ఏపీ అసెంబ్లీ ట్రెండ్‌ సెట్టర్‌ కావాలి | AP Assembly needs to be a Trend Setter | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ ట్రెండ్‌ సెట్టర్‌ కావాలి

Jun 14 2019 4:38 AM | Updated on Jun 14 2019 4:51 AM

AP Assembly needs to be a Trend Setter - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ దేశానికే ఒక ట్రెండ్‌ సెట్టర్‌ కావాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆకాంక్షించారు. ఈ శాసనసభలో గొప్ప వ్యవస్థను నిర్మాణం చేసి, సత్సంప్రదాయాలు, ఉన్నత విలువలను నెలకొల్పుదామని పిలుపునిచ్చారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో అసెంబ్లీ కొత్త నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. నిద్రాణమై ఉన్న వ్యవస్థలను మేల్కొల్పాలని, వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం పోతే ప్రజాస్వామ్యం  ఉనికే ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్‌ ఎన్నికపై ధన్యవాదాలు తెలిపే చర్చ ముగిసిన అనంతరం సభలో తమ్మినేని సీతారాం మాట్లాడారు. శాసనసభ నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించాల్సిన పరిస్థితి ఏనాడూ రాకూడదని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే...   

‘‘ప్రజలు ప్రతి విషయాన్నీ గమనిస్తూనే ఉంటారు. మన ఉచ్ఛ్వాశ, నిశ్వాసాల్ని, అడుగుల్ని గమనిస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా వింటారు. కానీ, అంతిమంగా వారు చేయాలనుకున్నదే చేస్తారు. నైతిక విలువలను కాపాడుకుంటూ అవినీతి రహిత పాలన అందించేందుకు, సంక్షేమ రాష్ట్ర నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సహకారం అందించేలా సభ్యులంతా కృషి చేయాలి. స్పీకర్‌ పదవి ఒక సవాల్‌. సభానాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నన్ను స్పీకర్‌ పదవికి ప్రతిపాదించి, ఈ సవాల్‌ను అధిగమిస్తారని చెప్పారు. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. 

రాజ్యాంగ నిబంధనలను గౌరవించాలి 
న్యాయ, కార్యనిర్వాహక, శాసనసభ, మీడియా.. ఈ నాలుగు వ్యవస్థలు ఒకదాన్ని ఒకటి అతిక్రమిస్తే సామాజిక ఘర్షణ తలెత్తుతుంది. ఈ ఘర్షణ ఎక్కడికి దారి తీస్తుందో కూడా చెప్పలేం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేని శాసన వ్యవస్థ అవసరమా? శాసనసభకు రాజ్యాంగ నిబంధనలున్నాయి. వీటిని గౌరవించాలి. ఆరు సార్లుగా శాసనభలో అధికార, ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్నాను. మంత్రిగా పని చేశా. ఈ సభే నాకు అనుభవాన్నిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ అన్నింటా ముందుకెళ్లాలి. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించబోమని సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఇది నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఫిరాయింపుల అంశంలో ఐదేళ్ల పాటు నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండదని భావిస్తున్నా. 

సభా సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు 
రాష్ట్రంలో ఇప్పటికీ తాగునీరు లేని, విద్యుత్‌ సౌకర్యం లేని, సరైన రహదార్లు లేని గ్రామాలున్నాయి. సంక్షేమ రాష్ట్ర నిర్మాణం దిశగా అందరం నిబ్బరంగా అడుగులు ముందుకేద్దాం. ప్రతిపక్షంలో ఉన్న వారు తప్పు చేస్తే ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. నిరక్షరాస్యత నిర్మూలన, వలసల నివారణపై సభలో అర్థంవంతమైన చర్చలు జరగాలి. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మనిషి చంద్ర మండలంలోకి, జలాంతర్గాములతో సముద్ర గర్భంలో చొచ్చుకెళ్తున్న ఈ రోజుల్లో కూడా శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ రోగులను రక్షించుకోలేని పరిస్థితి ఉండడం బాధాకరం. శాసనసభ నిర్వహణకు రోజుకు రూ.6 లక్షలు ఖర్చవుతుంది. సభా సమయాన్ని సభ్యులు దుర్వినియోగం చేయొద్దు. సభలో అర్థవంతమైన చర్చలు జరిగేలా సహకరించాలి. సభలో వ్యవహరించాల్సిన తీరుపై సభ్యులకు త్వరలో నిపుణులతో శిక్షణా తరగతులు నిర్వహిస్తాం. 

వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాలి
ఈ సభలో కొత్తగా ఎన్నికైన వారు 100 మందికి పైగా ఉన్నారు. ప్రతి సభ్యుడు సభ విలువలు కాపాడాలి. రాజ్యాంగ విలువలను గౌరవించాలి. శానససభలో స్పీకర్‌ స్థానాన్ని గతంలో అయ్యదేవర కాళేశ్వరరావు, బీవీ సుబ్బారెడ్డి, మౌలాంకర్, పిడతల రంగారెడ్డి, వేమారెడ్డి, నారాయణరావు, కోన ప్రభాకరరావు, రాంచంద్రారెడ్డి తదితరులు అలంకరించి, విశిష్ట విలువలు నెలకొల్పారు. ఆ విలువలను కాపాడాలి. సీనియర్లు కొంత వెనక్కి తగ్గి, సభలో కొత్త సభ్యులు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాలి. అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 

ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలి 
ఈ సమాజంలో చిట్టచివరి పేదవాడి కన్నీటిని తుడిచేదే నిజమైన ప్రభుత్వమని మహాత్మాగాంధీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగాలి. వ్యవస్థ ఎంత మంచిదైనా వ్యవస్థ అధిపతి అసమర్థుడై, అతడి ఆలోచనలు పతనానికి దారి తీసే పరిస్థితులుంటే ఆ వ్యవస్థ వల్ల ప్రయోజనం శూన్యమని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు. దేశంలో ఈ విషయంపై పెద్ద చర్చ జరగాలి. దేశంలోనే ఏపీ శాసనసభ రోల్‌ మోడల్‌గా నిలవాలి. పుచ్చలపల్లి సుందరయ్య, నర్రా రాఘవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, చెన్నమనేని నాగేశ్వరరావు తదితర శాసనసభ్యలు, బూర్గుల రామకృష్ణారావు, టంగుటూరి ప్రకాశంపంతులు, నీలం సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు తదితర ముఖ్యమంత్రులు ఆదర్శవంతమైన బాటలు వేశారు.

ఆ బాటలో మనం నడవాలి. ఎన్టీఆర్, వైఎస్‌ రాజశేఖరరెడ్డిల నుంచి ఎంతో నేర్చుకోవాలి. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించేందుకు నడుం కట్టిన ప్రభుత్వానికి మనమంతా సహకరించాలి. బలమైన ప్రతిపక్షం బలమైన ప్రజాస్వామ్యానికి పునాది అని సభా నాయకుడు నాతో చెప్పారు. కొత్త సభ్యులు ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలి. ప్రజల సమస్యలను పరిష్కరించగలిగితే శాసనసభకు సార్థకత చేకూరుతుంది’’ అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. స్పీకర్‌ ఎన్నికపై ధన్యవాదాలు తెలిపే చర్చలో మొత్తం 32 మంది సభ్యులు పాల్గొన్నారని చెప్పారు. స్పీకర్‌ ప్రసంగం అనంతరం శానససభ శుక్రవారానికి వాయిదా పడింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement