ఏపీలోని విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో ప్రస్తుతమున్న రన్‌వేలను పదివేల అడుగులకు విస్తరించి త్వరలో బోయింగ్ విమానాలు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సివిల్ ఏవియేషన్ అకడామీ(సీఏఏ)
విశాఖపట్నం: ఏపీలోని విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో ప్రస్తుతమున్న రన్‌వేలను పదివేల అడుగులకు విస్తరించి త్వరలో బోయింగ్ విమానాలు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సివిల్ ఏవియేషన్ అకడామీ(సీఏఏ) సీఈవో, ఎయిర్ ఇండియా మాజీ డెరైక్టర్ ఎస్.ఎన్. రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో ఆదివారం ఏటీఏఐ(ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఇండియా) ఆధ్వర్యంలో ‘ప్రాంతీయ విమాన సర్వీసులు-ఎయిర్ కార్గో ఎగుమతులు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు.
ప్రస్తుతం విశాఖ ఎయిర్‌పోర్టు రన్‌వే పెద్దదికావడంతో డ్రీమ్‌లైనర్ తరహాలో బోయింగ్ విమానాలు కూడా దిగవచ్చని, ఒక రన్‌వే ఏర్పాటు చేస్తే సరిపోతుందని అన్నారు. కఠ్మాండు, పోర్టుబ్లెయిర్ విమానాశ్రయాల తరహాలో వైజాగ్ ఎయిర్‌పోర్టుకు ఒకవైపే విమానాల రాకపోకలకు వీలుందని, ఎయిర్‌పోర్టును విస్తరించాలంటే వైజాగ్ పోర్టు భూములు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. 30 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలున్న వైజాగ్ విమానాశ్రయానికి ఏటా 10 లక్షల మందే వస్తున్నారని, అందువల్ల కొత్త ఎయిర్‌పోర్టు అవసరం లేదని చెప్పారు.