ఏమవుతుందో...! | andhra pradesh government determined to foil mudragada padmanabham padayatra | Sakshi
Sakshi News home page

మరో కుట్రకు తెరలేపిన చంద్రబాబు

Jul 26 2017 8:29 AM | Updated on Sep 5 2017 4:51 PM

ఏమవుతుందో...!

ఏమవుతుందో...!

చావోరేవో తేల్చుకుంటాం...పాదయాత్ర చేసి తీరుతామని ముద్రగడ పద్మనాభం శపథం పూనారు.

నింగీ, నేలా ... నిఘా
బూట్ల శబ్దాల హోరు
కిర్లంపూడిలో కర్ఫ్యూ వాతావరణం
ప్రత్యేక బలగాలతో మోహరింపు
కవాతులతో కదనరంగం
పాదయాత్ర తప్పదంటున్న ముద్రగడ
దీటుగా సమాధానం చెబుతామంటున్న సర్కారు
క్షణ, క్షణం ఉత్కంఠ


సాక్షి ప్రతినిధి, కాకినాడ : చావోరేవో తేల్చుకుంటాం...పాదయాత్ర చేసి తీరుతామని ముద్రగడ పద్మనాభం శపథం పూనారు. అనుమతి లేని పాదయాత్రను అడ్డుకొని తీరుతామని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగదని కాపు నేతలు సవాల్‌ విసురుతుండగా... ఎలా జరుగుతుందో చూస్తామంటూ పోలీసులు ప్రతి సవాల్‌ విసురుతున్నారు. కాపు జాతి కోసం ‘చలో అమరావతి’ పాదయాత్రను ముద్రగడ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా అవకాశమిస్తే రాజకీయంగా ఇబ్బంది పడతామని చంద్రబాబు పంతానికి పోతున్నారు.

ఈ క్రమంలో ఇరు వర్గాలూ వెనక్కి తగ్గడం లేదు. పోలీసుల ద్వారా కవ్వింపు చర్యలకు దిగగా...ఏం చేసినా మంచిదేనంటూ తనదైన ఎత్తుగడతో ముద్రగడ వెళ్తున్నారు. అడ్డుకోకపోతే పాదయాత్ర చేస్తా... నిర్బంధిస్తే ఇంట్లోనే ఉంటా... అవకాశమొచ్చినప్పుడే  పాదయాత్ర ప్రారంభిస్తానంటూ తన వ్యూహాలకు ముద్రగడ పదును పెడుతున్నారు. అదే జరిగితే ఏం చేయాలో తమకు తెలుసునంటూ పోలీసులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చలో అమరావతి పాదయాత్ర ప్రారంభమవుతుందా?  లేదా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన కాపు రిజర్వేషన్‌ హామీని అమలు చేయాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమంలో మరో ఘట్టానికి నేడు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారు. అనుమతి లేని పాదయాత్రను జరగనిచ్చేదిలేదంటూ తొలి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అందుకు తగ్గట్టుగా గత పది రోజులగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరేంటో స్పష్టమవుతోంది. పాదయాత్రకు సంఘీభావంగా కాపులు చేపట్టిన మోటార్‌ బైక్‌ ర్యాలీలను పోలీసులు అడ్డుకున్నారు. వాటిలో పాల్గొన్న వారిపై కేసులు పెట్టారు. ఆ తర్వాత కౌన్సెలింగ్‌ ముసుగులో బెదిరింపులకు దిగారు. మరోవైపు టీడీపీ నేతల చేత ప్రలోభాలకు గురి చేశారు. కానీ పరిస్థితులు సానకూలం కాలేదు.

నెమ్మదిగా ఉంటే సరిపోదని మోటార్‌ బైక్‌ ర్యాలీల్లో పాల్గొన్న వారి కేసులను తెరపైకి తెచ్చారు. బైండోవర్‌ కేసులు బనాయించారు. అంతటితో ఆగకుండా కాపు ఉద్యమానికి మద్దతిచ్చిన రాజకీయపక్ష నాయకులకు నోటీసులు జారీ చేశారు. కాపు జేఏసీ నేతలకైతే పాదయాత్రలో పాల్గొనబోమంటూ తహసీల్దార్ల వద్దకొచ్చి లక్ష రూపాయల బాండ్లు సమర్పిచాలని సమన్లు జారీ చేశారు.  అయినా ఉద్యమానికి దూరం కాలేదు. చేసేదేమిలేక ప్రభుత్వం తన చివరి అస్త్రాన్ని అమలు చేసింది. పోలీసు బలగాలను రంగంలోకి దించి నిర్బంధమే లక్ష్యంగా అడుగులు వేసింది. జిల్లా వ్యాప్తంగా పోలీసు ప్రత్యేక బలగాలు మోహరించాయి. చెక్‌పోస్టులు, అవుట్‌ పోస్టులు, పికెట్‌లు పెట్టి అడుగడుగునా తనిఖీలు ముమ్మరం చేశాయి. బయట వ్యక్తులు జిల్లాలోకి ప్రవేశించకూడదని పోలీసు అధికారులు ఆంక్షలు పెట్టారు. అలా వచ్చినోళ్లను ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకుని వెనక్కి పంపించేశారు.

పోలీసు గుప్పెట్లో కిర్లంపూడి...  
జిల్లా అంతా ఒక ఎత్తు...కిర్లంపూడి మరో ఎత్తు. పాదయాత్ర ప్రారంభ గ్రామాన్ని పోలీసులు చుట్టు ముట్టేశారు.రహదారులన్నీ మూసివేశారు. ఎక్కడికక్కడ అవుట్‌ పోస్టులు, చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. గుర్తింపు కార్డు ఉంటేనే...దానికి కూడా కారణం చెబితేనే... కిర్లంపూడిలోకి అనుమతి ఇస్తున్నారు. కాపులని చెబితే చాలు అడ్డుకుంటున్నారు. వాహనాల్ని వెనక్కి పంపేస్తున్నారు. మరోవైపు జనం భయపడేలా బలగాల చేత కవాతులు నిర్వహించి, బయటికి రావొద్దని హెచ్చరికలు చేస్తోంది. దీంతో చాలా మంది ఇళ్ల నుంచి బయటికి వచ్చే సాహసం చేయడం లేదు. ఏం జరుగుతుందోనని ఇళ్లల్లోనే మగ్గుతున్నారు. పలువురైతే తమకు ఇళ్లకు తాళాలు వేసుకుని గ్రామం నుంచే వెళ్లిపోయారు. వ్యాపారులు దుకాణాలు మూసేసి ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కిర్లంపూడిలో పోలీసుల బూట్లు చప్పుడు తప్ప మరేది వినిపించడం లేదు.

మరో కుట్రకు తెరలేపిన చంద్రబాబు
పాదయాత్ర సమయం ఆసన్నమవడంతో చంద్రబాబు మరో కుట్రకు తెరలేపారు. కాపు జేఏసీ నేతలపై మాటల దాడి పెంచారు. మంత్రుల దగ్గరి నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు ముద్రగడను లక్ష్యంగా చేసుకుని విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. అంతటితో ఆగలేదు సరికదా టీడీపీ నాలెడ్జ్‌ సెంటర్‌ నుంచి మూడు పేజీల కరపత్రాలను టీడీపీ నేతలకు పంపించి ముద్రగడ పాదయాత్రకు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని లింకు పెట్టి ఎటాక్‌ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇంకేముంది టీడీపీ నేతలు దూకుడు పెంచారు. అటు ముద్రగడను, ఇటు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసినట్టయితే పాదయాత్ర ఫీవర్‌ను కాస్త తగ్గించినట్టవుతుందని టీడీపీ వర్గాలు వ్యూహాత్మకంగా వెళ్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement