వారబందీతో సాగునీరు నిలిపివేత దారుణం

Ambati Rambabu Slams Chandrababu Naidu - Sakshi

వారబందీని ఎత్తివేయాలి

మాగాణికి రోజూ నీళ్లివ్వాలి

ప్రభుత్వ తీరుతో రైతుల వలసలు

గుంటూరు, వినుకొండ: సాగర్‌ కుడి కాల్వకు నీరివ్వడంలో ప్రభుత్వం అలక్ష్యం చూపిస్తోందని, పంటలు ఎండిపోతుంటే వారబందీ అంటూ నెలకు పది రోజులు సాగు నీరు నిలిపివేయడం దారుణమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, లావు శ్రీకృష్ణదేవరాయలు, బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో నియోజకవర్గ రైతులతో శుక్రవారం భారీ ర్యాలీ, ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ ఏడాది సాగర్‌ నుంచి రెండు పంటలకు నీళ్లిస్తామని ప్రకటించిన ప్రభుత్వ మాటలు నమ్మి మాగాణి సాగు చేసిన రైతుల నోట్లో మట్టికొట్టడానికి ప్రభుత్వం వారబందీ పెట్టడం అమానుషమన్నారు.

మాగాణికి నీళ్లు అందకపోతే నష్టపోయేది రైతులే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని, రైతులు ఆగ్రహిస్తే ప్రభుత్వాలు మట్టికొట్టుకుపోతాయని హెచ్చరించారు. తక్షణమే వారబందీ నిబంధన ఎత్తివేసి సాగు నీరు సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. చిత్తశుద్ధి లేని పాలన చంద్రబాబుది అని.. అందుకే వరుణుడు సైతం ముఖం చాటేస్తున్నాడని, గత 9 ఏళ్ల పాలనలో రైతులు కరువును చూశారని, ఇప్పుడు నాలుగేన్నరపాలనలో సైతం కరువు తాండవించిందని గుర్తు చేశారు. కృష్ణా బేసిన్‌లో వర్షాలు పడి సాగర్‌కు నీరోచ్చిందని, ఆ నీటిని సక్రమంగా వినియోగించుకోలేకపోతే ఎలా అని ప్రశ్నించారు.

రైతుల నుంచి విశేష స్పందన
రైతుల కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన ధర్నాకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి వెయ్యి మందికి పైగా రైతులు తరలివచ్చారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ బస్టాండ్‌ మీదుగా శివయ్య స్తూపం సెంటర్‌కు చేరుకుంది. అక్కడ భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం ఎన్‌ఎస్‌పీ కార్యాలయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డీఈఈ శ్రీహరికి వినతి పత్రం అందజేశారు.

రైతుల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం : శ్రీకృష్ణదేవరాయలు
నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు రైతుల కష్టాలు కనపడకపోవడం శోచనీయమన్నారు. జగనన్న రైతుల సంక్షేమం కోసం నవరత్నాలతో అనేక పథకాలు ప్రకటించారని గుర్తు చేశారు. పంట వేయగానే గిట్టుబాటు ధర ప్రకటించడం, రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ప్రయోజనముంటుందని తెలిపారు.  చంద్రబాబు పీఎం కావాలన్న ఆశల్లో దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాష్ట్ర పాలనను గాలికి వదిలి వేశాడని విమర్శించారు.

రైతులు ఎలా బతకాలి : బొల్లా
నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో ఈ ప్రాంతం ఏడారిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ నీళ్లు కావాల్సిన వరికి ప్రభుత్వం 18 రోజులు మాత్రమే ఇస్తామంటే రైతులు ఎలా బతకాలి?  అని ప్రశ్నించారు.  సాగు ప్రారంభంలో రెండు పంటలకు పుష్కలంగా నీరిస్తామన్న ప్రభుత్వం మాటలు నమ్మిన రైతుల్ని నేడు నట్టేట్లో ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వమే తప్పించుకునే ధోరణితో మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే బొల్లాపల్లి మండలంలో వరికపూడిశల నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top