అందని సేవలు తగ్గని రోగాలు | Arogya sri Card not use | Sakshi
Sakshi News home page

అందని సేవలు తగ్గని రోగాలు

Mar 15 2016 1:32 AM | Updated on Sep 3 2017 7:44 PM

గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు. నిరుపేద రోగిని సైతం కార్పొరేట్ ఆస్పత్రులు స్వాగతం పలికి చికిత్స అందించేవి.

 విజయనగరంఫోర్ట్: గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు. నిరుపేద రోగిని సైతం కార్పొరేట్ ఆస్పత్రులు  స్వాగతం పలికి చికిత్స అందించేవి.  నేడు అందుకు భిన్నంగా పరిస్థితి తయారైంది.  ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్‌టీఆర్ వైద్య సేవపై జిల్లా ప్రజలు పెదవివిరుస్తున్నారు. ఉచితంగా అందాల్సిన వైద్యానికి కాసులు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.    నిబంధనల పేరుతో వైద్య సిబ్బంది సకాలంలో సేవలు అందించడం లేదు. ప్రభుత్వం ఎన్‌టీఆర్ వైద్య సేవపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమవ్వడం గమనార్హం.  ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కంటే విజయనగరం జిల్లాలోనే ఎన్‌టీఆర్ వైద్యసేవపై అధికశాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చంనీయాంశమైంది. జిల్లాలో 11 ఆస్పత్రులకు ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకం ఉంది. వీటిలో 3 ప్రభుత్వ ఆస్పత్రులు కాగా 8 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి.
 
 ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి
 ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకం ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో  సౌకర్యాలు లేకపోవడం వల్ల రోగులకు వైద్య సేవలు అందని  పరిస్థితి. 133 రకాల వ్యాధులను ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తప్పించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్చారు. అయితే ఆ వ్యాధులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు లేకపోవడంతో రోగులు చేతి చమురు వదిలించుకుని ప్రైవేటు ఆస్పత్రిలో  వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి. ముఖ్యంగా  నరాల సంబంధ వ్యాధులకు వైద్యులు లేకపోవడంతో ఏ  చిన్న సమస్య వచ్చినా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాల్సిన అగత్యం దాపురించింది. కేంద్రాస్పత్రిలో ల్యాప్రోస్కోపిక్ పరికరం ఉన్నప్పటికీ  దానిని వినియోగించడం లేదు. సాధారణ పద్ధతిలోనే శస్త్రచికిత్సలు చేయడం వల్ల రోగులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి ఆశక్తి చూపడం లేదు. దీనికి తోడు ఆస్పత్రిలో చేరాక 20-25 రోజులైతే గాని ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయని పరిస్థితి.
 
 ప్రైవేటు ఆస్పత్రుల్లో   డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు
 ఎన్‌టీఆర్‌వైద్య సేవ పథకం ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లో   శస్త్రచికిత్స చేసుకున్న రోగుల వద్ద అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవే విషయాలను సర్వే సిబ్బందికి  రోగులు చెప్పినట్లు తెలిసింది.  ప్రభుత్వ సర్వే ప్రకారం ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకంపై విజయనగరం జిల్లా ప్రజలు చెప్పిన అభిప్రాయం ఈ విధంగా ఉంది: వైద్యం సరిగా అందడం లేదని 11.49 శాతంమంది, అన్ని వ్యాధులకు వర్తించడం లేదని 9.2 శాతం మంది, అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని 7.47 శాతం మంది, నిబంధనల పేరుతో జాప్యం చేస్తున్నారని 5.17 శాతం మంది, వైద్య నిపుణులు తగినంతమంది లేరని 4.49 మంది, అన్ని విషయాల్లో అసంతృప్తిగా ఉన్నట్లు 24.43 మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.    
 
 ఎప్పటికప్పుడు ఫిర్యాదుల పరిష్కారం
 ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకానికి సంబంధించి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యనిపుణులు, పరికరాల కొరత కారణంగా  సేవల్లో కాస్త జాప్యం జరుగుతోంది. రోగులకు సకాలంలో  సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం.  
 కె. అజయ్‌సాయిరాం ,
 ఎన్‌టీఆర్ వైద్య సేవ కో ఆర్డినేటర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement