‘టీడీపీ పాలనలో ఇళ్లు ఇస్తామని మోసం’

Amjad Basha Speech In Vijayawada For Establishment Of Welfare Programs - Sakshi

సాక్షి, విజయవాడ: ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర పాలక సంస్థ కమీషన్ ప్రసన్న వెంకటేష్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారమే ప్రజలకు మౌలిక సదుపాయాలు, రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాల పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.

నగరంలోని అన్ని డివిజన్ల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అంజాద్‌ బాషా పేర్కొన్నారు. 52వ డివిజన్‌లో రూ.13.5 కోట్లతో శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరేలా సీఎం వైఎస్‌ జగన్‌ పాలన అందిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమనికి సీఎం జగన్‌ పెద్దపీట వేస్తున్నారని అంజాద్‌ బాషా గుర్తు చేశారు.

ఈ కార్యక్రమం‍లో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 14వ ఆర్థిక కమీషన్ నుంచి రూ.140 కోట్లు, బడ్జెట్‌ నుంచి రూ. 25 కోట్లు, సీఎం వైఎస్‌ జగన్‌ డివిజన్ల అభివృద్ధికి కేటాయించిన రూ.100 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.  రూ. 250 నుంచి రూ. 300 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ పాలనలో సెంట్రల్ నియోజకవర్గం నిర్లక్ష్యనికి గురైందని విమర్శించారు.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు

సిప్ అనే సంస్థ పేరుతో శిలాఫలకాలు, కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మోసం చేశారని మల్లాది విష్ణు అన్నారు. అన్ని డివిజన్లలోని త్రాగు నీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు 80శాతం ప్రజలకు చేరువ చేశామని గుర్తుచేశారు. టీడీపీ పాలనలో నియోజకవర్గంలో ఇళ్ళు ఇస్తామని 15 వేల మందిని మోసం చేశారని ఆయన మండిపడ్డారు. వేల మందికి కేవలం 600 ఇళ్లు చూపి.. ప్రజలను మోసం చేసారని ఆయన విమర్శించారు. వాటిలో రివర్స్ టెండరింగ్‌తో రూ. 25 కోట్లు ఆదాచేశామని ఆయన అన్నారు. టీడీపీ కార్పొరేటర్లు ఇళ్ల అప్లికేషన్లకు రూ. 25, రూ. 50 వేలకు అమ్ముకున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేశారని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. 

సీఎం జగన్‌ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థతో ప్రజలకు సంక్షేమ పాలన అందుతుందని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు మతి భ్రమించడంతో మొన్నటి వరకు ఈవీఎంలు అని.. ఇప్పుడు ఓటర్లు డబ్బులకు అమ్ముడు పోయారంటున్నారని దుయ్యబట్టారు. రాష్టంలోని అన్ని మున్సిపాలిటీలను గెలిచి ప్రజలకు జవాబుదారితనంగా తాము పాలన అందిస్తున్నట్లు నిరూపిస్తామన్నారు. అర కేజీ టమాటా, ఒక కేజీ బియ్యం ఇచ్చి ‘జై తెలుగుదేశం’అనిపించే దుస్థితికి టీడీపీ నాయకులు దిగజారారని మల్లాది విష్ణు ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో మీరు అందించిన పాలన, ఎనిమిది నెలల్లో తాము అందించిన పాలనపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్‌ విసిరారు. నియోజకవర్గంలో 34,500 మందికి అమ్మఒడి ఇచ్చామని తెలిపారు. ఐదేళ్లలో ఇలాంటి కార్యక్రమం జరిగిందా అని ప్రశ్నించారు. 24 గంటలు అమరావతి పేరుతో అధికారులను ఫైల్స్ పట్టుకుని సచివాలయం చుట్టు తిరిగేలా చేసి ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని మల్లాది విష్ణు మండిపడ్డారు. సీఎం జగన్‌ ప్రతి సోమవారం ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండేలా పాలన అందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

సీఎం జగన్‌ సాచురేషన్ పద్ధతిలో అర్హులందిరికీ ఫలాలు అందేలా చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు  అన్నారు. నియోజకవర్గంలో 35 వేలమంది ఇల్లు లేనివారిని గుర్తించామని తెలిపారు. అధికారం అడ్డం పెట్టుకుని ఐదేళ్లలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని విష్ణు విమర్శించారు. తన కోటరికే మేలు జరిగేలా పాలన అందించారని మండిపడ్డారు. ఐటీ దాడులే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. అమరావతి ఎక్కడికి తరలిపోదని.. శాసనసభ అమరావతిలోనే ఉంటుందన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు  దుష్పచారం చేస్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top