Kaizala App
-
‘కైజాల’లో డిజిటల్ చెల్లింపులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ లావాదేవీలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కొత్త పేమెంట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. తన సోషల్ నెట్వర్కింగ్ యాప్ ‘కైజాల’లో డిజిటల్ చెల్లింపుల సేవలు ప్రారంభిస్తోంది. తద్వారా దేశీయ వినియోగదారులు వేగంగా డబ్బులు పంపడానికి, లేదా స్వీకరించడానికి అనుమతిస్తుంది. కైజాల యాప్ యూజర్ల అభ్యర్థనమేరకు అతి త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తేనున్నామని మైక్రోసాఫ్ట్ ఇండియా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తొలిసారి మొబైల్ వాడుతున్న లక్షలాదిమందికి ఇది ఉపయోగ పడుతుందన్నారు. అలాగే ముఖ్యంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాలలోనూ, చిన్నమధ్య తరహా వ్యాపారులకు తమ డిజిటల్ చెల్లింపుల సదుపాయం లాభిస్తుందని మైక్రోసాప్ట్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజేష్ ఝా తెలిపారు. కాగా, గత ఏడాది జూలైలో కైజలా యాప్‌ను మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది. ఎస్‌బ్యాంక్, అపోలో టెలీమెడిసన్, యునైటెడ్ ఫాస్పరస్ లిమిటెడ్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లాంటి సంస్థలతో కీలక భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. అలాగే పాలనలో పారదర్శకత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 30 ప్రభుత్వ శాఖల్లో కైజాల యాప్‌ను వినియోగిస్తోంది. -
సొమ్మొకరిది..సోకొకరిది !
► కైజాలా యాప్.. ప్రభుత్వానిదా..టీడీపీదా? ► నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారానికి వినియోగం ► యాప్ డౌన్లోడ్ కోసం 2 వేల మంది నియామకం ► ప్రతిపక్ష నేతలను కించపరుస్తూ అప్డేట్ అవుతున్న ఫొటోలు, వీడియోలు ► అధికార దుర్వినియోగం కిందకు వస్తుందన్న వైఎస్ఆర్సీపీ నాయకులు సొమ్మొకరిది..సోకొకరిది అన్నట్లుంది కైజాలా యాప్ పరిస్థితి. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం కోసం వినియోగించాల్సిన ఈ యాప్‌ను నంద్యాలలో తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల కోసం ఉపయోగిస్తోంది. ప్రభుత్వానికి చెందిన యాప్‌ను టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచార కోసం వినియోగించడం అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నంద్యాల : నాలుగు నెలల క్రితం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కైజాల యాప్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పాలన వ్యవహారాలు, ఇతర వివరాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల నుంచి నేరుగా సూచనలు, సలహాలు తీసుకోవడానికి ఈ యాప్‌ను వినియోగించాలని రూపొందించారు. అంతేకాక దీనిని సీఎం డాస్ బోర్డుకు కూడా అనుసంధానం చేశారు. దీని ద్వారా వచ్చే సలహాలు, సూచనలు, ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రత్యేకాధికారులను కూడా నియమించారు. ప్రతీ ఆండ్రాయిడ్‌లో కైజాలా యాప్ ఉండాలన్న సీఎం సీఎం చంద్రబాబునాయుడు కైజాలా యాప్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఈ యాప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2019 సాధారణ ఎన్నికల నాటికి దీనిని బలమైన ప్రచార సాధనంగా వినియోగించుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా ప్రతి జిల్లాకు 150 మందిని రూ.20 వేల ప్రభుత్వ జీతంతో నియమించారు. వీరు ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వారిని కలసి కైజాలా యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించే విధానాన్ని వివరించాల్సి ఉంటుంది. అంతేకాక వారి మొబైల్ నంబర్‌ను కూడా తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 వేల మందిని నియమించారు. వీరికి నెలకు దాదాపు 4 కోట్ల రూపాయలను జీతంగా ఇస్తున్నారు. అందులో భాగంగా నంద్యాలలో కైజాలా యాప్‌ను డౌన్లోడ్ చేస్తూ పలువురు యువకులు కనిపిస్తున్నారు. ప్రతిపక్ష నేతలను కించపరచే వీడియోలు, ఆడియోలు.. కైజాలా యాప్ పూర్తిగా ప్రభుత్వం రూపొందించినది. ఇందులో ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవచ్చు. వాటిలో లోపాలను సవరించేందుకు ప్రజల నుంచి వినతులను స్వీకరించవచ్చు. అయితే నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం కోసం వినియోగించడం...అందులో ప్రతిపక్ష నేతలను కించ పరిచే వీడియోలు, ఫొటోలు, ఆడియోలు పెట్టడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యాప్‌లో ప్రతిపక్ష నేతలను కించపరచే విధంగా ఫొటోలు, వీడియోలు అప్డేట్ అవుతుండడంపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. అధికార దుర్వినియోగం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పాలన వ్యవహారాలు, ఇతరత్రా వివరాల ప్రచారం కోసం ప్రారంభించిన ఈ యాప్‌ను ఉప ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా వాడుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా ఎన్నికల నియమావళిని అతిక్రమించడమేనని, ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని కోరుతున్నారు. అవసరమైతే దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొంటున్నారు. -
‘కైజాలా’ ను ప్రారంభించిన చంద్రబాబు
అమరావతి : పూర్వకాలంలో రాజులకు గూఢచారులుండేవారని, తనకు ‘కైజాలా’ యాప్ కూడా అలాంటిదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో ‘కైజాలా’ యాప్‌కు అధునాతనంగా ‘కనెక్ట్ ఏపీ సీఎం’ యాప్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, సహాయం కోసం, మెరుగైన పాలన అందించేందుకు ‘కనెక్ట్ ఏపీ సీఎం’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కృష్ణా పుష్కరాల సమయంలో మైక్రోసాఫ్ట్ ద్వారా ‘కైజాలా’ యాప్‌ను తీసుకువచ్చామని, ఇప్పుడు మరో ముందడుగు వేసి రియల్ టైం గవర్నెన్స్ కోసం ‘కనెక్ట్ ఏపీ సీఎం’ వినూత్న యాప్ రూపొందించామన్నారు. ఈ యాప్‌ను ప్రజలంతా డౌన్లోడ్ చేసుకుని ఒపీనియన్ పోల్‌లో పాల్గొనాలన్నారు. ఒక పక్షాన నిలువకుండా, వాస్తవాలు చెప్పాలని సీఎం కోరారు. ‘సీఎం కనెక్ట్’ యాప్ ద్వారా ప్రతి రోజూ కొన్ని ప్రశ్నలు అడుగుతామని, పార్టీ, కులం, మతం ప్రభావం లేకుండా ప్రజలు సమాధానాలు ఇవ్వాలని సీఎం సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ఫీడ్‌బ్యాక్ కూడా ఈ యాప్‌కు అనుసంధానిస్తామన్నారు. యాప్‌లో ప్రజల నుంచి వచ్చే సమాధానాలను పరిశీలిస్తామని, ఏ ఫోన్ ఎక్కడ్నుంచి వచ్చిందో కూడా జియోట్యాగింగ్ ద్వారా తెలుసుకుంటామన్నారు. కాన్ఫిడెన్షియల్ ఆప్షన్ ఎంచుకుంటే తనకు, తన వద్ద పనిచేసే ఒకరిద్దరుకు మాత్రమే ఈ సమాచారం తెలుస్తుందన్నారు. ఈ యాప్‌లో మొట్టమొదటిగా ఇచ్చిన ప్రశ్న ప్రభుత్వ పాలన పట్ల సంతృప్తికరమా? బాగుందా? ఫర్వాలేదా? అసలు బాగోలేదా? అన్న ఒపీనియన్ పోల్‌కు 80 శాతం సంతృప్తికరంగా ఉందని ఫీడ్‌బ్యాక్ వచ్చిందన్నారు. ప్రతి నిమిషానికి ఈ ఒపీనియన్ పోల్ శాతం మారుతుందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు యాప్ ద్వారా అందిన పలు సమాధానాలను చదివి వినిపించారు. సీఎంకు తమ భూమి సమస్యపై ఐదుసార్లు వినతి చేసినా తన సమస్య తీరలేదని, రుణమాఫీ తీరలేదని, ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఎన్నికల సమయంలో ఇచ్చిన రోడ్డు హామీ ఇంతవరకు పట్టించుకోలేదని పలువురు చేసిన పోస్టింగ్‌లను చంద్రబాబు చదివి వినిపించారు. అలాగే ప్రజలు సంతృప్తిగా ఉంటే ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలు పెరిగితే ఓట్ల కొనుగోలు కష్టమన్నారు. వంద రూపాయలతో ఓట్లు కొనలేరని, అలా కొనాలంటే లారీల్లో డబ్బులు తేవాల్సి వస్తుందన్నారు. అది కుదిరే పని కాదని సీఎం వ్యాఖ్యానించారు. ఒకరు రెండువేలు ఇస్తే..మిగతావాళ్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. డబ్బులు ఖర్చుపెట్టే పరిస్థితి లేకుండా నిజాయితీ వస్తుందని, ప్రజల్లో నిజాయితీ రావాలనేదే తన ప్రయత్నమన్నారు. టీడీపీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా తాను రెండు బాధ్యతల్ని నిర్వహించాలని, పార్టీ అధ్యక్షుడిగా సరిగా పనిచేయకపోతే బూత్ దగ్గర కార్యకర్త ఎవ్వరూ కూర్చోరన్నారు.


