కాల్‌ 'నాగులు'

Call Money Cases In West Godavari - Sakshi

పేదలరక్తాన్నిపీల్చేస్తున్నారు

మహిళలు, వృద్ధులు, వితంతువులే లక్ష్యం

అప్పు తీసుకున్నారోవలలో చిక్కినట్లే

కాల్‌మనీ కేటుగాళ్ల  దురాగతాలు

ఏలూరు అమీనాపేటకు చెందిన వెంకట కృష్ణవేణిఒక వడ్డీ వ్యాపారి వద్ద 2014లో కుటుంబ అవసరాల నిమిత్తం రూ.30 వేలు అప్పుగా తీసుకుంది. భర్త చనిపోవటంతో కూలిపని చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. బాకీని నెలనెలా కొంతమొత్తంగా చెల్లిస్తోంది. 2015 నాటికి బాకీ రూ.2 వేలు మిగిలింది. ఇదే సమయంలో కాల్‌మనీ వివాదంతో వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు కావటంతో సొమ్ము తీసుకునేందుకు ఆమె వద్దకు ఎవరూ రాలేదు. అనంతరం బాకీ విషయంలో సదరు వడ్డీ వ్యాపారి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. తాజాగాఆమె తమకు రూ.2 లక్షలు బకాయి ఉందని, వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ చెక్కుల ఆధారంగా బినామీలతో కోర్టులో కేసు వేశాడు. ఇప్పటికేతీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెనువడ్డీ వ్యాపారి కోర్టు కేసు పేరుతో వేధిస్తూ..బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

ఏలూరు టౌన్‌ :  జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. ఒక్క ఏలూరు నగరంలోనే ఇలా అధిక వడ్డీలు వసూలు చేసే వ్యాపారులు పదుల సంఖ్యలో ఉన్నారు. వీరు రూ.కోట్లలో వ్యాపారాలు సాగిస్తున్నారు. రోడ్ల మీద చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తుల నుంచి మధ్య తరగతి వర్గాల వరకూ వేలసంఖ్యలో వ్యక్తులకు అప్పులు ఇస్తూ ఉంటారు. ధర్మ వడ్డీకి అప్పు ఇచ్చే పరిస్థితులు పోయి.. చక్రవడ్డీలు, ఎస్‌టీడీ వడ్డీల పేరుతో జనాలను దోచేస్తున్నారు. రోజంతా కూలీనాలీ చేసుకునే పేద వర్గాలు, చిన్న ఉద్యోగాలు చేసుకునే వ్యక్తులు ఈ కాల్‌మనీ జలగల ఉచ్చులో పడి దోపిడీకి గురవుతున్నారు. ఏలూరు అశోక్‌నగర్‌లోనే ఇద్దరు, ముగ్గురు వడ్డీ వ్యాపారులు చేస్తున్న అరాచక దందాలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు.

‘కాల్‌మనీ’ కేటుగాళ్లు డబ్బు వాసన రుచిమరిగి పేట్రేగిపోతున్నారు. అవసరాల కోసం అప్పు తీసుకుంటున్న పేద, మధ్య తరగతి వర్గాల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మహిళలు, వితంతువులు, వృద్ధులు, పేదలు, ఆదరణలేని వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుంటూ అప్పులు ఇస్తున్నారు. తీసుకున్న అప్పునకు ఎస్‌టీడీ వడ్డీ వేసి రెట్టింపు కట్టించుకున్నాక, వారితో గొడవలు పెట్టుకుంటున్నారు. రెండు, మూడేళ్లు ఆగిన అనంతరం అప్పు తీసుకున్న వ్యక్తుల చెక్కులతో కోర్టులో మరోసారి భారీ మొత్తానికి కేసులు వేస్తున్నారు. సెటిల్‌మెంట్‌ చేసుకునే వరకూ వేధింపులకు గురి చేస్తున్నారు. పోనీ పోలీస్‌స్టేషన్లకు వెళదామా అంటే అక్కడ తమ అనుచర వర్గాన్ని పెట్టి మరీ బెదిరింపులకు పాల్పడడం కాల్‌మనీ కేటుగాళ్ల స్టైల్‌. బినామీలతో చెక్కులను కోర్టుల్లో వేయిస్తూ నోటీసులు పంపిస్తారు. నగరంలో ఇదే తరహాలో వేధింపులకు గురవుతున్న బాధితులు తీవ్ర మానసిక వేదనతో నలిగిపోతున్నారు.

హత్యానేరాల్లో నిందితులతో బలవంతపు వసూళ్లు
ఏలూరు నగరానికి చాలా ఏళ్ల క్రితం ఉపాధి కోసం వచ్చి ఇక్కడే పాతుకుపోయిన కొందరు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రూ.వేలల్లో సొమ్ములు ఇస్తూ.. రోజువారీ, వారం, పక్షం రోజులు, నెలరోజులు ఇలా వసూలు చేస్తుంటారు. రూ.వెయ్యి అప్పుగా ఇవ్వాలంటే ముందుగానే రూ.200 మినహాయించుకుని రూ.800 ఇస్తుంటారు.

ఈ సొమ్మును వాయిదాల పద్ధతిలో చెప్పిన రోజుకు చెల్లించాలి. ఒక్కరోజు దాటితే  అదనంగా  పెనాల్టీ పడుతుంది. ఇక తీసుకున్న అప్పు వసూళ్ల బాధ్యతను నగరంలోని హత్యా నేరాల్లో నిందితులు, రౌడీషీటర్లకు అప్పగిస్తారు. ఈ వ్యక్తులు రాత్రి వేళల్లో, తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లి డబ్బు వసూళ్లకు బెదిరింపులు చేస్తుంటారు. ఒక వేళ సొమ్ములు చెల్లించలేని పక్షంలో మహిళలను లైంగికం  గానూ వేధింపులకు గురిచేస్తూ తమదైన శైలిలో వసూలు చేయటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. బాధితులు పోలీస్‌స్టేషన్లకు వెళ్లే అవకాశం లేకుండా స్టేషన్లలో సైతం తమ అనుచరులను ఏర్పాటు చేసుకుని బెదిరింపులకు పాల్పడుతుంటారు.

ఏలూరు తంగెళ్లమూడికి చెందిన ఎస్‌కే రియాజుద్దీన్‌ ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. నెలనెలా వాయిదాల పద్ధతిలో వడ్డీతో కలిపి సొమ్ము చెల్లించేలా నిర్ణయించారు. తీసుకున్న రుణానికి మూడు రెట్లు రూ.1.50 లక్షలు ఎస్‌టీడీ (వందకు నెలకు రూ.10 నుంచి రూ.20 వరకు వసూలు చేస్తారు) వడ్డీతో వసూలు చేశారు. కానీ అంతటితో వ్యాపారి ఆగిపోలేదు. అదనంగా మరో రూ.50 వేలు చెల్లించాల్సిందేనంటూ వేధింపులకు దిగాడు. తన సొమ్ము ఇప్పించాలంటూ బినామీలతో రియాజుద్దీన్‌ ఇచ్చిన చెక్కులతో కోర్టులో కేసు వేశాడు. కుటుంబ పోషణే కష్టంగా మారిన ఆతను వడ్డీ వ్యాపారి వేధింపులకు తాళలేక 2017లో  ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు.

వృద్ధులు, వితంతువులు, ఆదరణలేనివారే టార్గెట్‌
కుటుంబ అవసరాలో.. వ్యక్తిగత సమస్యలతోనో.. వడ్డీలకు అప్పులు     తీసుకున్నారో ఇక అప్పు తీసుకున్న వ్యక్తుల జీవితాలు వారి చేతుల్లోకి వెళ్ళిపోయినట్లే. ఈ వ్యాపారులు ఎవరికి పడితే వారికి అప్పులు ఇవ్వరు. సమాజంలో ఆదరణలేనివారు, పేదవర్గాలు, బంధువర్గం లేనివాళ్ళు, మహిళలు, వృద్ధులు, వితంతువులు ఇలా కొన్ని వర్గాల ప్రజలను మాత్రమే వారు టార్గెట్‌గా చేసుకుంటారు. వ్యాపారుల కనుసన్నల్లో నడిచే వ్యక్తుల విశ్వసనీయ సమాచారం మేరకు భారీగా డబ్బులు అప్పులుగా ఇస్తుంటారు. వేధింపులకు గురిచేసినా ఎవరూ అండలేకుండా చేయటం, పోలీస్‌స్టేషన్లకు వెళ్ళలేని నిస్సహాయులను ఏరికోరి వారికే అప్పులు ఇవ్వటం వారి స్పెషల్‌.   

చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
చట్టాన్ని ఎవరైనా తమ చేతుల్లోకి తీసుకుంటూ వేధింపులకు పాల్పడితే సహించేదిలేదు. బలవంతంగా ఎవరితోనైనా సంతకాలు చేయించి, నిబంధనలు మీరితే చర్యలు తప్పవు. ఎవరైనా వడ్డీ వ్యాపారం పేరుతో వేధింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం. విచారణ చేపట్టి బాధితుల ఫిర్యాదు మేరకు కాల్‌మనీ కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పేదలు, మహిళలు, వితంతువులు, ఇలా ఎవరిపైన అయినా దాడులు, వేధింపులు జరిగినట్లు నిర్ధారణ అయితే తప్పకుండా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వారి పట్ల ప్రజలూ జాగ్రత్తలు పాటించాలి. – ఎం.రవిప్రకాష్, ఎస్పీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top