బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రకటించి నిధులు విడుదల చేయాలి | BC welfare association demands for BC sub plan and funds | Sakshi
Sakshi News home page

బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రకటించి నిధులు విడుదల చేయాలి

Nov 17 2013 12:05 AM | Updated on Mar 28 2018 10:56 AM

బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రకటించి వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.

చేవెళ్ల, న్యూస్‌లైన్:   బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రకటించి వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఈ నెల 24న నగరంలో జరిగే తెలంగాణ గౌడ సమర భేరి సన్నాహకాల్లో భాగంగా  శనివారం స్థానిక కేజీఆర్ ఫంక్షన్ హాలులో జిల్లా సదస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా  ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు చెందిన నిధులను వారి కోసమే ఖర్చు చేయడానికి బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
 వెనుకబడిన తరగతుల ప్రజల మధ్య ఐక్యత లేకపోవడంవల్లే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నామని ఆవేదన వ్యక్తంచేశారు.

కల్లుగీత వృత్తిని కార్పొరేట్ రంగంగా మార్చి అభివృద్ధిచేయాలని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి ఓట్లు మనవి, సీట్లు అగ్రవర్ణాలవారివంటూ దుయ్యబట్టారు. కల్లుగీత కార్మికులను, టీఎఫ్‌టీదారులను ఎక్సైజ్ అధికారులు మామూళ్ల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. కల్లును ఎక్సైజ్ నుంచి వేరుచేసి కో-ఆపరేటివ్ సొసైటీల పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాటిచెట్లు, ఈత చెట్లను పెంచడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడంలేదని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని 105 కల్లు దుకాణాలను మూసివేసి గౌడ కులస్తులకు ప్రభుత్వాలు తీరని అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. బీసీ కులాలన్నీ విద్య, రాజకీయ, ఆర్థిక రంగాలలో మరింత ప్రగతి సాధించాలని, అందుకోసం అందరం ఐకమత్యంగా కదులుదామని పిలుపునిచ్చారు.
 అణచివేతకు గురవుతున్న బీసీలు:  దేశిని చినమల్లయ్య
 గౌడ జేఏసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్యగౌడ్ ప్రసంగిస్తూ.. సమాజంలో 80 శాతం ఉన్న బీసీలు ఇప్పటికీ అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ఏ ప్రభుత్వమూ సరైన చర్యలు తీసుకోవడంలేదని పేర్కొన్నారు. సామాజికంగా బలపడితేనే  రాజ్యాధికారానికి దగ్గరవుతామన్నారు.
 ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి: వెంకన్న గౌడ్
 గౌడ, కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయిలి వెంకన్నగౌడ్ మాట్లాడుతూ.. కల్లుగీత వృత్తిదారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. గౌడ కులస్తులను అన్నిరంగాలలో సీమాంధ్ర పాలకులు ఎదగకుండా చేశారన్నారు. రాష్ట్రంలో 18 శాతమున్న గౌడ కులస్తులు దామాషా ప్రకారం 38 మంది ఎమ్మెల్యేలుగా ఉండాలని, కాని కేవలం ఐదుమంది మాత్రమే ఉండడం శోచనీయమన్నారు. గౌడ కులస్తులు తప్ప ఏ వృత్తిదారులూ ప్రభుత్వానికి పన్ను చెల్లించడంలేదని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. చెట్టుమీదినుంచి పడి మృతిచెందిన గీత కార్మికులకు కూడా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించకపోవడం అత్యంత దారుణమైన విషయమని
 దుయ్యబట్టారు.
 ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహం పెట్టాలి
 కల్లుగీత వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్ల శ్రీశైలంగౌడ్, తెలంగాణ గౌడ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర కొండయ్యగౌడ్, గౌడ జనహక్కుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు విజయకుమార్‌గౌడ్, సినీ నటుడు, అడ్వయిజరీ కమిటీ చైర్మన్ జైహింద్‌గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ జుంబాల నారాయణ గౌడ్, రాష్ట్ర నాయకులు రామక్రిష్ణగౌడ్, రామాగౌడ్, ప్రకాశ్‌గౌడ్, రాంచంద్రయ్యగౌడ్, రాఘవేందర్‌గౌడ్, పల్లె లక్ష్మణరావుగౌడ్, బొబ్బిలి రమేష్‌గౌడ్, కొండకల్ శంకర్‌గౌడ్, కాసుల సురేందర్‌గౌడ్ తదితరులు మాట్లాడుతూ.. గౌడ కులస్తుల  పోరాటం చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికులందరికీ ఇళ్లు,  పింఛ న్లు కూడా అందించాలన్నారు. తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement