మొండి‘హస్తం’ | Sakshi
Sakshi News home page

మొండి‘హస్తం’

Published Thu, Jul 17 2014 12:46 AM

మొండి‘హస్తం’

  •      అమ్మహస్తం రద్దుకు ప్రభుత్వం నిర్ణయం
  •      ఎన్‌టీఆర్ ప్రజాపంపణీ పేరుతో కొత్త పథకం
  •      ఇప్పటికే పచ్చ రంగులో తాత్కాలిక కూపన్లు
  •      కిలో రూపాయి బియ్యం ధర పెరిగే అవకాశం
  • విశాఖ రూరల్ : ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పేదవాడి ‘చౌక’ సరుకులు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. బడుగు జీవుల బతుకులు భారం కానున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ‘అమ్మహస్తం’ పథకానికి మంగళం పాడేందుకు సిద్ధమవుతోంది. సరుకుల్లో కోత విధించి ఎన్‌టీఆర్ ప్రజా పంపిణీ పేరుతో కొత్త పథకం అమలుకు నిర్ణయించింది. చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై అందిస్తున్న సరుకుల ధరలను పెంచాలని భావిస్తోంది. ప్రధానంగా కిలో రూపాయి బియ్యాన్ని రూ.5కు విక్రయించాలని యోచిస్తోంది. రేషన్‌దాకాణాల ద్వారా ఏయే సరుకులు ఎంత ధరకు విక్రయించాలన్న విషయంపై త్వరలోనే విధివిధానాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తాత్కాలిక రేషన్‌కూపన్లు పచ్చరంగుకు మారిపోయాయి. ఎన్‌టీఆర్ ప్రజాపంపిణీ పేరుతో ఉన్న వాటిని అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు.
     
    5 నెలలుగా పామాయిల్ లేదు

    జిల్లాలో 12.5 లక్షల తెల్లరే షన్‌కార్డుదారులు ఉన్నారు. చౌక దుకాణాల నుంచి వీరు ప్రతీ నెలా ఏ వస్తువు తీసుకోకపోయినా పామాయిల్‌ను మాత్రం కచ్చితంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మార్చి నుంచి దీని పంపిణీ నిలిచిపోయింది. ప్రస్తుతం బహిరంగమార్కెట్‌లో పామోలిన్ లీటర్ ధర రూ.63లకు పైగా ఉంది. దీనిని రూ.40కే చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. మలేషియా నుంచి క్రూడ్‌ను కొనుగోలు చేయగా కాకి నాడ పోర్టుకు తీసుకువచ్చి అక్కడ పామాయిల్‌ను ప్యాకింగ్ చేసి జిల్లాలకు కేటాయించేవారు. కానీ గత ఐదు నెలలుగా పామాయిల్‌ను కొనుగోలు చేయలేదు. దీంతో కార్డుదారులు బహిరంగ మార్కెట్‌లో లీటర్ పామోలిన్‌ను రూ.63 నుంచి రూ.68కు కొనుగోలు చేయాల్సి వస్తోంది.
     
    చౌక బియ్యం ధర పెంపు!

    చౌక బియ్యం ధర  పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కిలో రూ.2 బియ్యం పథకాన్ని ప్రారంభించారు. తరువాత అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు దీనిని కార్డుదారులకు భారంగా మార్చేశారు. తొలుత రూ.3.25కు, తరువాత రూ.5కు పెంచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ రూ.2కే కిలో బియ్యాన్ని అందించారు. తరువాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కిలో రూపాయికే అందించారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు బియ్యం కిలో రూ.5కు విక్రయించాలని నిర్ణయించినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. చౌక వస్తువుల ధరలు పెరిగే సూచనలు ఉన్నాయని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. దీంతో కార్డుదారుల్లో ఆందోళన మొదలైంది.
     
    నెలకో వస్తువు మాయం

    తెల్లకార్డుదారులకు గత ప్రభుత్వం అమ్మహస్తం పథకంలో లీటర్ పామాయిల్, కందిపప్పు, గోధుమలు, గోధుమపిండి, ఉప్పు కిలోచొప్పున, పంచదార 500 గ్రాములు, కారం 250 గ్రాములు, పసుపు 100 గ్రామాలు, చింతపండు అరకిలో కలిపి రూ.185కే అందిస్తామని ప్రకటించింది.  వాటిని ఒక్క నెల కూడా సక్రమంగా పంపిణీ చేయలేక చేతులెత్తేసింది. ఈ సరుకుల్లో నాణ్యత లేకపోవడంతో కార్డుదారులు ఆసక్తి చూపించ లేదు. ఫలితంగా తొలుత కారం, పసుపు, చింతపండు పంపిణీని నిలిపివేశారు. పురుగులు పట్టిన గోధుమలు, గోధుమ పిండి పంపిణీ చేస్తున్నప్పటికీ ఎవరూ విడిపించుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం కందిపప్పు, పంచదార మినహా మిగిలిన అన్ని సరుకుల పంపిణీ నిలిచిపోయింది.   కొత్త ప్రభుత్వం వీటిని కూడా ఆపేస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
     

Advertisement
 
Advertisement
 
Advertisement