ఐఏఎస్‌ల హోదాపై క్యాట్ అసంతృప్తి | Central Administrative Tribunal Discontent on conferring IAS status | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ల హోదాపై క్యాట్ అసంతృప్తి

Dec 24 2013 1:41 AM | Updated on Sep 2 2017 1:53 AM

రాష్ట్రంలో ఐఏఎస్ హోదా (కన్ఫర్డ్) ఇచ్చేందుకు అధికారుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానంపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

* ఆ ఆరుగురి పేర్లనూ యూపీఎస్‌సీకి పంపండి
* కిరణ్ సర్కార్‌కు ఆదేశం
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐఏఎస్ హోదా (కన్ఫర్డ్) ఇచ్చేందుకు అధికారుల ఎంపికకు  రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానంపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా లేదని అభిప్రాయపడింది. ఐఏఎస్ హోదా పొందేందుకు అర్హులైన మరో ఆరుగురు అధికారుల జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ)కు పంపాలని క్యాట్ ఆదేశించింది. వారి పేర్లు అందాకే అర్హుల  జాబితా రూపొందించాలని జస్టిస్ పి.స్వరూప్‌రెడ్డి, రంజనాచౌదరిల నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఐఏఎస్ హోదా పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నా తమ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్‌సీకి పంపలేదంటూ ఐ.శ్రీనగేష్ (డీసీ, కమర్షియల్ ట్యాక్స్), ఎల్.శ్రీధర్‌రెడ్డి (డీపీవో), ఆర్.అమరేందర్‌కుమార్ (ఈడీ, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్), పి.కృష్ణవేణి (రవాణాశాఖ), డి.శ్రీనివాస్ నాయక్, రాజ్‌కుమార్ (జీఎం, పరిశ్రమల విభాగం) దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ ధర్మాసనం విచారించింది. ఆరుగురికి ఐఏఎస్ హోదా కల్పించేందుకు ప్రభుత్వం 30 మంది అధికారులతో కూడిన జాబితాను యూపీఎస్‌సీకి పంపిందని, అయితే ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని పిటిషనర్ల తరఫున న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదించారు.

18 విభాగాల నుంచి అర్హులైన అధికారుల పేర్లు సాధారణ పరిపాలనా విభాగానికి (జీఏడీ) అందనే లేదని పేర్కొన్నారు.  కొందరు అధికారుల వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్)ల్లో వారి విభాగాల ఉన్నతాధికారులు సంతకాలు చేయలేదని...అందుకే వారి పేర్లను పంపలేదన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనను సుధీర్ కొట్టిపడేశారు. ఎవరో చేసిన తప్పులకు పిటిషనర్లను బాధ్యులను చేయడం సరికాదన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం...పిటిషనర్ల పేర్లను యూపీఎస్‌సీకి పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement