రాష్ట్రంలో కొత్తగా 34,350 ఉద్యోగాల భర్తీ | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా 3,775 వార్డు సచివాలయాలు

Published Sat, Jul 20 2019 7:30 PM

AP Government Releases Guidelines Of  Ward Sachivalayam - Sakshi

అమరావతి: గ్రామ సచివాలయాల తరహాలోనే పట్టణ ప్రాంతాల్లోనూ వార్డు సచివాలయాల ఏర్పాటుకు విధివిధానాలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,775 వార్డు సచివాలయాల ఏర్పాటుకు పురపాలక శాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రతి నాలుగు వేల మంది జనాభాకూ ఓ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో సచివాలయంలో 10మంది ఉద్యోగులను నియమించేలా విధివిధానాల్ని రూపొందించారు. ఫలితంగా వార్డు సచివాలయాల్లో కొత్తగా 34,350 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ నేరుగా ప్రభుత్వ సేవలు అందించాలని ఆదేశించింది. దాంతోపాటు వార్షిక అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, ప్రభుత్వ పథకాలను వంద శాతం మేరకు అమలు చేయడమే లక్ష్యం అని పేర్కొంది.

ఈ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతీ 50 నుంచి 100 మంది పౌరులకు సంబంధించిన అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంది. పన్నుల వసూలు, పరిశుభ్రత, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని సూచించింది. పురపాలికలు, నగరపాలికల్లోని వార్డు కార్యాలయం, అంగన్ వాడీ భవనం, పాఠశాల, ఇతర ప్రభుత్వ భవనాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దాంతోపాటు వార్డు పాలనా కార్యదర్శి, మౌలిక సదుపాయాల కార్యదర్శి, సానిటేషన్, విద్య, వార్డు ప్రణాళిక, సంక్షేమాభివృద్ధి, విద్యుత్, ఆరోగ్యం, రెవెన్యూ,  వెనుకబడిన వర్గాల రక్షణ కార్యదర్శులుగా 10 మందిని నియమించాలని నిర్ణయించింది.

జూలై 22వ తేదీన నియామకాల నోటిఫికేషన్ చేపట్టి.. ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబరు 15వ లోగా నియామకాలను పూర్తి చేయనున్నారు. అక్టోబరు రెండో తేదీ నుంచి గ్రామ సచివాలయాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలు పనిచేయనున్నాయి.

Advertisement
Advertisement