అంగన్‌వాడీ కేంద్రాలు బలోపేతం కావాలి


మెట్టపల్లి(చీపురుపల్లి రూరల్): అంగన్‌వాడీ కేంద్రాలు బలోపేతం కావడానికి అందరూ సహకరిస్తేనే ఆశించిన లక్ష్యం నేరువేరుతుందని ఐసీడీఎస్ ఉత్తరాంధ్ర ఆర్జేడీ సీహెచ్ కామేశ్వరమ్మ అన్నారు. చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో మంగళవారం ఒకటో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జూన్ నెల నుంచి రాష్ర్టస్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయడానికి ప్రత్యేక దరఖాస్తు నమూనాను రూపొందించామన్నారు. ఇందులో అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో అందుతున్న సేవలను పరిశీలించిన అనంతరం అందులో వివరాలను నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఆ వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో పెడతామన్నారు.

 

 తద్వారా రాష్ర్టంలో ఏ కేంద్రంలో ఎలాంటి సేవలు అందుతున్నాయో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. కేంద్రాల్లో అందించే పోషకాహారంతో పాటు ఇంటి వద్ద కూడా చిన్నారులకు సమతుల్య ఆహారం అందించడానికి చిన్నారుల తల్లిదండ్రులు దృష్టిసారించాలన్నారు. అప్పుడే చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహించే కార్యకర్తలు, హెల్పర్లు వారికిచ్చిన యూనిఫారాలను తప్పనిసరిగా ధరించి రావాలన్నారు. సమయపాలన పాటించాలని కోరారు. అంగన్‌వాడీ కేంద్రాలను సంద ర్శించే సీడీపీఓలు, సూపర్‌వైజర్లు కేంద్రాల పనితీరు మెరుగుపడేలా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అప్పుడే కేంద్రాల నిర్వహణ విజయవంతం అవుతుందన్నారు. ప్రతి సీడీపీఓ తమ ప్రాజెక్టు పరిధిలో నెలలో 30 కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలన్నారు.

 

 అదేవిధంగా సూపర్‌వైజర్లు ప్రతి కేంద్రాన్ని నెలలో ఒకసారి తనిఖీ చేయాలన్నారు. కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ పరిశీలించాలన్నారు. సమావేశంలో చీపురుపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ ఎస్తేర్‌రాణి, సూపర్‌వైజరు పైడిమంగ తదితరులు పాల్గొన్నారు.అంగన్వాడీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆర్‌జేడీ మెట్టపల్లి గ్రామంలోని కాలనీలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రం పనితీరు పట్ల ఐసీడీఎస్ ఉత్తరాంధ్ర జాయింట్ డెరైక్టర్ సిహెచ్.కామేశ్వరమ్మ అసంతృప్తి వ్యక్తం చేసారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రానికి ఆమె వచ్చిన సమయానికి 13 మంది పిల్లలు ఉండాల్సి ఉండగా 8 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు.

 

 దీంతో పాటు కేంద్రంలో చిన్నారులకు హాజరు కూడా వేయలేదు. దీంతో ఆగ్రహించిన ఆమె ప్రతిరోజూ కేంద్రం ఎన్ని గంటలకు తెరవాలి, ఎన్ని గం టలకు హాజరు వేయాలో తెలుసా? అని అంగన్వాడీ కార్యకర్తను ప్రశ్నించారు. 11గంటలు సమయం అయినప్పటికీ అటెండెన్స్ వేయకపోవటమేమిటని ప్రశ్నించారు.కార్యకర్త యూనిఫాం ధరించకపోవడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం పనితీరు ఉండాల్సిన స్థాయిలో లేదన్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి ఐసీడీఎస్ పీఓ ఎస్తేరురాణి,సూపర్‌వైజర్ పైడిమంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top