అభాసుపాలవుతున్న బడికొస్తా పథకం

Badikosta Scheme Has Remained To Paperwork Only - Sakshi

కాగితాలకే పరిమితమైన  బడికొస్తా పథకం

నెలరోజుల్లో ముగియనున్న విద్యాసంవత్సరం 

సాక్షి, చీరాల : ప్రకాశం జిల్లా చీరాల మండలంలో బడికొస్తా పథకం  అభాసు పాలవుతోంది. విద్యాసంవత్సరం నెలరోజుల్లో ముగియనుండడంతో ఇప్పుడు సైకిళ్ల కేటాయింపులు చేయడం చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో అర్థం అవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల హాజరుశాతం పెంచేందుకు ప్రభుత్వం బడికొస్తా పథకం ప్రవేశపెట్టింది. 8,9 తరగతులు చదివే విద్యార్థినులకు బడికి చేరుకునేందుకు వీలుగా సైకిళ్ళు పంపిణీ చేస్తారు. అయితే ఈ పథకం ప్రారంభంలో బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం సత్ఫలితాలను ఇవ్వడంలేదు. ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల్లో 8,9 తరగతులు చదివే విద్యార్ధినులకు ఉచితంగా సైకిళ్ళు అందించేందుకు నిర్ణయించినా పాలకులు, అధికారులు స్పందించడంలేదు. 

ఇప్పుడు గుర్తొచ్చిందా..
విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ జరగలేదు. అయితే విద్యాసంవత్సరం కొద్దిరోజుల్లో ముగియనుండడంతో ప్రభుత్వం వీటిని ఆర్భాటంగా అందించేందుకు రంగం సిద్ధం చేయడం చేస్తే విద్యాశాఖ పనితీరు అర్థమవుతుంది. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు సైకిళ్లు పంపిణీ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బాలికలు సైకిళ్లు తొక్కుతూ వెళుతుంటే వాటిపై వేసిన స్టిక్కర్లను చూసి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందని అందరికి తెలిసేందుకే చేశారనే విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్‌ కావడంతో ఎన్నికల మైలేజ్‌గానూ ఈ బడికొస్తా పధకాన్ని వాడుతున్నారనేది మరో విమర్శ వినిపిస్తోంది.

నియోజకవర్గానికి 1433 సైకిళ్లు...
నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాలున్నాయి. వీటిలో చీరాల మండలంలో 2016–17 విద్యాసంవత్సరానికి గాను 148 మంది విద్యార్థినులకు అందించారు. ఈ తర్వాత 2017–18 విద్యాసంవత్సరానికి ఇవ్వలేదు. అలానే వేటపాలెం మండలంలో  2017–18 గాను 178 సైకిళ్లు అందించారు. 2018–19 విద్యాసంవత్సరానికి సైకిళ్ళును అందించలేదు. హైస్కూళ్ళ వారీగా విద్యార్థినుల సంఖ్య ఆధారంగా ప్రధానోపాధ్యాయులు వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు.

 
చీరాల మండలానికి 1029, వేటపాలెం మండలానికి 414 మందికి అందించేందుకు ప్రతిపాదనలు పంపించారు. అయితే సకాలంలో పంపిణీ చేయకపోవడంతో విద్యార్థినులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పాఠశాలలకు చేరుకుంటున్నారు. చీరాల పరిసర ప్రాంతాల్లోని గ్రామాల నుంచి విద్యార్థినులు ఆటోలు ద్వారా వస్తున్నారు. సైకిళ్ళు పంపిణీ చేయకపోవడంతో ఆటోలు, ఇతర మార్గాల ద్వారా వస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కూడా ఇదే తీరుగా ఉంది. కోడిగుడ్లు కూడా సక్రమంగా లేవు. చిన్న సైజు గుడ్లు పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top