుగు మహిళా విభాగం ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను చంద్రబాబు పరిశీలిస్తారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు సభ జరుగుతుంది. 7.30 నుంచి 9 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని నియోజవర్గాల వారీగా నాయకులతో చర్చిస్తారు.