పలమనేరులో ఏటీఎం క్లోనింగ్‌!

ఎస్‌బీఐ ఏటీఎంను హ్యాక్‌ చేసిన వైనం

ఏటీఎం కార్డు జేబులో ఉన్నా నగదు ఖాళీ

ఒకే ఏటీఎంలో రూ.20 లక్షలకు పైగా డ్రా

చెన్నై, పాండిచేరిలో డబ్బు డ్రా అవుతున్నట్టు సెల్‌కు మెసేజ్‌

నిందితులు చెన్నైకి చెందిన ముఠాగా అనుమానం

ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. దాన్ని కొందరు దుండగులు తమకు అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఏటీఎం యంత్రాలను క్లోనింగ్‌ చేసి ఏటీఎం కార్డు లేకపోయినా రూ.లక్షలు డ్రా చేస్తున్నారు. పలమనేరులో ఇప్పటి వరకు 12 మంది ఖాతాల్లో నుంచి రూ.లక్షలు రూ.20 లక్షలకు పైగా నగదు స్వాహా చేశారు. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. 

పలమనేరు: గంగవరం మండలం కీలపల్లికి చెందిన జేసీబీ యజమాని హరినాథ్‌ రెడ్డి ఈ నెల 21న పలమనేరు ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో 4 వేలు డ్రా చేశాడు. తాజాగా శనివారం వేకువజామున అతని మొబైల్‌కు ఆరు ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి. అందులో రూ.40 వేలు రెండు సార్లు, రూ.20 వేలు నాలుగు సార్లు మొత్తం రూ.1.60 లక్షలు చెన్నైలో డ్రా చేసినట్టు ఉంది. ఏటీఎం కార్డు జేబులోనే ఉన్నా డబ్బు డ్రా కావడంపై ఆందోళన చెందిన అతను వెంటనే కార్డును బ్లాక్‌ చేయించాడు. మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఇదే విధంగా పట్టణంలోని వాసీం అక్రం, శివకుమార్‌తోపాటు మరో పదిమంది ఖాతాలనుంచి నాలుగు రోజు ల్లో డబ్బు డ్రా అయినట్టు గుర్తించారు. వీరంతా గంగవరం ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో డ్రాచేశాకే ఇలా జరిగినట్టు గుర్తించారు.

పట్టణంలోని వినాయకనగర్‌కు చెందిన వికలాంగురాలైన షాజిదాఖానం గత నెల 20న డబ్బు డ్రా చేసి ఇవ్వాలని పొరుగింటికి చెందిన వ్యక్తికి కార్డు ఇచ్చింది. అతను రూ.2 వేలు డ్రా చేసి కార్డు ఇచ్చేశాడు. ఇలా ఉండగా అదే రోజు రాత్రి 12 గంటల నుంచి 3 వరకు ఆమె సెల్‌కు డబ్బులు చెన్నైలో డ్రా చేస్తున్నట్టు ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి. ఏటీఎం కార్డు తనవద్దే ఉన్నప్పటికీ రూ.1.58 లక్షల నగదు ఎలా డ్రా అయిందో అర్థంగాక ఆమె ఆందోళన చెందింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఈ నెలలోనే రూ.20 లక్షలకు పైగా ఏటీఎం కార్డుల్లో నగదు ఖాళీ అయింది.

మెయిన్‌ రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎం హ్యాకింగ్‌
పలమనేరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఏటీఎం రెండు నెలల క్రితం హ్యాకింగ్‌ చేశారు. దుండగులు ఏటీఎం యంత్రం ఐడీని సాప్ట్‌వేర్‌ను ఇతరత్రా సమాచారాన్ని క్లోనింగ్‌ చేసి చిప్‌ రీడర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ జరిగే లావాదేవీలకు సంబందించిన వివరాలు హ్యాకర్‌కు చేరుతున్నాయి. ఈ వివరాల ఆధారంగా దుండగులు డమ్మీ కార్డులకు చిప్‌లను అమర్చి నగదును డ్రా చేస్తున్నారు.

రాష్ట్రంలో ఇదే తొలి హ్యాకింగ్‌
రకరకాల ఏటీఎం సైబర్‌ నేరాలు జరుగుతున్నా క్లోనింగ్‌ ద్వారా హ్యాకింగ్‌ చేసిన సంఘటన రాష్ట్రంలోనే తొలిసారి ఇక్కడ జరిగిందని తెలిసింది. గతంలో హైదరాబాద్‌లో ఇలాంటి హ్యాకింగ్‌ జరిగింది. 

ఏటీఎంలకు రక్షణలేకే....
ఎస్‌బీఐ కొన్ని ఏటీఎంలను తన పర్యవేక్షణలో ఉంచుకుంది. చాలా ఏటీఎంలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. ఏజెన్సీలు నిర్వహించే ఏటీఎంల వద్ద సెక్యూరిటీ లేదు. ఇదే హ్యాకర్లకు వరంలా మారింది. పలమనేరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న ఏటీఎంలోనూ సెక్యూరిటీ లేకపోవడంతోనే హ్యాకింగ్‌ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

చెన్నై ముఠా పనేనా..
రెండు నెలలుగా చెన్నై, పాండిచేరిలోని ఏటీఏం కార్డుల నుంచి డబ్బు డ్రా అవుతున్నట్టు బాధితుల మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయి. దీంతో హార్డ్‌వేర్‌లో నైపుణ్యం ఉన్న వారు మాత్రమే ఇలాంటి చోరీలకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా హ్యాకర్స్‌ తాము డ్రా చేసే ఏటీఎంలలో సీసీ కెమెరాలకు బబుల్‌గమ్‌ అంటించినట్టు తెలిసింది. దీంతో డ్రాచేసిన ఏటీఎం సెంటర్‌లో నిందితుల సీసీ పుటేజీలు దొరకే అవకాశం లేదని సమాచారం. ఏదైమైనా ఏటీఎం కార్డుల్లో డబ్బులు డ్రా అవుతున్న సంఘటనలతో జనం ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే ముఠాను పట్టుకుంటామని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top