పోస్టుకు లక్ష!

Anganwadi Supervisor Jobs For Sale - Sakshi

గతంలో విధుల నుంచి తొలగించిన ఇన్‌చార్జిలపై వల 

రెగ్యులర్‌ పోస్టులు సృష్టించి ఇవ్వడంతోపాటు గ్రేడ్‌–2 సూపర్‌వైజర్‌లుగా పర్మినెంట్‌ చేస్తామని హామీ 

361 పోస్టులను అమ్మకానికి పెట్టిన ప్రభుత్వ పెద్దలు 

ఒక్కో ఉద్యోగానికి నిర్ణయించిన రేటు రూ.లక్ష  

ముఖ్యమంత్రి, మంత్రి కనుసన్నల్లో ఇప్పటిదాకా రూ.కోటిన్నరకు పైగా వసూళ్లు.. మిగతా సొమ్ములిస్తే జీవో

వసూళ్లు, నియామకాలపై నేడు ఉండవల్లిలో సమావేశం

‘సాక్షి’ చేతికి చిక్కిన అంగన్‌వాడీ సభ్యుల ఫోన్‌ సంభాషణలు 

‘‘సచివాలయంలో ‘సార్‌’కు డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోతుంది. రేపు 10 గంటలకు సచివాలయానికి రమ్మన్నారు. ఇప్పటికే కొంత సొమ్ము చెల్లించాం. మిగిలిన సొమ్మును బ్యాంకు ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని సార్‌కు చెప్పాం. డబ్బులు చెల్లిస్తే రెగ్యులర్‌ పోస్టుల్లో నియమిస్తారు. ఆ మేరకు జీవో జారీ చేస్తారు. మంత్రి సునీత, కమిషనర్, ముఖ్యకార్యదర్శి, ముఖ్యమంత్రి గారు సంతకాలు చేసి జీవో ఇస్తామన్నారు. జిల్లాలవారీగా ఎవరు ఎంత ఇచ్చారు, ఇంకా ఎంత ఇవ్వాలో లిస్టు రాసి పెట్టుకోండి. ఇంకా ఇవ్వాల్సిన వారు బ్యాంకుల్లో వేస్తే అమరావతిలో డ్రా చేసి ఇవ్వడం సమస్య అవుతుంది. నగదే జాగ్రత్తగా తీసుకురండి. సచివాలయంలో సార్‌కు ఇచ్చేయొచ్చు, ఎలాంటి సమస్య ఉండదు’’  
    – కొందరు అంగన్‌వాడీ మహిళల మధ్య ఫోన్‌ ద్వారా జరిగిన సంభాషణల సారాంశం ఇదీ...

సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం కొలువుదీరిన పవిత్రమైన సచివాలయాన్ని అక్రమార్జనకు అడ్డాగా మార్చేశారు. సరిగ్గా ఎన్నికల ముందు అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అడ్డగోలుగా అమ్మేసుకుంటున్నారు. ఒక్కో పోస్టుకు అక్షరాలా రూ.లక్ష ధర నిర్ణయించి మరీ సచివాలయం సాక్షిగా వసూలు చేస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఆ శాఖ కమిషనర్, ముఖ్యకార్యదర్శి కనుసన్నల్లోనే ఈ వసూళ్ల భాగోతం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అంగన్‌వాడీ మహిళల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఈ సంభాషణల వివరాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. మొత్తం 361 పోస్టులను విక్రయానికి పెట్టారు. ఇప్పటికే కొందరు మహిళలు బ్యాంకుల ద్వారా సంబంధిత మధ్యవర్తులకు కొంత సొమ్ము చెల్లించారు. 

ఇన్‌చార్జి సూపర్‌వైజర్‌గా పనిచేసిన ఓ మహిళ ఇతర సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన మాటలివీ..
‘‘అంగన్‌వాడీ టీచర్, వర్కర్‌గా కూలీకి పనిచేశాం. మనకు డైరెక్టుగా పదోన్నతి ఇవ్వడం సాధ్యం కాదు. ఆయా నుంచి వర్కర్‌గా ఇస్తారు. వర్కర్‌ నుంచి గ్రేడ్‌–2 పోస్టు రాదు. గ్రేడ్‌–2 పోస్టులో నియమించాలంటే ఎపీపీఎస్సీ ద్వారా ఎంపికవ్వాలి. పరీక్ష లేకుండా తీసుకోవాలంటే సీనియారిటీ లిస్టు తయారు చేయాలి. సీనియారిటీ లిస్టులో మన పేర్లు ఉండవు. డబ్బులు చెల్లిస్తే ఇప్పుడు రెగ్యులర్‌ పోస్టుల్లో నియమిస్తారు. ఆ మేరకు జీవో జారీ చేస్తారు. మంత్రి సునీత, కమిషనర్, ముఖ్యకార్యదర్శి, ముఖ్యమంత్రి గారు సంతకాలు చేసి జీవో ఇస్తామన్నారు. రెగ్యులర్‌ పోస్టు ఇచ్చిన తరువాత గ్రేడ్‌–2 పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేస్తారు. ఈ గ్రేడ్‌–2 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తుంది. అప్పుడు సీనియారిటీ లిస్టులో మన పేర్లు చేర్చి, గ్రేడ్‌–2 పోస్టుల్లో నియమిస్తారు. ఆ తరువాతే మిగతావారిని తీసుకుంటారు. ఇన్‌చార్జి పోస్టు కాదు రెగ్యులర్‌ పోస్టే ఇస్తారు. అంతటితో ఆగకుండా గ్రేడ్‌–2 పోస్టులు ఇస్తారు’’ 

వివిధ జిల్లాల మహిళా సభ్యుల మధ్య ఫోన్‌లో జరిగిన సంభాషణ..
‘‘ఇప్పుడే మీటింగ్‌ నుంచి బయటకు వచ్చాం. రేపు కూడా ఉండమని సార్‌ చెప్పారు. రేపు 10 గంటలకు సచివాలయానికి రమ్మన్నారు. ఇప్పటికే కొంత సొమ్ము చెల్లించాం. మిగిలిన సొమ్మును బ్యాంకు ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని సార్‌కు చెప్పాం. ఈ విషయాలను ఎక్కడా బయట పెట్టకండి. ఎవరికీ చెప్పకండి. మేము ఒట్టు వేశాం. డబ్బులు చెల్లించిన స్లిప్‌ల ఫొటోలను వాట్సాప్‌ గ్రూపులో పెట్టకండి. గ్రూపులో పెడితే ఎవరి దగ్గరికో వెళ్లిపోతాయి. విల్లింగ్, నాన్‌ విల్లింగ్‌ లిస్టులను ఆయా జిల్లాల లీడర్లకు పెట్టండి. ఇంత కంటే ఏమీ చెప్పలేం. మనకు ఏడాదికి రూ.1.60 కోట్ల జీతాలని చెప్పారు. ఒకటిన్నర ఏడాది సీనియారిటీ ఇస్తారు. మీరు స్పందిస్తే కచ్చితంగా గ్రేడ్‌–2 పోస్టులు తెస్తాం. మీరందరూ సహకరించాలి. సహరిస్తేనే ముందుకు వెళ్లగలం. స్పందించకపోతే సూపర్‌వైజర్‌గానే ఉంటారు. ఆర్థిక మంత్రి దగ్గర ఫైల్‌ కూడా చూశాం’’ 

ఇతర సభ్యులతో.. 
‘‘అక్కడ ఏం జరిగిందో ఫోన్‌ చేసి తెలుసుకుని, ఫోటోలో పెట్టమన్నాం. ఇంకా పెట్టలేదు. సోమవారం ప్రయాణం. ఆర్డర్‌ కాపీ రావడానికి మూడు నాలుగు రోజుల సమయం పడుతుంది. సోమవారం లీడర్ల మీటింగ్‌ అన్నారు. ఎవరెవరు వస్తారో చూసి రిజర్వేషన్‌ చేయించాలి. సోమవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లిలో మీటింగ్‌ ఉంటుంది. అనుకున్న రీతిలో డబ్బులు పూర్తిగా కట్టలేకపోయారట. బ్యాంకుల్లో డబ్బులు వేయడం, తీయడం సమస్యగా ఉంది. ఇన్ని రోజులైనా పని పూర్తి కాలేదు. డబ్బులు తీసుకుని సార్‌కు ఇచ్చేస్తే పని అయిపోయేది. 9వ తేదీ కోడ్‌ అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి’’ 

కొందరు అంగన్‌వాడీ సభ్యుల మధ్య.. 
‘‘జిల్లాలవారీగా ఎవరు ఎంత ఇచ్చారు, ఇంకా ఎంత ఇవ్వాలో లిస్టు రాసి పెట్టుకోండి. ఇంకా ఇవ్వాల్సిన వారు బ్యాంకుల్లో వేస్తే అమరావతిలో డ్రా చేసి ఇవ్వడం సమస్య అవుతుంది. నగదునే జాగ్రత్తగా తీసుకొచ్చేయండి. సచివాలయంలో సార్‌కు ఇచ్చేయొచ్చు, ఎలాంటి సమస్య ఉండదు. 14 మంది నుంచి రూ.7.25 లక్షలు వసూలు చేశాను. సచివాలయంలోనే ఒక సభ్యురాలు మరో సభ్యురాలికి రూ.5 వేలు ఒకసారి, రూ.25 వేలు ఇంకోసారి ఇచ్చింది. ఇప్పటికే లక్ష్మీ అనే మహిళ రామచంద్రయ్య అనే వ్యక్తికి బ్యాంకు ద్వారా రూ.40 వేలు చెల్లించింది. కె.రాజ్యలక్ష్మి అనే మహిళ బ్యాంకు ద్వారా ఎ.బాబు అనే వ్యక్తికి రూ.3,25,059 చెల్లించింది. ఇంకా కొంతమంది మహిళలు బ్యాంకుల ద్వారా రూ.20 వేల చొప్పున చెల్లించారు’’  

నేడు ఉండవల్లిలో సమావేశం 
అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల సిఫార్సులతో కొన్ని నెలల క్రితం 384 మంది మహిళలను ప్రభుత్వం అంగన్‌వాడీ ఇన్‌చార్జి సూపర్‌వైజర్లుగా నియమించింది. కొంతకాలం తర్వాత వారిని కొన్ని కారణాలతో విధుల నుంచి తొలగించింది. ఇప్పుడు వారిలో 361 మందికి మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వ పెద్దలు ఎర వేశారు. రెగ్యులర్‌ పోస్టులు ఇవ్వడంతోపాటు గ్రేడ్‌–2 సూపర్‌వైజర్లుగా పర్మినెంట్‌ చేస్తామని నమ్మబలుకుతున్నారు. ఒక్కో పోస్టుకు రూ.లక్ష చొప్పున రేటు నిర్ణయించారు. ఇప్పటికే ఒక్కొక్కరి నుంచి రూ.40 వేల నుంచి రూ.50 వేల దాకా వసూలు చేశారు. ఇప్పటిదాకా రూ.1.5 కోట్లకుపైగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. మిగతా సొమ్ము త్వరగా ఇచ్చేస్తే జీవో జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వసూళ్ల ప్రక్రియను సమీక్షించడంతోపాటు అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల ఎంపికపై సోమవారం ఉండవల్లిలో సమావేశం ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top