ఎస్కేయూ వీసీ ఎవరో?

Applications For SKU VC Post Ananthapur - Sakshi

పదవి కోసం 148 మంది దరఖాస్తు

పోస్టు భర్తీకి అన్వేషణ కమిటీ నియామకం

జూన్‌ ఐదో తేదీనవిజయవాడలో సమావేశం

ప్రయత్నాలు ముమ్మరం     చేసిన ఆశావహులు

ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 11వ ఉపకులపతి (వైస్‌ ఛాన్సలర్‌) నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఉపకులపతి పదవికి అర్హులైన వారిని ఎంపిక చేయడానికి ముగ్గురు సభ్యులతో అన్వేషణ కమిటీ (సెర్చ్‌ కమిటీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న నియామకం చేస్తూ జీఓ జారీ చేసింది. కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నామినీగా ఉన్నత విద్య ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఆదిత్యనాథ్‌ దాస్, ఎస్కేయూ పాలకమండలి తరఫు నామినీగా ప్రొఫెసర్‌ పి.జార్జ్‌ విక్టర్‌ (మాజీ ఉపకులపతి, ఆదికవి నన్నయ్య వర్సిటీ, రాజమహేంద్రవరం), యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ తరఫు నామినీగా ప్రొఫెసర్‌ హెచ్‌సీఎస్‌ రాథోర్‌ (సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ సౌత్‌ బిహార్, పాట్నా, బిహార్‌) సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులు జూన్‌ ఐదో తేదీన విజయవాడలో సమావేశమై ఒక్కొక్కరు ఒక్కో పేరు ప్రతిపాదిస్తారు.

ఇందులో నుంచి ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు గవర్నర్‌ /ఛాన్సలర్‌ ఉపకులపతిగా నియమిస్తారు. ఎస్కేయూ పదో ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్‌ పదవి గడువు జూన్‌ 22తో ముగియనుంది. అయితే ఆయన రెండు నెలల ముందుగానే పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఏప్రిల్‌ 25న ఉపకులపతి రాజీనామాను ఆలస్యంగా ఆమోదించింది. ఇన్‌చార్జ్‌ ఉపకులపతిగా ప్రొఫెసర్‌ ఎంసీఎస్‌ శుభను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. జూన్‌ 22లోపే కొత్త ఉపకులపతిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ఎన్నికల నేపథ్యంలో ఆరు నెలల ముందు ఎలాంటి నియామకాలూ చేపట్టకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో ఉపకులపతి పదవులు ఖాళీ అయిన అన్ని వర్సిటీలకు నియమించాలని ప్రభుత్వం భావించింది. 

ఎవరిని వరించెనో..?
ఎస్కేయూ వీసీ పదవికి 148 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 23 మంది ఎస్కేయూ ప్రొఫెసర్లు ఉన్నారు. వాస్తవంగా పదేళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఔట్‌స్టాండింగ్‌ కింద పదేళ్ల అనుభవం లేని వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చునని నిబంధన విధించడంతో ఎస్కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.సుధాకర్‌బాబు దరఖాస్తు చేసుకున్నారు. పదో ఉపకులపతిగా ఉన్న రాజగోపాల్‌ ఓపెన్‌ కేటగిరికి చెందిన వారు. దీంతో తాజాగా బీసీ, ఎస్సీ,ఎస్టీ కేటగిరి వారికి అవకాశం కల్పించనున్నారు. బీసీ కేటగిరి వారికి అవకాశం కల్పిస్తే ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ ఉపకులపతిగా ఉన్న ఆచార్య ఎంసీఎస్‌ శుభ పేరును పరిశీలించే అవకాశం ఉంది.  

ఎస్కేయూ ఉపకులపతి పదవి ఎలాగైనా సాధించాలనే ప్రయత్నంలో జేఎన్‌టీయూ అనంతపురం ప్రొఫెసర్లు కూడా తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిడి తీసుకవస్తున్నారు. ఆశావహులు ఎవరి స్థాయిలో వారు పైరవీలు మొదలుపెట్టారు. ప్రభుత్వం మాది అని చెప్పుకునే సామాజిక వర్గం వారు ఈ దఫా అయినా తమ వారికి ఉపకులపతి పదవి దక్కించుకోవాలని ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. సొంత యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఉపకులపతి పదవి ఇవ్వకూడదనే నియమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల నుంచి పాటిస్తోంది. దీంతో ఇతర వర్సిటీ ప్రొఫెసర్లకే ఉపకులపతి పదవి వరించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top