‘బ్రీఫ్‌కేసే నా ఆఫీసు’ | ap press acadamy chairman vasudeva deekshitulu seeks its own building | Sakshi
Sakshi News home page

‘బ్రీఫ్‌కేసే నా ఆఫీసు’

May 12 2017 8:48 AM | Updated on Aug 18 2018 9:09 PM

‘బ్రీఫ్‌కేసే నా ఆఫీసు’ - Sakshi

‘బ్రీఫ్‌కేసే నా ఆఫీసు’

ప్రెస్‌ అకాడమీకి సొంత సిబ్బంది లేరని, చివరకు మొబైల్‌ ఆఫీసులా మారిపోయిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ వి.వాసుదేవ దీక్షితులు వాపోయారు.

  •     ప్రెస్‌ అకాడమీకి సొంత భవనమే లేదు
  •     ఆరువేల అడుగుల స్థలం అడిగితే ఇస్తామనే అంటున్నారు
  •     ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ వాసుదేవ దీక్షితులు ఆవేదన

  • ఒంగోలు ‌: ‘రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు అవుతున్నా రాజధానిలో ప్రెస్‌ అకాడమీకి ఇంతవరకు సొంత భవనం కేటాయించలేదు. ఆరువేల అడుగుల స్థలం ఇవ్వాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరితే కేటాయిస్తామని చెబుతూ వస్తున్నారు. ప్రెస్‌ అకాడమీకి సొంత సిబ్బంది లేరు. చివరకు మొబైల్‌ ఆఫీసులా మారిపోయింది.

    ఒక్క మాటలో చెప్పాలంటే నా బ్రీఫ్‌ కేసే నా ఆఫీసు’ అని ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ వి.వాసుదేవ దీక్షితులు వాపోయారు. ఒంగోలులోని ఐఎంఏ హాలులో గురువారం మీడియాతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాల కారణంగా ప్రెస్‌ అకాడమీ ఉందా? అనే అనుమానం జర్నలిస్టులతోపాటు ప్రజల్లో కూడా నెలకొందన్నారు.

    రాష్ట్ర విభజన వల్ల వచ్చిన కష్టనష్టాలు ప్రెస్‌ అకాడమీకి మరింత ఇబ్బందులు కలిగించాయని చెప్పారు. రాష్ట్ర విభజనకు సంబంధించి 140 అంశాలు ఉన్నాయని, అందులో ప్రెస్‌ అకాడమీ కూడా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రెస్‌ అకాడమీ ఒక యూనివర్సిటీ అని, దానికి తాను వైస్‌ ఛాన్సలర్‌ వంటివాడనని చెప్పారు. జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చేందుకు రెండు మూడు మండలాలకు కలిపి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

    జర్నలిస్టుల ఉద్యోగం డైలీ రెన్యువల్‌ బేస్‌గా మారిపోయిందని రచన జర్నలిజం కాలేజీ ప్రిన్సిపాల్‌ ఉమా మహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంగ్లిష్‌ అనువాదం చేసేవారికి మాత్రం మంచి భవిష్యత్‌ ఉందన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌ అకాడమీ కార్యదర్శి డి.శ్రీనివాస్, సమాచార పౌరసంబంధాలశాఖ ఆర్‌జేడీ వెంకటేష్, సహాయ సంచాలకులు వెంకటేశ్వర ప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాలు సమస్యలపై చైర్మన్‌కు వినతిపత్రాలు సమర్పించాయి.

    జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్‌ అకాడమీ ఏం చేస్తోంది?
    ‘ప్రెస్‌ అకాడమీ జర్నలిస్టుల సంక్షేమానికి ఏమి చేస్తోందని ఏపీయూడబ్ల్యూజే ప్రకాశం జిల్లా అధ్యక్షుడు సురేష్‌ ప్రశ్నించారు. చైర్మన్‌ను ఆర్భాటంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. కమిటీ సభ్యులను ఎందుకు నియమించలేదని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి చేస్తున్న కృషిలో ఇక్కడి ప్రభుత్వం సగం కూడా చేయడం లేదని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి.బ్రహ్మం ఆవేదన వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement