పురుషోత్తపట్నంలో బలవంతపు భూసేకరణకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బాధిత రైతులతో కలిసి అఖిలపక్ష పోరాటం చేపడతామని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి
సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నంలో బలవంతపు భూసేకరణకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బాధిత రైతులతో కలిసి అఖిలపక్ష పోరాటం చేపడతామని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి హెచ్చరించారు. బలవంతంగా భూములు తీసుకున్న రైతులతో కలిసి సీతానగరం బస్టాండ్ సెంటర్లో మంగళవారం ఆమె మాట్లాడారు. పార్టీలకతీతంగా పోరాటం చేద్దామన్నారు. ఈ సందర్భంగా నార్త్‌జోన్ డీఎస్సీ ప్రసన్నకుమార్‌తో జక్కంపూడి చర్చించారు. రైతులకు పోలీసుల వేధింపులు లేకుండా చూడాలన్నారు. జలవనరులు, రెవెన్యూ శాఖల అధికారులతో సంప్రదించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
బుధవారం మధ్యాహ్న వరకూ మీరు రైతులకు అందించే న్యాయం కోసం చూస్తామని, గురువారం నుంచి రైతు కుటుంబాలతో కలిసి భూముల్లో ఉంటామని ఆమె స్పష్టం చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ రైతులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆమె డీఎస్పీకి సూచించారు. పై అధికారులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు.అనంతరం విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ బాధిత రైతులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. భూములు తీసుకుంటున్నామంటూ మంగళవారం కూడా రెవెన్యూ అధికారులు రైతుల ఇళ్ల గోడలకు నోటీసులు అతికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు డాక్టర్‌బాబు, వలవల రాజా, చల్లమళ్ల సుజీరాజు, వలవల వెంట్రాజు, బాధిత రైతులు ఐఎస్‌ఎన్ రాజు, గద్దె రామకృష్ణ, కలగర్ల భాస్కరరావు, కలగల సర్వారాయుడు, కరుటూరి విజయ్‌కుమార్ చౌదరి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.