లక్షణంగా ఇళ్లు

Beneficiaries Select For One Lakh Homes in Chittoor - Sakshi

పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో లబ్ధిదారుల ఎంపిక

రెండు విడతల్లో 49 వేల గృహాల మంజూరు

మరో 52 వేల గృహాలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి నివేదన  

నెరవేరనున్న పేదల సొంతింటి కల

జిల్లాలోని పట్టణ ప్రాంతాల పరిధిలో గూడులేని నిరుపేదలసొంతింటి కల నెరవేరనుంది. 2020 జనవరికి జిల్లావ్యాప్తంగా లక్ష గృహాల లక్ష్యం నెరవేరనుంది. ఇప్పటికే రెండు విడతల్లో 49,157 గృహాలకు మోక్షం కలిగింది. మూడో విడతలో మరో 52,215 గృహాల మంజూరుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతి పాదించినట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ నగేష్‌ తెలిపారు. వీటిని ఈ నెల 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలియజేశారు.

చిత్తూరు అగ్రికల్చర్‌: గూడులేని నిరుపేదలకు పక్కాగృహాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. ఉగాది పండుగ నాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే పక్కాగృహాల నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో పక్కాగృహాల మంజూరుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రెండు విడతల్లో 49,157 పక్కాగృహాలను మంజూరు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదాన్ని తెలిపాయి. మొదటి విడతలో 35,764 గృహాలు మంజూరుకాగా, రెండో విడతలో 13,393 గృహాలను మంజూరు చేసింది. మూడో విడతలో మరో 52,215 పక్కా గృహాలకు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రతిపాదలను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ కమిటీ ఆమోదించింది. ఈ నెల 30వ తేదీన ఢిల్లీలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ కమిటీ ఆమోదించాల్సి ఉంది. దీంతో జిల్లాలో మొత్తం 1,01,372 పక్కాగృహాలు నిరుపేదల దరిచేరనున్నాయి.

పథకం అమలు ఇలా..
పట్టణ ప్రాంతాల్లో పక్కా గృహాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే వైఎస్సార్‌ అర్బన్‌ పక్కాగృహాల పథకాల కింద నిధులను సంయుక్తంగా మంజూరు చేస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సబ్సిడీతో రూ.2 లక్షలు, లబ్ధిదారుని వాటా రూ.50 వేలు చొప్పున వెచ్చించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు చొప్పున అందిస్తాయి. గతంలో గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఉండి ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన అర్బన్‌ పరిధిలోకి వచ్చిన మండలాల్లోని లబ్ధిదారుకు కూడా ఈ విధానం వర్తిస్తుంది.

భూసేకరణకు కసరత్తు ముమ్మరం
జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అర్హులైన మహిళల పేరుతో ఇళ్ల పట్టాల మంజూరుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి, భూసేకరణకు నివేదికలు తయారు చేశారు. ప్రభుత్వ భూమి లేనిచోట ప్రైవేట్‌ భూమిని కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో 79 రెవెన్యూ గ్రామాలకు గాను 60 గ్రామాల్లో భూమి ఉండగా 13 గ్రామాల్లో భూమి అందుబాటులో లేదు. పీలేరు పరిధిలో 100 గ్రామాలకు గాను 84 గ్రామాల్లో 100 శాతం, మదనపల్లె పరిధిలో 46కు 41, పుంగనూరు పరిధిలో 82కి 71, చంద్రగిరి పరిధిలో 111కు 67, శ్రీకాళహస్తి పరిధిలో 173కి 48, సత్యవేడు పరిధిలో 169కి 129, నగరి పరిధిలో 102కి 54, జీడీ నెల్లూరు పరిధిలో 167కి 123, చిత్తూరు పరిధిలో 73కి 39, పూతలపట్టులో 114కి 49, పలమనేరులో 114కి 100, కుప్పం పరిధిలో 210కి 178 గ్రామాల్లో వంద శాతం భూమి ఉన్నట్లు అధికారులు తేల్చారు.

మిగిలిన గ్రామాల్లో ప్రభుత్వ భూమికోసం కసరత్తు చేస్తున్నారు. పూర్తిగా లేనిచోట కొనుగోలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 14 నియోజకవర్గాల్లో 1,540 రెవెన్యూ గ్రామాల పరిధిలో 1,043 గ్రామాల్లో 100 శాతం ప్రభుత్వం ఉంది. మిగిలిన 328 గ్రామాల్లో భూసేకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, చిత్తూరు, పూతలపట్టు, తిరుపతి నియోజకవర్గాల్లో భూమి కొరత ఉంది. జిల్లాలోని 8 నగరపాలక, మున్సిపాలిటీల పరిధిలో 34,609 మందికి 368.27 ఎకరాల భూమి అవసరముందని అధికారులు వెల్లడిస్తున్నారు. అందులో 148.93 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన భూమిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారుల నివేదికలు పేర్కొంటున్నాయి. జిల్లావ్యాప్తంగా భూమి కొనుగోలుకు రూ.22.72కోట్లు అవసరమని అధికారులు నివేదికలు సిద్ధం చేశారు.

పకడ్బందీగా కసరత్తు నిర్వహిస్తున్నాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాలు అందజేయడానికి పకడ్బందీగా కసరత్తు నిర్వహిస్తున్నాం. జిల్లాలోని మదనపల్లె, చిత్తూరు, తిరుపతి డివిజన్లలో సమీక్షలు నిర్వహించాం. ప్రభుత్వ భూమి కొరత ఉన్న చోట సమీపంలో మరో చోట ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనం చేసుకుంటున్నాం. గుర్తించిన భూమిని చదును చేయించే కార్యక్రమాన్ని తహసీల్దార్లు పర్యవేక్షిస్తున్నారు.– మార్కండేయులు, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top