ఏపీ నూతన గవర్నర్‌కు ఘనస్వాగతం

AP New Governor Biswa Bhusan Harichandan Reaches Gannavaram Airport - Sakshi

గన్నవరం చేరుకున్న విశ్వభూషణ్‌ హరిచందన్‌

స్వాగతం పలికిన సీఎం జగన్‌, మంత్రులు, అధికారులు

దుర్గమ్మను దర్శించుకున్న నూతన గవర్నర్‌

సాక్షి, విజయవాడ : రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందన్‌, ఆయన సతీమణి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌ దంపతులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ ఏపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎయిర్‌పోర్టు నుంచి దుర్గాదేవి దర్శనం కోసం గవర్నర్‌ విజయవాడకు వెళ్లగా..సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయానికి పయనమయ్యారు.

అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్‌..
ఏపీ నూతన గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కనకదుర్గాదేవి దర్శనార్థం విజయవాడ చేరుకున్నారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఇంద్రకీలాద్రిపై గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఆయన వెంట కమిషనర్‌ పద్మ ఉన్నారు. మేళతాళాలు, పూరణకుంభంతో ఆలయ సిబ్బంది విశ్వభూషణ్‌ ఆహ్వానం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విశ్వభూషణ్‌ వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈవో కోటేశ్వరమ్మ ఆయనకు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదం, పట్టువస్త్రాలను అందించారు.


ఏపీ నూతన గవర్నర్‌గా విశ్వభూషన్‌ బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ విశ్వభూషణ్‌తో గవర్నర్‌గా ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం అతిథులకు రాజ్‌భవన్‌ అధికారులు తేనీటి విందు ఏర్పాటు చేశారు. విజయవాడలోని ముఖ్యమంత్రి పాత క్యాంపు కార్యాలయంలో రాజ్‌భవన్‌ ఏర్పాటు పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top