‘ అర్చకులకు’ రూ.5,000 సాయం 

AP Govt Helping Hand To Priests  - Sakshi

నెలవారీ జీతం, ధూప దీప నైవేద్యం ద్వారా లబ్ధి పొందని వారికి వర్తింపు

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన అర్చకులను ఆదుకోవాలని సీఎం జగన్‌ నిర్ణయం

కృతజ్ఞతలు తెలిపిన ఏపీ అర్చక సమాఖ్య

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆలయాల్లో భక్తుల దర్శనాల నిలిపివేతతో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రూ. 5,000లు గ్రాంట్‌ రూపంలో చెల్లించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. దేవదాయ శాఖ నుంచి ఎలాంటి నెలవారీ జీతాలు పొందని, ధూప దీప నైవేద్యం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందని వారికి అర్చక సంక్షేమ నిధి నుంచి ఈ సాయాన్ని చేయనున్నట్టు మంత్రి తెలిపారు. 

2,500 మంది అర్చకులకు లబ్ధి.. 
లాక్‌డౌన్‌ కారణంగా దేవాలయాలలోకి భక్తులను అనుమతించడం లేదు. ప్రస్తుతం అర్చకులు మాత్రమే ఏకాంతంగా నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.  
► దీంతో చిన్న దేవాలయాలలో ఎలాంటి ఆదాయ వనరులు లేని కారణంగా అర్చకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. 
► ధూప దీప నైవేద్యం, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా 2,800 మందికి పైగా అర్చకులకు ప్రతి నెలా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుంది. ఈ రెండు పథకాలూ వర్తించని వారు రాష్ట్ర వ్యాప్తంగా 2,500 మంది దాకా పలు ఆలయాల్లో పనిచేస్తున్నారు. 
► అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ. 5000 గ్రాంటు మంజూరు చేయాలని ఆదేశించారు. 
► ఈ నిర్ణయం కారణంగా అర్చక సంక్షేమ నిధిపై సుమారు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల భారం పడనుంది.

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు 
కరోనా విపత్కర పరిస్థితుల్లో అర్చకులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్‌ అర్చక సమాఖ్య సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లగానే సానుకూలంగా స్పందించారు. అర్చకులకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు ప్రకటించినందుకు అర్చక సమాఖ్య తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 
– అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, పెద్దింటి రాంబాబు (ఆంధ్రప్రదేశ్‌ అర్చక సమఖ్య ప్రధాన కార్యదర్శి, కార్యనిర్వాహక కార్యదర్శి) 
 
చిన్న ఆలయాల్లో అర్చకులను ఆదుకునే దిశగా నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు. 
– ద్రోణంరాజు రవికుమార్, అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top