విజయవాడ మెట్రోపై వెనుకడుగు | Back step on the Vijayawada Metro | Sakshi
Sakshi News home page

విజయవాడ మెట్రోపై వెనుకడుగు

Jun 2 2017 1:02 AM | Updated on Jul 28 2018 3:39 PM

విజయవాడ మెట్రోపై వెనుకడుగు - Sakshi

విజయవాడ మెట్రోపై వెనుకడుగు

విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది.

మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ
 
సాక్షి, అమరావతి: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కేవలం 12 కిలోమీటర్ల దూరం కోసం రూ.ఏడు వేల కోట్ల వ్యయంతో మెట్రో రైలు అవసరమా అనే దానిపై బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు మెట్రోతోపాటు పలు అంశాలపై చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మెట్రో లైను కంటే ఈ 12 కిలోమీటర్ల మేర రెండు కారిడార్లలోనూ రెండు లేయర్ల బ్రిడ్జిని నిర్మిస్తే ఎలా ఉంటుందో పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.

హైదరాబాద్‌లో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే తరహాలో మెట్రో బదులు రెండు లేయర్ల ఫ్లైఓవర్‌ నిర్మిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన రుణ పరిమితిని రూ.1859 కోట్ల నుంచి రూ.2,175 కోట్లకు పెంపుపై చర్చ జరిగినప్పుడు చంద్రబాబు అసలు ఈ ప్రాజెక్టు అనవసరమని అభిప్రాయపడినట్లు తెలిసింది. రెండు మెట్రో కారిడార్ల స్థానంలో రెండు లేయర్ల బ్రిడ్జి నిర్మిస్తే ఎలా ఉంటుంది, ఎంత ఖర్చవుతుందనే దానిపై ప్రతిపాదనలు తీసుకు రావాలని పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. విశాఖలో కారిడార్ల దూరం ఎక్కువ కాబట్టి అక్కడ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించి, విజయవాడలో మాత్రం విరమించుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం.

రెండేళ్లుగా ఈ ప్రాజెక్టు కోసం రూ.కోటను ఖర్చు పెట్టడంతోపాటు భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇప్పించి, టెండర్లు పిలిచి, ప్రత్యేకంగా దానికోసం ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసిన తర్వాత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అనవసరమనే ఆలోచనకు రావడం గమనార్హం. మొదటి నుంచి విజయవాడకు మెట్రో అవసరం లేదని రవాణా రంగ నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా పట్టించుకోని ప్రభుత్వం కోట్లు కుమ్మరించిన తర్వాత మేల్కొని పునరాలోచన చేయడం విశేషం.
 
వెంటనే కౌంటర్‌ ఇవ్వండి
కేంద్ర ప్రభుత్వం రేషన్‌ సరుకుల జాబితా నుంచి చక్కెరను తొలగిస్తుండడంతో దాని బదులు రాష్ట్ర ప్రభుత్వం వేరైనా ఏదైనా వస్తువు ఇస్తే ఎలా ఉంటుందనే అంశం సమావేశంలో చర్చకొచ్చింది. నీరు–ప్రగతి కార్యక్రమాన్ని మంత్రులు సీరియస్‌గా తీసుకోవడంలేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికల్లో వ్యతిరేక వార్తలు వచ్చినప్పుడు వాటిపై వెంటనే కౌంటర్‌ ఇవ్వడంలేదని, దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పినట్లు తెలిసింది. వ్యతిరేక వార్తలపై ఎప్పటికప్పుడు కౌంటర్‌ ఇవ్వాలని ఆదేశించారు.   తాను అడిగిన వెంటనే సమాచారం ఇవ్వాలని లేకపోతే సంబంధిత శాఖాధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement