ఏపీ సరిహద్దున తెలంగాణ ఎన్నికల వేడి

AP Borders Alerts on Telanagana Elections - Sakshi

సరిహద్దుల్లో అడుగడుగునా నిఘా

ప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటు

మద్యం, నగదు తరలింపుపై దృష్టి

తూర్పుగోదావరి, నెల్లిపాక (రంపచోడవరం): తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్‌ ఏడో తేదీన ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం తనిఖీలను ముమ్మరం చేసింది. తెలంగాణ, ఏపీ సరిహద్దు మండలం ఎటపాకలో కూడా పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. భద్రాచలం పట్టణం ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో భద్రాచలం నియోజకవర్గంపై తెలంగాణ ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేసింది. మహాకూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ భారీగా నగదు, మద్యాన్ని ఏపీ నుంచి తెలంగాణకు తరలించవచ్చనే నిఘావర్గాల హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నెల రోజులు ముందుగానే పట్టణ శివార్లలో పోలీసులు ఎన్నికల చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎటపాక మండలంలోని గుండాల గ్రామం జాతీయ రహదారి మీదుగా భద్రాచలం పట్టణంలో ప్రవేశించే  అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

ఆర్టీఏ అధికారులు కూడా వాహన తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల దృష్ట్యా ఇటు గుండాల గ్రామం వద్ద కూడా ఏపీ ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం తరలించే వారిపై నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా వెళ్లే వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. అదే విధంగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి తెలంగాణలో ప్రవేశించే ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పోలీసు బలగాలతో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. భద్రాచలం పట్టణం సరిహద్దు కాలనీల్లో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించి పత్రాలు లేని వాహనాలను సీజ్‌ చేసి, అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మొత్తం 873 పోలింగ్‌ కేంద్రాలకు 205 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకంగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ జిల్లాలో ఇప్పటి వరకు రూ.30.50 లక్షల నగదు సీజ్‌ చేసినట్టు వరంగల్‌ జోన్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వై.నాగిరెడ్డి  వెల్లడించారు. అలాగే 3015 మందిని బైండోవర్‌ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top