ఇప్పుడేం చేస్తారు..! | Sakshi
Sakshi News home page

ఇప్పుడేం చేస్తారు..!

Published Sat, Jan 24 2015 2:22 AM

At the bottom of the mole on the side of Guntur heavy construction

కృష్ణా కరకట్ట దిగువన
భారీ భవనానికి శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్ శ్రీకారం
నేడు భూమిపూజ చేయనున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
ఇరిగేషన్ మంత్రి అనుమతి ఇస్తారా.. అడ్డుకుంటారా..
ఆక్రమణలపై సాగని స
ర్వే
 
విజయవాడ : కృష్ణానది తీరంలో గుంటూరు వైపు కరకట్ట దిగువన భారీ నిర్మాణానికి డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్ పేరుతో బీజేపీ నేతలు శ్రీకారం చుట్టారు. కరకట్ట వెంబడి ఆక్రమ నిర్మాణాలను అనుమతించబోమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించి నెల రోజులు కూడా గడవలేదు. ఇంతలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఆధ్వర్యాన నూతన భవన నిర్మాణాన్ని చేపట్టడం చర్చనీయాశంగా మారింది. ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మాణానికి ఏర్పాట్లుచేస్తున్న ఈ భవనానికి శనివారం ఉదయం కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు భూమి పూజ చేయనున్నారు.

ఎంపీ గోకరాజు గంగరాజు స్థలం విరాళం...

నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన సుమారు 40 సెంట్ల స్థలాన్ని డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారు. ఇదే ట్రస్ట్‌కు కొలనుకొండ వద్ద డాక్టర్ మాదల శ్రీనివాసరావు అర ఎకరం, నిడమానూరులో వెలగపూడి గోపాలకృష్ణ 1,000 గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మూడు ప్రదేశాల్లో భవనాలను నిర్మించాలని ట్రస్ట్ భావిస్తోంది. తొలుత కృష్ణా కరకట్ట వెంబడి ఎంపీ గంగరాజు ఇచ్చిన స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు ట్రస్ట్ సిద్ధమైంది. ఆ తర్వాత ఇదే భవనాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంగా మార్చే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 
మంత్రి ఉమాకు తెలియదా?


కృష్ణానది తీరంలో గుంటూరు వైపు సుమారు 45 పెద్దపెద్ద భవనాలు ఉన్నాయి. గత నెలాఖారులో మంత్రి ఉమా విలేకరులను తీసుకుని కృష్ణానదిలో పర్యటిస్తూ ఈ భవనాలను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కృష్ణానది తీరంలో ఇంత భారీ భవనాలు ఉన్నట్లు తనకు తెలియదని చెప్పారు. ఇప్పుడు ఆ భవనాల పక్కనే బీజేపీ మరో భవనాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నూతనంగా నిర్మించే భవనం గురించి మంత్రి ఉమాకు తెలియదా.. అని పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. భూమి పూజ తర్వాత ఈ భవనానికి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి, ఇరిగేషన్ అధికారులు అనుమతిస్తారా.. లేదా.. అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కృష్ణానది కరకట్ట దిగువన భారీ నిర్మాణాలకు ఇప్పటివరకు ఇరిగేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. గతంలో నాలుగైదు ప్రాంతాల్లో మాత్రమే షెడ్లు వేసుకునేందుకు అనుమతిచ్చారు. ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో నిర్మించే భవనాన్ని మంత్రి, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తారా.. లేక అడ్డుకుంటారా వేచి చూడాలి. కృష్ణా కరకట్ట వెంబడి అక్రమంగా నిర్మించిన భవనాలు, నూతన నిర్మాణాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి దేవినేని ఉమా భావిస్తున్నట్లు తెలిసింది.
 
 

Advertisement
Advertisement