breaking news
IAS Status (conferred)
-
అమాత్యుల అండ ఉంటే ఐఏ‘ఎస్’!
* కన్ఫర్డ్ ఐఏఎస్ జాబితాలో పీఎస్‌లు, ఓఎస్డీలు * ‘బంధువు’ కోసం నిబంధనల సడలింపుతో పెరిగిన అర్హులు * పైరవీకారులు, అమాత్యుల వద్ద పనిచేసేవారిదే పైచేయి * ఎంపిక తీరుపై క్యాట్ కూడా అసంతృప్తి హైదరాబాద్, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐఏఎస్... దేశంలో ఈ హోదాకు ఉండే ప్రతిష్ట చెప్పనక్కర్లేదు! ఐఏఎస్ కావాలంటే ఏం చేయాలి? యూపీఎస్సీ నిర్వహించే ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ పరీక్షల్లో ప్రతిభ నిరూపించుకోవడం ఒక మార్గం. ఒకవేళ రాష్ట్ర స్థాయి సర్వీస్‌లో ఉంటే మంచి పనితీరు కనబరిచి కొంతకాలం తరువాత కన్ఫర్డ్ ఐఏఎస్ కావడానికీ మరో మార్గం ఉంది. మంచి పనితీరు అంటే... వివాదరహితంగా, నీతిమంతంగా, ప్రతిభావంతంగా, సమాజానికి ఉపయోగపడేలా పనిచేయడం..! కానీ ఈసారి మంచి పనితీరుకు నిర్వచనాలు మారిపోయాయి. మంత్రుల దగ్గర పనిచేసే ఓఎస్డీలు, పీఎస్‌లు, ఉన్నతాధికారుల విశ్వాసపాత్రులు, ఉన్నత స్థాయిలో రాజ కీయ పైరవీలు చేతనైనవాళ్లు కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రాబబుల్స్ జాబితాలో చేరిపోయారు. ఇది చేతకానివాళ్లు ఆ జాబితాలో చేరలేక నిరాశకు లోనవుతున్నారు. జాబితాలో సగం మంది పీఎస్‌లు, ఓఎస్డీలే! ఈసారి రెవెన్యూయేతర సర్వీసుల నుంచి కన్ఫర్డ్ ఐఏఎస్ కావటానికి ఆరు పోస్టులున్నాయి. ఇందుకు 30 మందిని ఎంపిక చేస్తే అందులో 12-13 మంది వరకూ మంత్రుల వద్ద పనిచేసే పీఎస్‌లు, ఓఎస్డీలు, ముఖ్యనేత కుమారుడి స్నేహితులు, పీసీసీ నేత బంధువులుండటం గమనార్హం. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులతో పోలిస్తే వీరికి అనేక అంశాలు కలిసి వస్తున్నాయి. ఏళ్లుగా సచివాలయంలో తిష్టవేసి, మంత్రులకు విశ్వాసపాత్రులుగా పనిచేస్తూ ఆ మంత్రులతోనే ఏటా వార్షిక నివేదిక (ఏసీఆర్)ల్లో ‘అసాధారణ పని తీరు’ (ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్) కితాబు తీసుకోవడం వీరికి కలసివస్తోంది. జాబితాలో చేరటానికి ఆ మంత్రులతోనే పైరవీలు చేయించుకోగలుగుతున్నా రు. కానీ, క్షేత్ర స్థాయిలో పనిచేసేవాళ్లు ఏసీఆర్‌ల విషయంలో బాసులనుంచి సతాయింపులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. పైగా ఏవేవో ఆరోపణలు, వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. వాటి నుంచి క్లీన్చిట్ అంత త్వరగా రాదు. సచివాలయం స్థాయిలో మంత్రుల ప్రాపకంలో ఉండేవాళ్లకు పెద్దగా ఈ ఆరోపణలు, వివాదాలు అంటవు. ఒకవేళ చిన్నాచితకా ఉన్నా మంత్రుల ద్వారానే వాటి ని ఎత్తివేయించుకోవడమూ సులువే. స్క్రీనింగ్ నుంచి ఇంటర్వ్యూ దశ వరకు ఉన్నతాధికారుల కమిటీలను మంత్రుల ద్వారా ప్రభావితం చేయించడంలో పీఎస్‌లు, ఓఎస్డీలు ముందుంటారు. వడ్డించేవాడు మనవాడైతే...! వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఆఖరున్నా ఒకటే అన్నట్లుగా 2011లో ఒక పీసీసీ ముఖ్యనేతకు దగ్గరి బంధువైన రాష్ట్ర సర్వీసు అధికారి కన్ఫర్డ్ ఐఏఎస్ అవడానికి నిబంధనలే మారిపోయాయి. పీసీసీ నేతకు స్వయానా బావ అయినా ఆ అధికారికి నిబంధనల మేరకు డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఎనిమిదేళ్ల కనీస సర్వీస్ లేదు. దాంతో ఒక కమిటీ వేసి ఆర్డీవో స్థాయి మూలవేతనంతో 8 ఏళ్లు పనిచేసి ఉంటే చాలునంటూ నిబంధనను మార్చేశారు. ఫలితంగా గ్రూపు-1లో దిగువ స్థారుు పోస్టుల అధికారులకూ భలే ఛాన్స్ దొరికింది. దీంతో ఆ నేత బావగారితోపాటు మరో ఇద్దరు దగ్గరి బంధువులకూ అర్హత వచ్చిపడింది. అయితే 2011లో ఆ నేతను మించిన బడా నేతలు తమవారి కోసం అడ్డుపడడంతో వారి పప్పులు ఉడకలేదు. ఆ బావగారు ఈసారీ జాబితాలో ఉన్నారు! -
ఐఏఎస్‌ల హోదాపై క్యాట్ అసంతృప్తి
* ఆ ఆరుగురి పేర్లనూ యూపీఎస్సీకి పంపండి * కిరణ్ సర్కార్‌కు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐఏఎస్ హోదా (కన్ఫర్డ్) ఇచ్చేందుకు అధికారుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానంపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా లేదని అభిప్రాయపడింది. ఐఏఎస్ హోదా పొందేందుకు అర్హులైన మరో ఆరుగురు అధికారుల జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కు పంపాలని క్యాట్ ఆదేశించింది. వారి పేర్లు అందాకే అర్హుల జాబితా రూపొందించాలని జస్టిస్ పి.స్వరూప్‌రెడ్డి, రంజనాచౌదరిల నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఐఏఎస్ హోదా పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నా తమ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపలేదంటూ ఐ.శ్రీనగేష్ (డీసీ, కమర్షియల్ ట్యాక్స్), ఎల్.శ్రీధర్‌రెడ్డి (డీపీవో), ఆర్.అమరేందర్‌కుమార్ (ఈడీ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్), పి.కృష్ణవేణి (రవాణాశాఖ), డి.శ్రీనివాస్ నాయక్, రాజ్‌కుమార్ (జీఎం, పరిశ్రమల విభాగం) దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ ధర్మాసనం విచారించింది. ఆరుగురికి ఐఏఎస్ హోదా కల్పించేందుకు ప్రభుత్వం 30 మంది అధికారులతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపిందని, అయితే ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని పిటిషనర్ల తరఫున న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదించారు. 18 విభాగాల నుంచి అర్హులైన అధికారుల పేర్లు సాధారణ పరిపాలనా విభాగానికి (జీఏడీ) అందనే లేదని పేర్కొన్నారు. కొందరు అధికారుల వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్)ల్లో వారి విభాగాల ఉన్నతాధికారులు సంతకాలు చేయలేదని...అందుకే వారి పేర్లను పంపలేదన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనను సుధీర్ కొట్టిపడేశారు. ఎవరో చేసిన తప్పులకు పిటిషనర్లను బాధ్యులను చేయడం సరికాదన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం...పిటిషనర్ల పేర్లను యూపీఎస్సీకి పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.