భిక్షగాడి పేరిట ఆరు ఎకరాలు

Begger Pension Stoped For Land In Online Webaite In Chittoor - Sakshi

అధికారుల తప్పులతో వృద్ధాప్య పింఛన్‌కు నోచుకోని వైనం  

సెంటు భూమి లేకున్నా ప్రభుత్వ పథకాలకు అనర్హత

చిత్తూరు, పెద్దతిప్పసముద్రం: భవతీ బిక్షాందేహీ అంటూ కావిడి.. పట్టుకుని ఇల్లిల్లూ తిరిగి భిక్షాటన చేస్తున్న ఆ వృద్ధుడి పేరు వడ్డి పెద్దన్న (76). పెద్దతిప్పసముద్రం మండలం పట్టెంవాండ్లపల్లెకి చెందిన ఈయనకు వెనకా, ముందూ నా అనే వారు ఎవరూ లేరు.  తల దాచుకునేందుకు ఇల్లు కూడా లేకపోవడంతో నాలుగిళ్లు తిరిగి గ్రామస్తుల దయా దాక్షిణ్యాలతో పొట్ట నింపుకుని ఇదే గ్రామంలో మూతబడిన ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తల దాచుకుంటున్నాడు. ఇతని పేరిట 237512162539 నంబర్‌ ఆధార్‌ కార్డులో 76 ఏళ్ల వయసు ఉంది. రేషన్‌ కార్డులో కూడా 70 ఏళ్ల వయసు ఉన్నట్లు పేర్కొన్నారు.  కొన్నేళ్ల పాటు ఇతని కార్డు ఇన్‌ యాక్టివేషన్‌ అని రావడంతో సరుకులు పొందలేకపోయినా పలువురి సాయంతో కొద్ది నెలలుగా సరుకులు పొందుతున్నాడు. 

అయితే ఈ అనాథకు ఇంత వరకు వృద్ధాప్య పింఛన్‌ మాత్రం మంజూరు కాలేదు. జన్మభూమి–మాఊరుతో పాటు వివిధ గ్రామసభల్లో అర్జీలు ఇచ్చినా ఎవరూ కనికరించలేదు. పింఛన్‌ ఎందుకు మంజూరు కాలేదం టూ వృద్ధుడు అధికారులను ప్రశ్నిస్తే మీ పేరిట ఆరు ఎకరాల భూమి ఉన్నట్లు ఆన్‌లైన్‌లో వచ్చిందని చెప్పడంతో అవాక్కయ్యాడు. తన పేరిట ఎలాంటి భూములు లేకున్నా ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేశారో తనకు తెలియదని ఆయన వాపోతున్నాడు. తనకు పింఛన్‌ రాకున్నా పరవాలేదు, ఆరు ఎకరాల భూమి ఎక్కడ ఉందో చూపించి పట్టా ఇస్తే కౌలుకైనా ఇచ్చుకుని కాలం గడుపుతానని పెద్దన్న అధికారులకు విన్నవిస్తున్నాడు. అయితే పింఛన్‌ పొందేందుకు పెద్దన్నకు అర్హత ఉన్నా రెవెన్యూ రికార్డుల్లో భూమి ఐదు ఎకరాల కన్నా అధికంగా ఉన్నట్లు నమోదై ఉండడంతో తామేమీ చేయలేక పోతున్నామని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top