వైభవంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం

Andhra Pradesh Formation Day celebrated in a Grand Scale - Sakshi

గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం 

త్యాగధనుల వారసులకు ఘన సన్మానం 

సాక్షి, అమరావతి : ఐదేళ్ల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 2014 ముందు వరకు జరిగినట్టుగానే నవంబర్‌ 1వ తేదీనే రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించింది. దేశం కోసం, రాష్ట్ర కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయని మహనీయుల త్యాగాలను గుర్తిస్తూ వారి వారసులను రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించారు. వారికి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాలువాలు కప్పారు, జ్ఞాపికలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు అవంతి శ్రీనివాస్, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురామ్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

సీఎం ఆదర్శాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం: రేవతి, పొట్టి శ్రీరాములు మనవరాలు   
‘మా తాత పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేశారు. మేము హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. మమ్మల్ని గుర్తుంచుకుని పిలిచి మరీ సన్మానించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. ఈ సన్మానాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. సీఎం ఆదర్శాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం.’ అని రేవతి అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top