ఆయా కాదు.. అమ్మే

Anganwadi worker who took the pregnant woman to hospital - Sakshi

గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లి కాన్పు చేయించిన అంగన్‌వాడీ ఆయా

నంద్యాల: పురిటినొప్పులు పడుతున్న ఓ మహిళకు అంగన్‌వాడీ ఆయా అమ్మలా అండగా నిలిచింది. ఆసుపత్రికి తీసుకెళ్లి కాన్పు చేయించడమే కాకుండా మూడు రోజుల పాటు ఆమె వద్దే ఉండి సపర్యలు చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. నంద్యాల షరాఫ్‌ బజార్‌లో నివసించే దివ్యభారతికి శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో భర్త కర్నూలులో ఉన్న ఆమె తల్లికి సమాచారమిచ్చాడు.

లాక్‌డౌన్‌ కారణంగా ఆమె నంద్యాలకు రాలేకపోయింది. ఈ విషయాన్ని స్థానిక అంగన్‌వాడీ ఆయా చెన్నమ్మకు చెప్పి సాయం కోరడంతో ఆమె తెలిసిన వారి ఆటోలో దివ్యభారతిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. తనే దగ్గరుండి సాయం చేసింది. దివ్యభారతి శనివారం పండంటి బాబుకు జన్మనిచ్చింది. నంద్యాలలోనూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ చెన్నమ్మ ఆదివారం వరకూ ఆస్పత్రిలోనే ఉండి దివ్యభారతికి సాయం చేసిన విషయం ఐసీడీఎస్‌ పీడీ భాగ్యరేఖ ద్వారా కలెక్టర్‌ వీరపాండియన్‌కు తెలిసింది. దీంతో ఆయన  చెన్నమ్మను అభినందించి.. రూ.20 వేల నగదు బహుమతి ప్రకటించారు.

ఏటా కుటుంబంతో కలిసి ఈస్టర్‌ పండుగ ఘనంగా జరుపుకుంటామని, అయితే సాటి మహిళ ఇబ్బందుల్లో ఉండటంతో పండుగను పక్కన పెట్టి సాయం చేశానని ఆయా చెన్నమ్మ తెలిపింది. కరోనా పేరు వింటేనే భయపడుతున్న ఈ సమయంలో మూడు రోజులు తనవద్ద ఉండి అమ్మలా సేవ చేసిన చెన్నమ్మను ఎన్నటికీ మరచిపోలేనని దివ్యభారతి పేర్కొంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top