ఆ ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తే ఇక అంతే...

ATMs Hackers draws money form other ATMs

హ్యాకింగ్‌కు గురైన పలమనేరు ఎంపీడీవో కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఏటీఎం

చెన్నై, పాండిచేరిలో డ్రా అవుతున్నట్టు సెల్‌కు మెసేజ్‌లు

నిందితులు చెన్నైకి చెందిన ప్రొఫెషనల్స్‌గా అనుమానం

చిత్తూరు(పలమనేరు) : చిత్తూరుజిల్లా పలమనేరులోని ఓ ఏటీఎంను హ్యాకర్స్‌ క్లోన్‌ చేశారు. దీంతో ఆ ఏటీఎంలో డ్రా చేసుకునే ఖాతాదారుని వివరాలు వెంటనే హ్యాకర్స్‌కు చేరుతున్నాయి. వారి వద్ద ఉన్న డమ్మీ కార్డుకు చిప్‌ను ఏటీఎంలో అమర్చి వారున్నచోటునుంచే ఖాతాదారుని అకౌంట్‌ నుంచి నగదును ఖాళీ చేస్తున్నారు. రెండు నెలలుగా ఈ తంతు సాగుతోంది. రెండ్రోజులుగా ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికి 12మందికిపైగా బాధితులు ఇలా రూ.20 లక్షలకు పైగా నష్టపోయారు. గంగవరం మండలం కీలపల్లికి చెందిన జేసీబీ యజమాని హరినాథ్‌ రెడ్డి (ఎస్‌బీఐ ఖాతా నెం:30887905462) ఈనెల 21న స్థానిక ఎంపీడీవో ఆఫీస్‌ ఎదురుగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.4వేలు డ్రా చేశాడు. తాజాగా శనివారం వేకువజామున అతని మొబైల్‌కు ఆరు ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి. ఇందులో రూ.40వేలు చొప్పున రెండుసార్లు, రూ.20వేలు చొప్పున నాలుగుసార్లు మొత్తం రూ.1.60లక్షలు చెన్నైలో డ్రా అయినట్లు ఆ మెసేజ్‌లలో ఉంది. దీంతో అతను తన ఏటీఎం కార్డును బ్లాక్‌ చేయించాడు. జరిగిన మోసంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఇదేవిధంగా పట్టణంలోని వాసీం అక్రం, శివకుమార్‌లతోపాటు మరో పదిమంది ఖాతాల్లోంచి గత నాలుగు రోజుల్లో డబ్బు డ్రా అయింది. వీరంతా కూడా అదే ఏటీఎంలో గతంలో డ్రా చేశాకే ఈ మోసాలు జరిగాయి. పట్టణంలోని వినాయకనగర్‌కు చెందిన వికలాంగురాలైన షాజిదాఖాన్‌ ఒంటరిగా ఉంటోంది. స్థానిక స్టేట్‌బ్యాంకు ఎటీఎం కార్డుతో ఈనెల 20న పొరుగింటికి చెందిన ఓ వ్యక్తి చేతికిచ్చి రూ.2వేలను డ్రా చేసుకురమ్మని చెప్పింది. దీంతో అతను ఆ నగదును ఎంపీడీవో కార్యాలయం వద్దనున్న ఏటీఎంలో డ్రా చేసి నగదును, ఏటీఎం కార్డును ఆమెకి ఇచ్చేశాడు. ఇలా ఉండగా అదే రోజు రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల దాకా చెన్నైలో డబ్బులు డ్రా చేస్తున్నట్టు ఆమె సెల్‌కు  ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి. ఏటీఎం కార్డు తనవద్దే ఉన్నప్పటికీ చెన్నైలో రూ.1.58లక్షలు ఎలా డ్రా అయ్యాయో అర్థంకాక ఆందోళన చెందారు. 

మెయిన్‌ రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎం హ్యాకింగ్‌ 
ఎంపీడీవో కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఏటీఎం రెండు నెలలుగా హ్యాకింగ్‌కు గురైంది. ఇలాంటి చోరీల్లో మంచి అనుభవం ఉన్నవారు ఈ ఏటీఎంలోకి ప్రవేశించి ఏటీఎం యంత్రం ఐడీని, సాప్ట్‌వేర్‌ను ఇతరత్రా సమాచారాన్ని క్లోనింగ్‌ చేసి చిప్‌రైడర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇక్కడి ఏటీఎంలో డబ్బులు డ్రా అవ్వగానే ఆ లావాదేవీలకు సంబంధించిన వివరాలు హ్యాకర్‌కు చేరుతుంటాయి. ఈ వివరాల ఆధారంగా డమ్మీ కార్డులకు చిప్‌లను అమర్చి వారు నగదును డ్రా చేస్తున్నారు. ఈ హ్యాకర్స్‌ వేకువజామున డబ్బులు డ్రా చేస్తుండడంతో ఖాతాదారులకు తెలియడంలేదు. సెల్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉంటే ఆ సమాచారం రాదు. క్లోనింగ్‌ ద్వారా హ్యాకింగ్‌ ఏపీలో తొలిసారి ఇక్కడ జరిగిందని తెలిసింది. గతంలో హైదరాబాద్‌లో ఇలాంటి హ్యాక్‌ జరిగింది. 

చెన్నై ముఠాపనేనా?
రెండు నెలలుగా ఏటీఏం కార్డుల్లో డ్రా అవుతున్న నగదు చెన్నై, పాండిచేరిలలోనే జరుగుతున్నట్టు బాధితుల సెల్‌లకు ఎస్‌ఎంఎస్‌లొస్తున్నాయి. దీంతో హార్డ్‌వేర్‌లో చేయితిరిగిన వారు మాత్రమే ఇలాంటి చోరీలకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా హ్యాకర్స్‌ తాము డ్రా చేసే ఏటీఎంలలో సీసీ కెమెరాలకు బబుల్‌గమ్‌ను అంటించి వ్యవహారం నడుపుతున్నట్టు తెలిసింది. దీంతో డ్రా చేసిన ఏటీఎం సెంటర్‌లో నిందితుల సీసీ పుటేజీలు దొరకవు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top