బొంగు బిర్యానీ.. టేస్టే..సెపరేటు | Bongu Biryani Special in Bhavani Land Krishna | Sakshi
Sakshi News home page

బొంగు బిర్యానీ.. టేస్టే..సెపరేటు

Aug 27 2018 1:11 PM | Updated on Aug 27 2018 1:11 PM

Bongu Biryani Special in Bhavani Land Krishna - Sakshi

సిద్ధమైన బిర్యానీ

చాలా తక్కువ మందికే తెలిసిన వంటకం.. అరకు అందాలను చూడటానికి వెళ్లిన వారికి మాత్రమే పరిచయమున్న ఘుమఘుమ. ఇప్పుడు రాజధాని వాసుల నోరు ఊరిస్తోంది. అదే బొంగులో బిర్యానీ. బొంగులో చికెన్‌.. ఇది చాలామందికి తెలిసిన రుచే.. అయితే అరకు, బొర్రాగుహలకు మాత్రమే ప్రత్యేకమైన వెదురు బిర్యానీ ఇప్పుడు మన ప్రాంతంలో పాగా వేసేందుకు వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వంటకు ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించడంతో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇప్పుడు భవానీ ద్వీపంలో దీనిని సండే స్పెషల్‌గా ఏర్పాటు చేసింది. కృష్ణానది మధ్యలో.. చల్లని అహ్లాద వాతావరణంలో వేడివేడిగా బొంగు బిర్యానీ తింటుంటే.. ఆహా.. జిహ్వకు ఎంత ఇంపుగా ఉంటదో.. ఇంక లేటేందుకు లే‘టేస్ట్‌’ గురించి తెలుసుకుందాం రండి..  

భవానీపురం(విజయవాడ పశ్చిమ): భవానీ ఐలాండ్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన రుచి.. బొంగులో బిర్యానీ..  మాంసాహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనిని తయారు చేసే విధానం.. తయారీకి అవసరమైన వెదురు ఎక్కడి నుంచి తీసుకొస్తారు.. దీని రేటు తదితరాలకు సంబంధించి భవానీ ఐలాండ్‌ మేనేజర్‌ డి. సుధీర్‌బాబు తెలిపిన వివరాలు..

ఇదీ విధానం..
ముందుగా శుభ్రం చేసిన చికెన్‌కు అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పూ–కారం, చికెన్‌ మసాలా, పెరుగు, టేస్టింగ్‌ సాల్ట్‌ పట్టించి కాసేపు ఉంచుతారు. అలాగే బిర్యానీ రైస్‌ను హాఫ్‌ బాయిల్డ్‌ చేస్తారు. ఆ తర్వాత అర కేజీ చికెన్, అర కేజీ రైస్‌ను బొంగులో పెడతారు. బొంగుకు ఒక వైపు సీలు వేసినట్లు (వాసానికి మధ్యలో ఉండే కణుపు) ఉంటుంది. రెండో వైపు అరిటాకుగానీ, విస్తరాకుగానీ మూతగా పెడతారు. అప్పుడు బొంగును కట్టెల పొయ్యిపై ఏటవాలుగా పెట్టి మంటలో కాలుస్తారు. ఇక్కడ విచిత్రమేమిటంటే దీనిలో ఎక్కడా ఆయిల్‌ కలపరు. పచ్చి వెదురు బొంగులో ఉండే సహజమైన నీటితోనే చికెన్, రైస్‌ ఉడుకుతాయి.

రేటు కొంచెం ఎక్కువే..
బొంగు బిర్యానీ అయినా (రైస్,చికెన్‌ కలిపి) బొంగు చికెన్‌ అయినా కిలో ఉంటుంది. వీటిలో ఏదైనా జీఎస్‌టీతో కలిపి రూ.650లు చార్జి చేస్తున్నారు. వీటితోపాటు కప్పు ఐస్‌క్రీంగానీ, కూల్‌ డ్రింక్‌గానీ ఇస్తున్నారు.  

వెదురు బొంగులు..
బిర్యానీ తయారీకి ఉపయోగించే పచ్చి వెదురు బొంగులను ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం నుంచి ప్రతి వారం తెప్పిస్తున్నారు. ఈ బిర్యానీ తయారీలో నిపుణుడైన అప్పారావు అనే వ్యక్తిని రంపచోడవరం నుంచి తీసుకువచ్చి ఐలాండ్‌లోని వంట సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నారు.

అందరికీ అందుబాటులో..
మాంసాహార ప్రియులు బొంగు బిర్యానీ కోసం ఎక్కడికో వెళ్లకుండా.. అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో భవానీ ఐలాండ్‌లో కొత్తగా ప్రవేశపెట్టాం. ప్రతి ఆదివారం లంచ్‌ కింద ఈ ప్రత్యేక బిర్యానీతోపాటు కుండ బిర్యానీకూడా ఏర్పాటు చేశాం. సందర్శకుల నుంచి లభించే ఆదరణ చూసి ప్రతి రోజూ  ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం.– సీహెచ్‌ శ్రీనివాస్, డీవీఎం, ఏపీటీడీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement