నాపై కేసులు కొట్టేయండి

IT Grid Scam Accused Ashok Comment On Data Theft Case - Sakshi

మాదాపూర్‌ కేసును ఏపీకి బదలాయించండి 

హైకోర్టులో ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ పిటిషన్లు 

సోమవారం విచారించే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: తనపై మాదాపూర్, సంజీవరెడ్డి నగర్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలని కోరుతూ డేటా చోరీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ డి.అశోక్‌ శుక్రవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాదాపూర్‌ పోలీసులు నమోదు చేసిన కేసును ఏపీకి బదలాయిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ మేరకు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశం ఉంది. తనపై డేటా అనలిస్ట్‌ తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్‌ పోలీసులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జి.దశరథరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంజీవరెడ్డి నగర్‌ (ఎస్‌ఆర్‌ నగర్‌) పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారని అశోక్‌ తన పిటిషన్‌లలో పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లకు సంబంధించిన డేటాను సేవామిత్ర యాప్‌ల ద్వారా చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన తరువాత ఈ విషయంపై ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అతనికి ఇక్కడి పోలీసులు చెప్పకుండా తమకు లేని పరిధిని ఉపయోగించి తెలంగాణ పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్నారు. ఫిర్యాదుదారుల ఆరోపణలకు, నాపై పెట్టిన సెక్షన్లకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తనపై ఐపీసీ సెక్షన్లు 420, 419, 467, 468, 471, 120(బీ) వర్తించవని వివరించారు. ఫిర్యాదుదారు హైదరాబాద్‌ వాసి కాబట్టి అతను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై కేసులు నమోదు చేయడం చెల్లదని తెలిపారు. డేటా చోరీ ఆరోపణలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసిందని, యుద్ధ ప్రాతిపదికన సిట్‌ దర్యాప్తు చేస్తోందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అశోక్‌ కోర్టును కోరారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top