
బాబూ.. నీది రాజకీయ వ్యభిచారం కాదా?
పదవులిస్తాం పార్టీలోకి రావాలంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇతర పార్టీల సీనియర్ నేతల ఇళ్లకు మధ్యవర్తుల్ని పంపించి మాట్లాడించడం దిగజారుడుతనమని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: పదవులిస్తాం పార్టీలోకి రావాలంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇతర పార్టీల సీనియర్ నేతల ఇళ్లకు మధ్యవర్తుల్ని పంపించి మాట్లాడించడం దిగజారుడుతనమని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తూ, విలువల్ని గాలికి వదిలి చేర్చుకోవడం రాజకీయ వ్యభిచారం కాదా? అని ప్రశ్నించారు. గాంధీభవన్లో మాజీ మంత్రి బాలరాజుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. వేరే పార్టీలవారు చేస్తే తప్పు, తాను చేస్తే ఒప్పు అన్నట్లు బాబు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. చిరంజీవి కొత్తగా పార్టీ పెట్టే సమయంలో తనలాంటి కొందరిని సలహాల కోసం అల్పాహార విందుకు పిలిస్తే విమర్శలు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబుకు ఏ విషయంలోనూ స్పష్టత లేదని, నిన్న మొన్నటివరకు రాష్ట్రపతి పాలన విధించండని డిమాండ్ చేసి.. కేంద్రం ఆ పని చేయగానే మరోరకమైన విమర్శలు చేస్తున్నారన్నారు.
2004 ఎన్నికల్లో ఓటమి తరువాత బీజేపీని తీవ్రంగా విమర్శించి దానితో మరెన్నడూ జట్టుకట్టబోనని ప్రకటించిన బాబు ఇప్పుడు మళ్లీ బీజేపీతో జట్టుకట్టేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా పనిచేసి కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకొనే నాయకుడికి ఒక స్పష్టమైన వైఖరి లేకపోవడం దురదృష్టకరమన్నారు. దుబాయ్ వెళ్తే కే పిటలిజమ్ అద్భుతమని, చైనా వెళ్తే కమ్యూనిజం గొప్పదని చంద్రబాబు అనేవారని విమర్శించారు. అవసరార్థం పార్టీలు మారిన వారిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, కిరణ్‌కూ ఇదే వర్తిస్తుందని చెప్పారు.