
సాక్షి, అమరావతి: త్వరలో స్కిల్ డెవలప్‌మెంట్ స్టోర్స్ ఏర్పాటు కానున్నాయి. జాతీయ రహదారులకు ఇరువైపులా పెట్రోల్ బంకుల ఆవరణలో ఈ స్టోర్స్ ఏర్పాటుకానున్నాయి. వీటిలో చేతివృత్తి కళాకారులు తయారుచేసిన వివిధ రకాల వస్తువుల అమ్మకాలు జరగనున్నాయి. సేంద్రియ ఎరువులతో పండించిన పంటలకు సంబంధించిన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి.
చేతివృత్తి కళాకారుల ఆర్థిక పరిస్థితుల మెరుగుదలకు ప్రత్యేక పథకాలు అమల్లోకి తీసుకురావాలన్న సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ ప్రతిపాదనలు తయారుచేసింది. పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు వచ్చే వాహనదారులు ప్రత్యేకతలు కలిగిన ఈ స్టోర్స్‌లోని వస్తువులు, ఆహారపదార్థాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని స్కిల్ డెవలప్‌మెంట్ నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. ప్రయోగాత్మకంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు స్టోర్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఉపాధి అవకాశాలు, ఆర్థిక వెసులుబాటు
రాష్ట్రంలోని జాతీయ రహదారులకు ఇరువైపులా హిందుస్థాన్, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్లు పెట్రోలు, డీజిల్ బంకులను డీలర్ల వ్యవస్థ ద్వారా నిర్వహిస్తున్నాయి. కొందరు నిర్వాహకులకు పెట్రోల్ బంకులతో పాటు.. కన్సూ్యమర్ ప్రొడక్ట్స్ విక్రయాలకు అదనంగా స్థలాలున్నాయి. ఈ స్టోర్స్‌లో మార్కెట్‌లో లభించే సాధారణ వస్తువులే లభిస్తుండటంతో వాహనదారులు వాటి కొనుగోలుకు ఆసక్తి చూపకపోవడంతో అవి నిరుపయోగంగా మిగిలిపోయాయి. వీటిలో స్టోర్స్ ఏర్పాటుకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. ఆయిల్ కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకుంది.
ఈ స్టోర్స్‌లో కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణలు, విజయనగరం జిల్లా గుడితికి చెందిన రాగి పాత్రలు, గొల్లప్రోలు కలంకారీ, సరసరాపురం లేసులు, మచిలీపట్నం గోల్డు కవరింగ్ ఆభరణాలు, ఏలూరు తివాచీలు, దుర్గి సాఫ్ట్ స్టోన్ క్వారింగ్ బొమ్మలు, నరసరావుపేట తోలుబొమ్మలు, తిరుపతిలో ఉడ్ కార్వింగ్‌తో చేసిన దేవుని బొమ్మలతో పాటు.. ఇతర ప్రాంతాల చేతివృత్తి కళాకారులు తయారుచేసిన బొమ్మలను విక్రయిస్తారు. లేపాక్షి సంస్థ నిర్వహిస్తున్న రీతిలోనే కళాకారుల నుంచి వస్తువులను తీసుకుని విక్రయానంతరం నగదు అందజేస్తారు. ఈ విధానం వలన ఉపాధి అవకాశాలతో పాటు.. చేతివృత్తి కళాకారుల వస్తువుల అమ్మకాలు పెరిగి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నాయని.. అనుమతి రాగానే ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.