పసుపు పంటకు లాభాల పారాణి 

Benefit To Turmeric Farmers in AP - Sakshi

ఎకరాకు 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి 

ఒక్కొక్క రైతు నుంచి గరిష్టంగా 40 క్వింటాళ్లను సేకరిస్తున్న ప్రభుత్వం 

పెరిగిన కొనుగోలు కేంద్రాలు 

సాగు ఖర్చులు పోను ఎకరాకు కనీసం రూ.50 వేలకు పైనే మిగులు  

సాక్షి, అమరావతి:  ఐదేళ్ల తరువాత పసుపు రైతులు లాభాలు పొందుతున్నారు. వారి కష్టానికి.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు తోడు కావడంతో ఎకరానికి కౌలు, సాగు ఖర్చులు పోను ప్రతి రైతు కనీసం రూ.50 వేలకు పైగా లాభం పొందుతున్నాడు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల క్రితమే పసుపు పంట క్వింటాకు రూ.6,850 మద్దతు ధర ప్రకటించింది. పంట చేతికి వచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిచింది. పంటను కొనుగోలు చేసిన వారంలోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. దీంతో మరో మార్గం లేక ప్రైవేట్‌ వ్యాపారులు సైతం రైతుల నుంచి పోటీపడి పంటను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో సగటు పంటను పరిగణనలోకి తీసుకుని ఎకరా పొలం కలిగిన రైతు నుంచి 24 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని, రెండు ఎకరాల్లోపు భూమి కలిగిన రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఒక్కొక్క రైతు నుంచి గరిష్టంగా 40 క్వింటాళ్లను కొనుగోలు చేస్తోంది.  

సాగుకు ముందే ధర ప్రకటించి.. 
► సీఎం వైఎస్‌ జగన్‌ పసుపు, మిర్చి, చిరు ధాన్యాలకు సాగుకు ముందే మద్దతు ధర ప్రకటించారు.  
► దీంతో తాము పండించిన పంటను అమ్ముకోగలమనే ధీమా రైతులకు ఏర్పడింది.  
► గతంలో వ్యాపారులు రైతుల నుంచి క్వింటా పసుపును రూ.5 వేల నుంచి రూ.5,500 లోపే కొనుగోలు చేశారు. 2017–18లో రూ.5,450, 2018–19లో రూ.5,500లకు కొనుగోలు చేశారు.  
► రాష్ట్రంలో 29,654 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో అధికంగా ఈ పంట సాగయ్యింది. 
► మొత్తంగా 1.02 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.  
► కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎకరాకు సగటున 35 క్వింటాళ్ల దిగుబడి వస్తే శ్రీకాకుళం, వైఎస్సార్‌ జిల్లాల్లో 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. 
► ఎకరా కౌలుకు రూ.50 వేలు, సాగుకు రూ.80 వేలు, మొత్తంగా రూ.1.30 లక్షల ఖర్చు అవుతోంది.  
► 30 క్వింటాళ్ల పంటను కొనుగోలు కేంద్రంలో రైతులు అమ్ముకుంటే రూ.2.05 లక్షల వరకు నగదు వస్తోంది. అన్ని ఖర్చులు పోను రైతుకు ఎకరాకు రూ.65 వేల వరకు ఆదాయం లభిస్తోంది.  
► గతంలో రెండు, మూడు జిల్లాలకు ఒక పసుపు కొనుగోలు కేంద్రం ఉండేది. ఈ ఏడాది 8 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 
► రైతుల నుంచి 10,200 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుని, ఇప్పటివరకు 3 వేల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేసింది.  

దళారులు లేకుండా చేశాం 
పసుపు క్వింటాకు రూ.6,850 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైతులకు పంటను అమ్ముకోవచ్చనే ధీమా ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోగా మిగిలిన పంటకు కూడా ప్రైవేట్‌ మార్కెట్‌లోనూ రైతులకు మంచి ధర లభిస్తోంది. గరిష్ట సేకరణను 30 నుంచి 40 క్వింటాళ్లకు పెంచడంతో రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరుతోంది.  
– ఎస్‌.ప్రద్యుమ్న, ప్రత్యేక కమిషనర్, మార్కెటింగ్‌ శాఖ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top