అమలాపురంలో ఇటీవల కాలంలో జరిగిన భూ బాగోతాలపై ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.
అమలాపురం భూ బాగోతంపై ఇంటిలిజెన్స్ ఆరా
నక్కపల్లి : అమలాపురంలో ఇటీవల కాలంలో జరిగిన భూ బాగోతాలపై ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. సుమారు రూ.12 కోట్లు విలువైన 90 ఎకరాల ప్రభుత్వభూమికి రికార్డులు తారు మారు చేసి ఆన్‌లైన్ చేయడం తెలిసిందే. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్‌కారిడార్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా భూసేకరణ చేస్తోంది. దీనిలో భాగంగా జిరాయితీతోపాటు, డీఫారం పట్టాభూములను కూడా స్వాధీనం చేసుకుని పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీనిని అవకాశంగా తీసుకున్న కొంతమంది తెలుగు తమ్ముళ్లు రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కయి రికార్డులు తారుమారు చేశారు.
ఎటువంటి పట్టాలు జారీ కాకుండానే ఒన్‌బీలోను, ఆన్‌లైన్ (వెబ్‌ల్యాండ్)లో 39 మంది సాగుదారులను చేర్చి నమోదు చేశారు. ఈ విషయాన్ని సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో స్పందించిన ప్రభుత్వం ఇంటిలిజెన్స్ వర్గాలతో ఆరా తీయిస్తోంది. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకుల ప్రమేయం ఉంది. రికార్డుల్లో వారి పేర్లు నమోదవడంతో పార్టీ అధిష్టానం సీరియస్‌గా పరిగణించినట్టు సమాచారం. ఈ బాగోతాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు రాష్ట్ర స్థాయికి, అవసరమైతే ప్రతిపక్షనేత జగన్ దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించడం అధికారపార్టీ నేతలకు మింగుడుపడటంలేదు.