ఇది గౌరవమేనా?

Andhra Pradesh cabinet expansion on Sunday 11 december 2018 - Sakshi

మైనారిటీ, గిరిజనులకు ఎన్నికల ‘విస్తరి’..

ఏపీ ప్రభుత్వ పదవీ కాలం కరిగిపోయాక..ఎన్నికల వాకిట్లో ఆ రెండు వర్గాలకు మంత్రి పదవులు

నాలుగున్నరేళ్లుగా ఆ వర్గాలకు మంత్రివర్గంలో దక్కని అవకాశం

వారికి ప్రాతినిధ్యం లేకుండా నడిచిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబుదే

రేపే ఏపీ రాష్ట్ర క్యాబినెట్‌ విస్తరణ

మైనారిటీల నుంచి ఫరూక్, ఎస్టీల కోటాలో కిడారి శ్రవణ్‌కు చాన్స్‌

సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత మైనారిటీ, ఎస్టీ వర్గాల నుంచి ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సిద్ధమైంది! ఈమేరకు ఏపీ శాసనమండలి చైర్మన్‌ ఫరూక్, ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్‌లకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్‌ ద్వారా సమాచారం అందచేసినట్లు తెలిసింది. ఆదివారం రోజు ఉదయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉండాలని వారిద్దరికీ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.  

అనాదిగా అదే ఆనవాయితీ..
స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్రంలో చూసినా మైనారిటీలు, గిరిజనులకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే సంప్రదాయాన్ని పాటించారు. ఈ వర్గాలకు ప్రాతినిథ్యం లేకుండా మంత్రివర్గ ఏర్పాటు ఎన్నడూ జరగలేదు. ఈ నేపథ్యంలో నాలుగున్నరేళ్లు గడిచిపోయిన తరువాత ఇన్నాళ్లూ దూరంగా పెట్టి, తీరా ఎన్నికలకు వెళ్లే ముందు మైనారిటీ, ఎస్టీలను మంత్రివర్గంలో తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడం ఆ వర్గాలకు సన్మానమా? అవమానమా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికలకు ముందు ఓ వ్యక్తిని తెచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తే తమను ఎలా గౌరవించినట్లు అవుతుందని ఆయా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ దశలో ఇప్పుడు మంత్రులుగా నియమించినంత మాత్రాన వారు చేయగలిగేది ఏమీ ఉండదని, ఇదంతా ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఆయా వర్గాలను గౌరవించడం కాదు అవమానించినట్లుగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.  

పదవిస్తే అవమానం మాసిపోతుందా?
రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన గిరిజన సలహా మండలి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శించింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండటంతో గిరిజన సలహా మండలిని నియమించకుండా ఏళ్ల తరబడి తాత్సారం చేసింది. దీనిపై పోరాడిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా రాష్ట్రపతి, గవర్నర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేత పోరాటంతో దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం ఎట్టకేలకు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎస్టీ వర్గానికి చెందిన వారిని మంత్రి పదవిలోకి తీసుకున్నా ఇన్నేళ్లుగా గిరిజన వర్గానికి సర్కారు చేసిన అన్యాయం, అవమానం మాసిపోదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.  
 

ఎన్నిక కాకుండానే మంత్రిగా శ్రవణ్‌!
మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నందున కిడారి శ్రవణ్‌ ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే అప్పటికి సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఏ సభకూ ఎన్నిక కాకుండానే శ్రవణ్‌ మంత్రిగా కొనసాగుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  

స్పీకర్‌ కోడెల ఆఖరి ప్రయత్నం..
విస్తరణ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కోడెల సత్యనారాయణ చారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున అన్న క్యాంటీన్‌ కోసం రూ.5 లక్షల విరాళాన్ని అందించేందుకు వచ్చిన కోడెల శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. అయితే ఇప్పుడు అవకాశం ఇవ్వలేనని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు తెలిసింది. రెండు బెర్తులే ఖాళీగా ఉన్నాయని, వాటిని ముస్లిం, ఎస్టీ వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించామని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు తన వద్దే ఉన్న వైద్య, ఆరోగ్య శాఖను ఎవరికి ఇవ్వాలనే అంశంపై ముఖ్యమంత్రి మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో ఆ శాఖ తీసుకోవాలని యనమల రామకృష్ణుడికి సూచించినా వివాదాలున్నాయనే కారణంతో ఆయన నిరాకరించారు.

గ్రీవెన్స్‌ హాల్‌లో ప్రమాణ స్వీకారం
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఆదివారం ఉదయం 11.45 గంటలకు ముహూర్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం పక్కన గ్రీవెన్స్‌ హాల్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం శుక్రవారం సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ)ను ఆదేశించింది.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top