12 నుంచి అసెంబ్లీ

AP Assembly from June 12 - Sakshi

5 రోజుల పాటు సమావేశాలు

8న జగన్‌ సచివాలయ ప్రవేశం

అదే రోజు మంత్రివర్గ విస్తరణ

10న మంత్రివర్గ భేటీ

7న శాసనసభాపక్ష సమావేశం

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి నూతన శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన 175 మంది, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. స్పీకర్‌ ఎన్నిక కూడా జరుగుతుంది. కాగా సమావేశాలు ప్రారంభానికి ముందే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు.

ఇప్పటికే ఆయన ఈ నెల 8వ తేదీ ఉదయం తొలుత సచివాలయంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అదే రోజున మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సచివాలయంలో జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణకు ఒక రోజు ముందుగా 7వ తేదీన వైఎస్సార్‌ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోందో వివరిస్తూ ఆ మరుసటి రోజున జరిగే విస్తరణపై ఎమ్మెల్యేలను మానసికంగా జగన్‌ సిద్ధం చేస్తారని పార్టీ వర్గాల సమాచారంగా ఉంది. 

10న తొలి మంత్రివర్గ సమావేశం
కొత్త మంత్రులతో ఏర్పడబోయే మంత్రివర్గ సమావేశం ఈ నెల 10వ తేదీన జరుగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ తొలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వ పరంగా ప్రజలకు చేయాల్సిన దిశానిర్దేశం వంటి అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. తమ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతో పాటుగా వారికి ఇచ్చిన హామీల అమలుకు జగన్‌ ప్రభుత్వం ఎలా కట్టుబడి ఉందనే విషయంపై ఒక స్పష్టతను ఇస్తారని తెలుస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top