సిట్‌ ఏర్పాటులో సర్కారు ఫీట్లు

AP Government Confused While Forming SIT On Data Breach Scam - Sakshi

రెండు సిట్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం లీకులు

అయితే డేటా చోరీపై సిట్‌ మాత్రమే తొలుత ఏర్పాటు..

‘ఫారం–7’ మీద రెండో సిట్‌ ఏర్పాటుపై మల్లగుల్లాలు

మార్పులుచేర్పులతో శుక్రవారం రెండో సిట్‌ ఏర్పాటు

డీజీపీతో వేర్వేరుగా సమావేశమైన ప్రత్యేక దర్యాప్తు బృందాలు  

సాక్షి, అమరావతి: ఐటీ గ్రిడ్స్‌ డేటా స్కాంతో తీవ్రంగా కలవరపడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. తెలంగాణ సర్కారు సిట్‌ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎదురుదాడికి దిగి తాను సైతం సిట్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సిట్‌ ఏర్పాటు వ్యవహారంలోనూ సర్కారు ఫీట్లు చేస్తోంది. ఏకంగా రెండు సిట్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం లీకులిచ్చింది. అయితే ఒక సిట్‌ను మాత్రమే గురువారం అధికారికంగా ప్రకటించిన సర్కారు రెండవ సిట్‌ ఏర్పాటుపై మల్లగుల్లాలు పడింది. ఎట్టకేలకు శుక్రవారం రెండవ సిట్‌ను ప్రకటించింది.

టీడీపీ సభ్యత్వ సమాచారం దొంగిలించారంటూ ఏపీ రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో కేసు నమోదు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖ కమిషనర్‌ ఎన్‌.బాలసుబ్రమణ్యం నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసింది. మరోవైపు ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఫారం–7 దుర్వినియోగమైందంటూ దానిపై విచారణకు రెండవ సిట్‌ను లీగల్‌ ఐజీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం రాత్రి లీకులిచ్చారు. అయితే ఫారం–7 విషయంలో ప్రభుత్వం ఎలా సిట్‌ ఏర్పాటు చేస్తుందనే విమర్శలు రావడంతో.. అనేక మల్లగుల్లాలు పడిన అనంతరం అగ్నిమాపక శాఖ ఏడీజీ కె.సత్యనారాయణ నేతృత్వంలో రెండవ సిట్‌ను శుక్రవారం ఏర్పాటు చేసింది. (స్కాం ‘సునామీ’.. లోకేశ్‌ బినామీ!?)

డీజీపీతో సిట్‌ బృందాల భేటీ.. 
ఇదిలా ఉండగా, రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలకు చెందిన అధికారులు శుక్రవారం మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎన్‌.బాలసుబ్రమణ్యం, కె.సత్యనారాయణల నేతృత్వంలోని సిట్‌ అధికారులు ఆయా కేసుల వివరాలు తీసుకుని డీజీపీతో చర్చించారు. రెండు కేసులకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు ఆయా ప్రత్యేక బృందాల్లోని వారు విడివిడిగా దర్యాప్తు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

ఫారం–7పై సిట్‌..
అగ్నిమాపక శాఖ ఏడీజీ కె.సత్యనారాయణ నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌ బృందంలో గుంటూరు రేంజ్‌ ఐజీ ఆర్కే మీనా, వైజాగ్, ఏలూరు, కర్నూలు, అనంతపురం రేంజ్‌ల డీఐజీలు జి.పాల్‌రాజు, సీఎం త్రివిక్రమ్‌ వర్మ, డి.నాగేంద్రకుమార్, కాంతిరాణా టాటా, గుంతకల్‌ ఎస్‌పీ సిద్ధార్థ్‌ కౌశల్, డీఎస్పీ ఎ.రాజేంద్రలు సభ్యులుగా ఉన్నారు. 

డేటా చోరీపై సిట్‌ బృందమిదీ..
ట్రాన్సుపోర్టు కమిషనర్‌ బాలసుబ్రమణ్యం నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌ బృందంలో ఐజీ, ఎక్సైజ్‌ డైరెక్టర్‌ పి.హరికుమార్, ఎస్‌ఐబీ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, గుంటూరు రూరల్‌ ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు, సీఐడీ ఎస్పీ డి.మేరి ప్రశాంతి, ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఏఎస్పీ యు.రామ్‌మోహన్‌రావు, విశాఖపట్నం డీటీసీ డీఎస్పీ పి.అనిల్‌కుమార్, సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.నాగమల్ల్శే్వరరావు, సైబర్‌ క్రైమ్‌ ఎస్సై ఎస్‌కే రహీముల్లాహ్‌ సభ్యులుగా ఉన్నారు.  

ఇవి చదవండి : 

‘ఐటీ గ్రిడ్స్‌’కు సిట్‌ తాళం

నాపై కేసులు కొట్టేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top