జీసీసీ సూపర్ బజార్లలో సీసీ కెమెరాలు | Cc cameras in BCC Super Bazar | Sakshi
Sakshi News home page

జీసీసీ సూపర్ బజార్లలో సీసీ కెమెరాలు

Mar 11 2015 2:01 AM | Updated on Aug 14 2018 3:37 PM

ఇన్నాళ్లు సరైన పర్యవేక్షణ లేక ఆదరణ అంతంతమాత్రంగా ఉన్న గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సూపర్ బజార్లు మళ్లీ గాడిలో పడుతున్నాయి.

సాక్షి, విశాఖపట్నం: ఇన్నాళ్లు సరైన పర్యవేక్షణ లేక ఆదరణ అంతంతమాత్రంగా ఉన్న గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సూపర్ బజార్లు మళ్లీ గాడిలో పడుతున్నాయి. వీటిని బలోపేతం చేసేందుకు జీసీసీ పాలకవర్గం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాల నిస్తున్నాయి. క్రమక్రమంగా అమ్మకాల జోరందుకుంటున్నాయి. సిబ్బందిలో కూడా పారదర్శకత పెరుగుతోంది. జీసీసీ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాడేరు, అరకు, శ్రీకాకుళం జిల్లా సీతంపేట, తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం, అడ్డతీగలలో సూపర్‌బజార్లు నడుస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్న సూపర్  మార్కెట్‌లకు ధీటుగానే ఈ సూపర్‌బజార్లు పని చేస్తున్నాయి. ఇన్నాళ్లు వీటి లో పనిచేసే సిబ్బందిని పర్యవేక్షించే నాథుడు లేక... ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారు. కొంతమంది సిబ్బందైతే అందిన కాడకి దోచేసి వీటిని నిర్వీర్యం చేశారు. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన జీసీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.పి.ఎస్.రవిప్రకాష్ వీటిపై ప్రత్యేక దష్టి పెట్టారు.
 
 ఆకస్మిక తనిఖీలు చేస్తూ సూపర్ బజార్లలో అమ్మకాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. క్షేత్ర స్థాయిలో అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడం, వారు కాజేసిన సొమ్ము వసూలు చేస్తున్నారు. మరో పక్క సూపర్ బజార్లలో జరిగే క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలన్నీ ఆన్‌లైన్ చేశారు. ఖర్చు చేసే ప్రతీరూపాయితో పాటు వచ్చే ప్రతీ పైసా అకౌంట్‌బులిటీ అయ్యే విధంగా ఆన్‌లైన్ అకౌంటింగ్ సిస్టమ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. పైగా ఏ సమయంలో ఎక్కడ ఏం జరుగుతుందో విశాఖ జీసీసీ కార్యాలయంలోని తన చాంబర్ నుంచే తెలుసుకునేందుకు వీలుగా ప్రతీ సూపర్ బజార్‌లోనూ క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను అమర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పాడేరులో ఈ కెమెరాలను అమర్చారు.
 
 ప్రస్తుతం ప్రతి నెలా రంపచోడవరం సూపర్‌బజార్ ద్వారా రూ.12 లక్షలు, పాడేరు, అడ్డతీగల బజార్ల ద్వారా రూ.పదేసి లక్షలు, అరకు, సీతంపేట బజార్ల ద్వారా రూ.రెండేసి లక్షల చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ ఐదు బజార్ల ద్వారా ప్రస్తుతం నెలకు రూ.40 లక్షల వరకు అమ్మకాలు సాగుతుండగా, వీటిని రూ.కోటికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు జీసీసీ వైస్ చైర్మన్ రవిప్రకాష్ తెలిపారు. భవిష్యత్తులో ప్రయివేట్ సూపర్ మార్కెట్‌లకు ధీటుగా వీటిని మరింత ఆధునికీకరించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. వీటిని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టి అమ్మకాలను పెంచి లాభాలబాట పట్టేలా చర్యలు తీసుకు న్నామని, సిబ్బందిలో కూడా జవాబుదారీతనం తీసుకొచ్చామని చెప్పారు. వీటిని బలోపేతం చేసిన తర్వాత వీటిని మరింత విస్తరించే చర్యలు చేపడతామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement