గోదావరిలో లాంచీ బోల్తా

Boat capsized incident in Godavari river at Devipatnam - Sakshi

ఏపీలోని వాడపల్లి, మంటూరు గ్రామాల మధ్య దుర్ఘటన 

సుడిగాలుల బీభత్సం..మునిగిపోయిన లాంచీ 15 మంది సురక్షితం  

తలుపులు మూసేయడంతో లోపలే చిక్కుకుపోయిన బాధితులు

  ఊపిరాడక మృత్యువాత పడి ఉంటారని అంచనా  

సాక్షి ప్రతినిధి, దేవీపట్నం/కాకినాడ రూరల్‌/పోలవరం/రంపచోడవరం: అలలపై ఆహ్లాదకరంగా సాగాల్సిన ప్రయాణం విషాదాంతమైంది. గోదావరి నదిలో లాంచీ మునిగి దాదాపు 40 మంది గల్లంతయ్యారు. ఈ దుర్ఘటన మంగళవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి, తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు గ్రామాల మధ్య సంభవించింది. 55 మంది ప్రయాణిస్తున్న లాంచీ అకస్మాత్తుగా వీచిన సుడిగాలుల వల్ల ఒక్కసారిగా నీట మునిగింది. ఏం జరుగుతోందో తెలిసేలోపే నిర్వాహకులతోపాటు ప్రయాణికులంతా నీట మునిగారు. పలువురు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. లాంచీపై కూర్చున్న 15 మంది మాత్రం ప్రాణాలు దక్కించుకోగలిగారు. నదిలో గల్లంతైన ప్రయాణికుల కోసం అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. లాంచీలో ఉన్న సిమెంట్‌ బస్తాల వల్ల నీట మునిగిన లాంచీ పైకి తేలకుండా అడుగున ఉండిపోయి, అందులో చిక్కుకున్నవారు ఊపిరాడక మృత్యువాత పడే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. 

కొంపముంచిన నిర్లక్ష్యం 
తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన దేవీపట్నం నుంచి మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు కొండమొదలు గ్రామానికి లక్ష్మీవెంకటేశ్వర లాంచీ (కాజా లాంచీ) బయల్దేరింది. ఇందులో దాదాపు 55 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా కొండమొదలు, కచ్చులూరు, కె.గుందూరు, సాళ్లూరు గ్రామాలకు చెందిన గిరిజనులు. అందరూ వివిధ పనుల నిమిత్తం దేవీపట్నం, పోలవరంలోని మీ–సేవా కేంద్రాలు, ఆస్పత్రులకు వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లా మంటూరు ప్రాంతానికి చేరుకునే సమయంలో ఒక్కసారిగా విపరీతంగా సుడిగాలులు వీచాయి. లాంచీని నిలిపివేయాలని ప్రయాణికులు లాంచీ నిర్వాహకులకు మొర పెట్టుకున్నారు. అయితే, ఇలాంటి గాలులు సాధారణమేనంటూ నిర్వాహకులు నిర్లక్ష్యంగా బదులిచ్చారు. లాంచీని ముందుకు కదిలించారు. 

ప్రాణం మీదకు తెచ్చిన సిమెంట్‌ బస్తాలు 
లాంచీలో ఉన్న సిమెంట్‌ బస్తాలు ప్రయాణికులను ప్రమాదంలోకి నెట్టాయి. విపరీతమైన గాలి, నీరు లోపలికి వీస్తుండడంతో సిమెంట్‌ బస్తాలు తడిసిపోకుండా ఉండేందుకు లాంచీ చుట్టూ ఉన్న తలుపులన్నీ మూసివేశారు. అదే సమయంలో గాలి తీవ్రత పెరగడంతో లాంచీ ఒక్కసారిగా తిరగబడింది. లాంచీ తలుపులు మూసేసి ఉండడంతో ప్రయాణికులెవరూ వెంటనే బయటకు రాలేకపోయారు. ప్రయాణికులకు అందుబాటులో ఉంచాల్సిన లైఫ్‌ జాకెట్లనూ కట్టకట్టి లాంచీలో ఓ మూలన పడేసినట్లు సమాచారం. 

బయటపడ్డ 15 మంది 
ఊహించని విధంగా లాంచీ నీట మునగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. ప్రాణాలు దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఎట్టకేలకు ఐదుగురు లాంచీ సిబ్బందితోపాటు మరో పది మంది ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరు మహిళలు, పదేళ్ల బాలుడు, ముగ్గురు యువకులు ఉన్నారు. వీరిలో నలుగురు పశ్చిమ గోదావరి జిల్లా వాడపల్లికి, ఆరుగురు మంటూరుకు చేరుకున్నారు. 

గాలింపు చర్యలు ముమ్మరం 
లాంచీలో ప్రయాణిస్తున్న 55 మందిలో 15 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన 40 మంది కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను రప్పించారు. చీకటి పడడంతో ప్రస్తుతానికి గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం ఉండదని స్థానికులు చెప్పారు. లాంచీ ప్రమాదంపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 
గోదావరిలో పర్యాటక బోటు (ఫైల్‌ఫొటో)   

ఘటనా స్థలికి అధికారులు 
గోదావరిలో లాంచీ మునిగి గిరిజనులు గల్లంతయ్యారన్న సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పీఓ నిషాంత్‌కుమార్, ఏఎస్పీ అజిత, సబ్‌కలెక్టర్‌ వినోద్‌కుమార్‌లు దేవీపట్నం మండలం మంటూరు చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటిపడిన బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అంబులెన్స్‌లను మంటూరుకి తరలించారు.   

రంగంలోకి ప్రత్యేక బృందాలు 
దేవీపట్నం వద్ద లాంచీ ప్రమాద ఘటనలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను సంఘటనా స్థలానికి పంపినట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం దేవీపట్నం నుంచి కొండమొదలుకు ప్రయాణికులతో లాంచీ బయలుదేరిందన్నారు. దారిమధ్యలో వాడపల్లిలో ఇద్దరు ప్రయాణికులను దించేందుకు వెళ్తుండగా వాడపల్లి రేవుకు 10 కిలోమీటర్ల దూరంలో గాలి, వర్షం వల్ల లాంచీ తిరగబడిందని తెలిపారు. డ్రైవర్‌తోపాటు 10 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరినట్లు సమాచారం అందిందన్నారు. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాతో కలిసి తాను, తమ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ వివరించారు. కాగా, రాత్రి  కావడంతో వెలుతురు లేమి వల్ల సహాయచర్యలు నిలిచిపోయాయి.

లాంచీ మీద కూర్చున్నవారు బయటపడ్డారు 
ప్రమాద సంఘటనలో నేరం పుల్లయ్య, ఆయన కుమారుడు వెంకటేశ్వరరావు లాంచీ నుంచి దూకి నదిలో ఈదుకుంటూ పశ్చిమగోదావరి జిల్లా వైపు ఓడ్డుకు చేరుకున్నారు. వారు తమ అనుభవాన్ని మీడియాకు వెల్లడించారు. ‘‘తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం నుంచి లక్ష్మీవెంకటేశ్వర అనే సర్వీసు లాంచీ అదే జిల్లాలోని బొందూరు, కొచ్చిలూరు, పెద్దగూడెం, తాళ్లూరు, తెలిపేరు, కొండమొదలు గ్రామాలకు చెందిన గిరిజనులను ఎక్కించుకుని సాయంత్రం 4 గంటల సమయంలో కొండమొదలు గ్రామానికి బయల్దేరింది. కొంతదూరం ప్రయాణించాక మడిపల్లి గ్రామం వద్ద భీకరమైన సుడిగాలి ముంచెత్తింది. దీంతో లాంచీని ఒడ్డుకు తీసుకెళ్లి నిలిపేయాలని ప్రయాణికులు కోరినా సరంగు నిర్లక్ష్యంగా ముందుకు పోనిచ్చాడు. సుడిగాలి ఎక్కువ కావడంతో లాంచీ కిటికీలు, తలుపులు మూసివేశారు. గాలి తీవ్రతకు లాంచీ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో లాంచీపై కూర్చున్న దాదాపు 15 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. లాంచీ లోపల ఉన్న వారంతా గల్లంతయ్యారు’’ అని బాధితులు చెప్పారు. గల్లంతైన వారిలో ఒక మహిళా సర్పంచ్, ఓ వీఆర్వో ఉన్నట్లు తెలుస్తోంది.

లొంగిపోయిన లాంచీ యజమాని 
వాడపల్లి వద్ద ప్రమాదం నుంచి లైఫ్‌ జాకెట్‌తో బయటపడిన లాంచీ యజమాని ఎస్‌కే ఖాజా దేవీపట్నం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. ప్రమాదం జరిగిన తర్వాత వాడపల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా దేవీపట్నం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాడు. నదిలో మునిగిపోయిన లాంచీని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తలుపులు మూసివేసి ఉండడంతో గల్లంతైన వారంతా లాంచీలోనే చిక్కుకుపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. లాంచీ మునిగిపోయిన ప్రదేశాన్ని అధికారులు గుర్తించారు.  

ఎలా జరిగిందంటే.. 
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు, తాళ్లూరు, కొండమొదలు, కె.గొందూరు గ్రామాల ప్రజలు రోజువారీ అవసరాల కోసం లాంచీపై రోజూ దేవీపట్నం, పోలవరం వెళుతుంటారు. 
ఎప్పటిలాగే మంగళవారం వెళ్లే లాంచీలో ఉదయం ఈ నాలుగు గ్రామాలకు చెందిన సుమారు 60 మంది పిల్లాపాపలతో కలిసి దైనందిన అవసరాల కోసం బయలుదేరి వెళ్లారు. 
పనులు ముగించుకుని మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో అదే లాంచీలో తిరుగు ప్రయాణమయ్యారు. 
సుమారు రెండు గంటల ప్రయాణం అనంతరం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పెనుగులపాడు సమీపానికి రాగానే ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 
దీంతో లాంచీ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతూ ఇష్టమొచ్చినట్టు వెళ్తుండడంతో.. అందులోని ప్రయాణికులు వెంటనే లాంచీని ఒడ్డుకు తీసుకువెళ్లి ఆపేయాలని లాంచీ యజమాని ఎస్‌కే కాజాను కోరారు. 
​​​​​​​- కానీ రోజూ జరిగేదే కదా ఏమీ ఫర్వాలేదంటూ లాంచీని ఆ ఈదురుగాలుల్లోనే పోనిచ్చారు. 
​​​​​​​- లాంచీలోకి పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం.. అదే సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడం.. సారంగికి అనుభవం లేకపోవడంతో లాంచీ అదుపు తప్పి బోల్తా పడింది. 
​​​​​​​- దీంతో సుడిగాలిలో చిక్కుకున్న లాంచీ ఒక్కసారిగా మునిగిపోయింది. 
​​​​​​​- దానిలో ప్రయాణిస్తున్న 55 మంది మునిగిపోయారు.
​​​​​​​- లాంచీలో ఉన్న సిమెంట్‌ బస్తాలు ప్రయాణికులను ప్రమాదంలోకి నెట్టేందుకు కారణమయ్యాయి. 
​​​​​​​- విపరీతమైన గాలి వీస్తుండడంతో సిమెంట్‌ బస్తాలు తడిసిపోకుండా ఉండేందుకు లాంచీ చుట్టూ ఉన్న తలుపులను మూసివేశారు.
​​​​​​​- ఊహించని విధంగా లాంచీ నీట మునగడంతో అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు.
​​​​​​​- ప్రాణాలు దక్కించుకునేందుకు ఎంతో ప్రయత్నించారు. ఎట్టకేలకు ఐదుగురు లాంచీ సిబ్బందితోపాటు మరో పదిమంది ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. 
​​​​​​​- బయటపడిన వారిలో ఇద్దరు మహిళలు, పదేళ్ల బాలుడు, ముగ్గురు యువకులు ఉన్నారు. వీరిలో నలుగురు పశ్చిమ గోదావరి జిల్లా వాడపల్లికి, ఆరుగురు మంటూరుకు చేరుకున్నారు. 

మా అమ్మ, తాత కనిపించడం లేదు 
నేను, మా అమ్మ, తాత కొండమొదలు వెళ్లేందుకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో లాంచీ ఎక్కాం. ఈదురుగాలులకు లాంచీ మునిగిపోవడంతో ఫ్రిజ్‌ను గట్టిగా పట్టుకున్నా. థర్మాకోల్‌ ఉండటంతో ఫ్రిజ్‌ నదిలో తేలడంతో వాడపల్లి ఒడ్డుకు చేరుకున్నా. మా అమ్మ, తాత కనిపించడం లేదు. 
– అశ్విని, ప్రమాదంలో బయటపడ్డ 14 ఏళ్ల బాలిక 

ఈత రాకపోయినా దూకేశా 
లాంచీ ఒక్కసారిగా మునిగిపోవడంతో.. దూకకపోతే లాంచీ అడుగుకు వెళ్లి బయటకు రాలేక చనిపోతామన్న భయంతో.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గోదావరిలోకి దూకేశా. నాకు ఈత రాకపోయినా ప్రాణాలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ధైర్యం చేసి దూకేశా. నీటిలో కొట్టుకుపోతుంటే స్థానికులు చూసి నన్ను ఒడ్డుకు చేర్చారు.  
– తోకల పోశమ్మ, తాళ్లూరు 

కళ్లు కనిపించక కాపాడలేకపోయాం 
ఒకపక్క వర్షం, మరోపక్క లాంచీ నీటిలో మునిగిపోతుండడంతో లాంచీ టాపుపై ఉన్న మేము గోదావరిలోకి దూకి ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నాం. మేము బయటపడే సమయంలో లాంచీలో ఉన్నవారు రక్షించాలని హాహాకారాలు చేశారు. అయితే ఎవరెక్కడ ఉన్నారో తెలియక,  వర్షం వల్ల కళ్లు కనిపించక ఎవరినీ కాపాడలేకపోయాం. 
పట్టేల గణేష్‌ (సుద్దముక్క గ్రామం) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top