‘కైజాలా’ ను ప్రారంభించిన చంద్రబాబు | ap cm chandrababu naidu launches Kaizala App | Sakshi
Sakshi News home page

నా గూఢఛారి ‘కైజాలా’ : చంద్రబాబు

Apr 14 2017 7:54 PM | Updated on Jul 11 2019 8:26 PM

‘కైజాలా’ ను ప్రారంభించిన చంద్రబాబు - Sakshi

‘కైజాలా’ ను ప్రారంభించిన చంద్రబాబు

పూర్వకాలంలో రాజులకు గూఢచారులుండేవారని, తనకు ‘కైజాలా’ యాప్‌ కూడా అలాంటిదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

అమరావతి : పూర్వకాలంలో రాజులకు గూఢచారులుండేవారని, తనకు ‘కైజాలా’ యాప్‌ కూడా అలాంటిదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో ‘కైజాలా’ యాప్‌కు అధునాతనంగా ‘కనెక్ట్‌ ఏపీ సీఎం’ యాప్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, సహాయం కోసం, మెరుగైన పాలన అందించేందుకు ‘కనెక్ట్‌ ఏపీ సీఎం’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

కృష్ణా పుష్కరాల సమయంలో మైక్రోసాఫ్ట్‌ ద్వారా ‘కైజాలా’ యాప్‌ను తీసుకువచ్చామని, ఇప్పుడు మరో ముందడుగు వేసి రియల్‌ టైం గవర్నెన్స్‌ కోసం ‘కనెక్ట్‌ ఏపీ సీఎం’ వినూత్న యాప్‌ రూపొందించామన్నారు. ఈ యాప్‌ను ప్రజలంతా డౌన్‌లోడ్‌ చేసుకుని ఒపీనియన్‌ పోల్‌లో పాల్గొనాలన్నారు. ఒక పక్షాన నిలువకుండా, వాస్తవాలు చెప్పాలని సీఎం కోరారు. ‘సీఎం కనెక్ట్‌’ యాప్‌ ద్వారా ప్రతి రోజూ కొన్ని ప్రశ్నలు అడుగుతామని, పార్టీ, కులం, మతం ప్రభావం లేకుండా ప్రజలు సమాధానాలు ఇవ్వాలని సీఎం సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్‌ మీడియా ఫీడ్‌బ్యాక్‌ కూడా ఈ యాప్‌కు అనుసంధానిస్తామన్నారు.

యాప్‌లో ప్రజల నుంచి వచ్చే సమాధానాలను పరిశీలిస్తామని, ఏ ఫోన్‌ ఎక్కడ్నుంచి వచ్చిందో కూడా జియోట్యాగింగ్‌ ద్వారా తెలుసుకుంటామన్నారు. కాన్ఫిడెన్షియల్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే తనకు, తన వద్ద పనిచేసే ఒకరిద్దరుకు మాత్రమే ఈ సమాచారం తెలుస్తుందన్నారు. ఈ యాప్‌లో మొట్టమొదటిగా ఇచ్చిన ప్రశ్న ప్రభుత్వ పాలన పట్ల సంతృప్తికరమా? బాగుందా? ఫర్వాలేదా? అసలు బాగోలేదా? అన్న ఒపీనియన్‌ పోల్‌కు 80 శాతం సంతృప్తికరంగా ఉందని ఫీడ్‌బ్యాక్‌ వచ్చిందన్నారు.

ప్రతి నిమిషానికి ఈ ఒపీనియన్‌ పోల్‌ శాతం మారుతుందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు యాప్‌ ద్వారా అందిన పలు సమాధానాలను చదివి వినిపించారు. సీఎంకు తమ భూమి సమస్యపై ఐదుసార్లు వినతి చేసినా తన సమస్య తీరలేదని, రుణమాఫీ తీరలేదని, ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఎన్నికల సమయంలో ఇచ్చిన రోడ్డు హామీ ఇంతవరకు పట్టించుకోలేదని పలువురు చేసిన పోస్టింగ్‌లను చంద్రబాబు చదివి వినిపించారు.

అలాగే ప్రజలు సంతృప్తిగా ఉంటే ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం​ ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు. డిజిటల్‌ లావాదేవీలు పెరిగితే ఓట్ల కొనుగోలు కష్టమన్నారు. వంద రూపాయలతో ఓట్లు కొనలేరని, అలా కొనాలంటే లారీల్లో డబ్బులు తేవాల్సి వస్తుందన్నారు. అది కుదిరే పని కాదని సీఎం వ్యాఖ్యానించారు. ఒకరు రెండువేలు ఇస్తే..మిగతావాళ్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. డబ్బులు ఖర్చుపెట్టే పరిస్థితి లేకుండా నిజాయితీ వస్తుందని, ప్రజల్లో నిజాయితీ రావాలనేదే తన ప్రయత్నమన్నారు. టీడీపీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా తాను రెండు బాధ్యతల్ని నిర్వహించాలని, పార్టీ అధ్యక్షుడిగా సరిగా పనిచేయకపోతే బూత్‌ దగ్గర కార్యకర్త ఎవ్వరూ కూర్చోరన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement