నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి! | Asthma patient Died In Kurnool Hospital | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి!

Dec 12 2018 1:41 PM | Updated on Dec 12 2018 1:41 PM

Asthma patient Died In Kurnool Hospital - Sakshi

మృతదేహంతో రోడ్డుపై ఆందోళన చేయొద్దన్న ఎస్‌ఐ రమేష్‌తో వాగ్వాదం చేస్తున్న డీవైఎఫ్‌ఐ నాయకులు, (ఇన్‌సెట్‌) మృతిచెందిన శివమ్మ

కర్నూలు, ఆదోని: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. ఒకవైపు సౌకర్యాల లేమి, మరోవైపు సిబ్బంది నిర్లక్ష్యం వెరసి రోగులకు శాపంగా మారుతున్నాయి. ఆదోని ప్రభుత్వాసుపత్రిలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది. ఆస్తమాతో బాధపడుతూ మంగళవారం ఆసుపత్రిలో చేరిన శివమ్మ(40)కు సకాలంలో ఆక్సిజన్‌ ఇవ్వకపోవడంతో మృతిచెందింది. సిలిండర్‌లో ఆక్సిజన్‌ అయిపోయిందని, వెంటనే మార్చాలని డ్యూటీ నర్సు వద్ద మొరపెట్టుకున్నా స్పందించలేదని, దీనివల్లే శివమ్మ చనిపోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. మృతురాలి అన్న వీరేష్, భర్త మహాదేవ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదోని మండలం పెద్దహరివాణంకు చెందిన శివమ్మ ఆస్తమా బాధితురాలు. మంగళవారం ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైంది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆదోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.

ఉదయం 10 గంటలసమయంలో ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యుడు ఇంజెక్షన్‌ ఇచ్చి.. ఫ్లూయిడ్స్‌ ఎక్కించాలని, ఆక్సిజన్‌  కూడా పెట్టాలని కేస్‌షీట్‌లో రాశారు. ఈ మేరకు డ్యూటీ నర్సు చికిత్స ప్రారంభించారు. కాసేపటి తర్వాత పేషెంట్‌కు ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే కుటుంబ సభ్యులు సిలిండర్‌ మీటరు చూసి ఆక్సిజన్‌ అయిపోయిందని నిర్ధారించుకుని నర్సు వద్దకు వెళ్లి చెప్పారు. ఆక్సిజన్‌ అయిపోయిందో, లేదో చెప్పడానికి మీరేమైనా డాక్టర్లా? అంటూ నర్సు చీదరించుకున్నారు. వచ్చి చూడాలని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. పేషెంట్‌ పరిస్థితి విషమిస్తుండడంతో డ్యూటీ డాక్టరు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్‌ చేయగా.. స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. అందరూ చూస్తుండగానే మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శివమ్మ తుది శ్వాస వదిలింది. ఈమెకు భర్త, నలుగురు ఆడ కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

మృతదేహంతో ఆందోళన
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ  బంధువులు ఆసుపత్రి వద్ద శివమ్మ మృతదేహంతో ఆందోళనకు దిగారు. డీవైఎఫ్‌ఐ నాయకులు తాహెర్‌ అలీ, వీరేష్, తిక్కప్ప మరికొందరు మద్దతుగా పాల్గొన్నారు. గంటకు పైగా ఆందోళన నిర్వహించినా ఎవరూ స్పందించలేదు. దీంతో మృతదేహాన్ని తీసుకుని రోడ్డుపైకి వచ్చారు.  అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ రమేష్‌ వచ్చి వారితో చర్చించారు. రోడ్డుపై  ఆందోళన చేయడం తగదని, ఆసుపత్రి వద్దకు వెళ్లాలని సూచించారు. ఇందుకు ఆందోళనకారులు సమ్మతించారు. తిరిగి ఆసుపత్రి వద్ద అర గంట ఆందోళన చేపట్టినా ఎవరూ పట్టించుకోకపోవడంతో మళ్లీ రోడ్డుపైకి వచ్చారు. ఈ సందర్బంగా ఎస్‌ఐ, ఆందోళనకారులకు  మధ్య వాగ్వాదం జరిగింది. డాక్టర్‌ పద్మకుమార్‌ వారితో చర్చించేందుకు యత్నించారు. అయితే సూపరింటెండెంట్‌ రావాలని డిమాండ్‌ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు సూపరింటెండెండ్‌   లింగన్న వచ్చి చర్చించారు. సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం ఉంటే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement