కొండవెలగాడలో బోస్టన్‌ స్కూల్‌ | Sakshi
Sakshi News home page

కొండవెలగాడలో బోస్టన్‌ స్కూల్‌

Published Tue, Jun 19 2018 12:27 PM

Boston School In The Konda velagada - Sakshi

నెల్లిమర్ల విజయనగరం : రాష్ట్రంలోనే ఏకైక బాల నేరస్తుల కారాగృహం(బోస్టన్‌ స్కూల్‌) రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర విభజన తరువాత గతంలో నిజామాబాద్‌లో ఉన్న బోస్టన్‌ స్కూల్‌ తెలంగాణకు తరలిపోయింది. దీంతో బాల నేరస్తులకు వసతి కల్పించేందుకు అవసరమయ్యే ప్రత్యేకమైన కారాగృహం లేకుండాపోయింది. దీంతో జిల్లాలో బోస్టన్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని జైళ్ల శాఖ అధికారులు యోచించారు. ఇక్కడే జిల్లా జైలును కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ మేరకు జిల్లా కేంద్రమైన విజయనగరం నుంచి నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి వెళ్లే దారిలో రూ.25 కోట్లతో బోస్టన్‌ స్కూల్, జిల్లా జైలుకు అవసరమయ్యే భవనాల నిర్మాణం పనులు ప్రస్తుతం చురుగ్గా జరుగుతున్నాయి.రాష్ట్రం విడిపోయిన తరువాత ఉన్న ఒక్కగానొక్క బోస్టన్‌ స్కూల్‌ తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లిపోవడంతో  రాష్ట్రానికి సంబంధించిన బాల నేరస్తులను ఎక్కడ ఉంచాలో తెలియని అయోమయ స్థితిలో జైళ్ల శాఖ అధికారులు తర్జనభర్జన పడ్డారు.

చివరకు విజయనగరం జిల్లాలో నెలకొల్పాలని యోచించి కొండవెలగాడ గ్రామానికి వెళ్లే దారిలో 25ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించారు.  సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసి, బాల నేరస్తులను ఇక్కడికి రప్పించాలని జైళ్లశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక్కడే జిల్లా జైలును కూడా ఏర్పాటు చేస్తున్నారు.

జిల్లా జైలు ఏర్పాటుతో విజయనగరం, చీపురుపల్లి, సాలూరు, ఎస్‌.కోట ప్రాంతాల్లోని సబ్‌జైళ్లలో ఉన్న ఖైదీలను ఎప్పటికప్పుడు ఒకే చోటుకు చేర్చేందుకు అవకాశముంది. రిమాండ్‌ ఖైదీలతో పాటు శిక్ష ఖరారైన ఖైదీలకు వసతి సౌకర్యం కల్పించేందుకు అవకాశం కలుగుతుందని సంబంధిత అధికారులు భావిస్తున్నారు.

చురుగ్గా బోస్టన్‌ స్కూల్‌ నిర్మాణం

నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామ పరిధిలో బోస్టన్‌ స్కూల్‌ నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. అక్కడే జిల్లా జైలు నిర్మాణం కూడా చేపడుతున్నాం. ఇటీవల మా ఉన్నతాధికారులు సందర్శించి, నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తాం.

–గణేశ్,  సబ్‌జైలు సూపరింటెండెంట్, విజయనగరం

Advertisement

తప్పక చదవండి

Advertisement