కాలేజీ చదువులు | Ap Governments Focus On Raising Educational Standards | Sakshi
Sakshi News home page

కాలేజీ చదువులు

Sep 21 2019 4:24 AM | Updated on Sep 21 2019 4:24 AM

Ap Governments Focus On Raising Educational Standards - Sakshi

సాక్షి, అమరావతి
రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఆధోగతిలో ఉన్నట్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరీక్షల ఫలితాల్లో తేటతెల్లమైంది. ఇటు ప్రభుత్వంలో అటు ప్రైవేట్‌ రంగంలో ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు ఇతర డిగ్రీ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు బాగా దిగజారి పోయాయనేందుకు సచివాలయ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం నిదర్శనంగా నిలుస్తోంది. పంచాయతీ కార్యదర్శి డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బీటెక్‌ (కంప్యూటర్స్‌)తో పాటు పీజీ చేసిన వారు ఏకంగా 2,72,088 మంది పరీక్షలు రాశారు. అయితే ఇంత మంది పరీక్షలు రాస్తే ఉత్తీర్ణులైన వారి సంఖ్య చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. కేవలం 3,623 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించడం చూసి ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఫలితాలు విద్యాలయాల్లో విద్యా ప్రమాణాలను ఎత్తి చూపుతున్నాయని ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వ్యాఖ్యానించారు. డిజిటల్‌ అసిస్టెంట్‌ పరీక్షకు సంబంధించి 150 మార్కులకు గాను 60 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లు. అయితే పరీక్ష రాసిన వారిలో ఉత్తీర్ణత కేవలం 1.33 శాతమే ఉండటం విద్యా ప్రమాణాలు ఇంత దిగజారిపోయాయా అని ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 11,158 డిజిటల్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా ఉత్తీర్ణులైన వారు కేవలం 3,623 మంది మాత్రమే ఉండటం గమనార్హం. వార్డు శానిటేషన్‌ కార్యదర్శి పోస్టుల ఉత్తీర్ణత శాతం కూడా విద్యా ప్రమాణాలను ఎత్తి చూపింది. ఈ పోస్టులకు 52,334 మంది పరీక్షలు రాస్తే, కేవలం 1,474 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారు పరీక్షలు రాసినప్పటికీ కనీస అర్హత మార్కులను కూడా సాధించలేకపోయారు. అంటే పరీక్షలు రాసిన వారిలో కేవలం 2.8 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు.

మొత్తం వార్డు శానిటేషన్‌ కార్యదర్శి పోస్టులు 3,648 ఉండగా 52,334 మంది పరీక్షలు రాయగా కేవలం 1,474 మందే ఉత్తీర్ణులవ్వటం గమనార్హం. అలాగే గ్రామ వ్యవసాయ అసిస్టెంట్‌ పోస్టుల పరీక్షల ఉత్తీర్ణత శాతం చూస్తే అగ్రికల్చర్‌ బీఎస్సీ విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయనే అనుమానం కలుగుతుంది. 6,714 గ్రామ వ్యవసాయ అసిస్టెంట్‌ పోస్టులకు 22,622 మంది పరీక్షలు రాయగా కేవలం 6,239 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే ఉత్తీర్ణత 27.57 శాతం మాత్రమే. వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ కార్యదర్శి పోస్టుల పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంది. 3,770 పోస్టులకు 12,643 మంది పరీక్ష రాయగా 2,096 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే ఉత్తీర్ణత 16.57 శాతం మాత్రమే.  

విద్యా ప్రమాణాలు పెంచడంపై సర్కారు దృష్టి
ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చిన గత ప్రభుత్వాలు ఆ కాలేజీల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల గురించి పట్టించుకోలేదు. ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలను ప్రోత్సహించిన గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగంలోని కాలేజీలను నీరుగార్చాయి. దీంతో అటు ప్రైవేట్‌ రంగం, ఇటు ప్రభుత్వ రంగంలోని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు నిర్వీర్యం అయినట్లు సచివాలయ ఉద్యోగుల పరీక్షల ఉత్తీర్ణత శాతం స్పష్టం చేస్తోంది. ఈ పరీక్షల ఉత్తీర్ణత శాతాలతో సంబంధం లేకుండా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేట్‌ రంగంలోని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఉన్నత విద్యా సంస్థల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలోని విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలను పెంచనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement