రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభ ఆమోదించడం రాష్ట్ర చరిత్రలో చీకటి రోజని వైఎస్‌ఆర్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్ర విభజన బిల్లును లోక్‌సభ ఆమోదించడం రాష్ట్ర చరిత్రలో చీకటి రోజని వైఎస్‌ఆర్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. రెండు ప్రాంతాల్లో అన్నదమ్ములను పైశాచికంగా విడదీసిన ఇటలీ నియంత సోనియాగాంధీ అని అన్నారు. సీమాంధ్రులకు ఎటువంటి ప్రయోజనాలు లేకుండా, సీమాంధ్రను ఎడారిలా చేయడానికి ఆమె కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఆమెకు వంత పాడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును సీమాంధ్ర ప్రజలను క్షమించరని అన్నారు. వేలాదిమందితో ఢిల్లీకి వెళ్లి నిరసనలు తెలిపినా, లోక్‌సభలో నాలుగు గోడల మధ్య రాష్ట్ర ప్రజలను నిలువునా చీల్చారని దుయ్యబట్టారు.
ఇంత జరుగుతున్నా చంద్రబాబు నాయుడు నోరు మెదపకుండా, నీరో చక్రవర్తిలా ప్రవర్తించారని విమర్శించారు. పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి, అప్రజాస్వామికంగా విభజన చేపట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. రాష్ట్రాన్ని విడదీయడానికి దాపురించిన రెండు దుష్టశక్తులు సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు అని ఆయన ధ్వజమెత్తారు. ఇటువంటి దుర్దినం ఏ రాష్ట్రానికీ రాకూడదని అన్నారు. కొన్ని కోట్ల మంది వద్దని అంటున్నా, తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడం కోసం, రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చి వేశారని అన్నారు. సీమాంధ్రలోని ఏడు కోట్ల మంది ఉసురు సోనియా గాంధీకి తగులుతుందని అన్నారు.