టీడీపీ కార్యాలయం కూల్చేయాలంటూ ఆళ్ల పిటిషన్‌

Alla Ramakrishna Reddy Approached High Court To Declare TDP Office Building Illegal - Sakshi

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మితమైన టీడీపీ కార్యాలయ భవనం అక్రమ నిర్మాణమని.. దానిని కూల్చివేసి, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆత్మకూరు పరిధిలో ఉన్న వాగు పోరంబోకుకు చెందిన సర్వే నెంబరు 392లో 3.65 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం 99 సంవత్సరాల పాటు లీజుకిస్తూ 2017లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని.. ఇది అక్రమమని ఎమ్మెల్యే ఆళ్ల తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందులో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ కార్యదర్శి, ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌, తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చే  అవకాశం ఉంది.

టీడీపీ కార్యాలయ భవనం

వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూముల్ని ఇతరాలకు కేటాయించడం పర్యావరణ చట్టాలకు విరుద్ధమని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని పిటిషన్‌లో ఆళ్ల తరపు న్యాయవాది గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో అనేక చట్ట ఉల్లంఘనలు ఉన్నందున గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయడంతో పాటు అక్రమంగా కట్టిన  టీడీపీ భవనాన్ని కూల్చివేసి, తిరిగి ఆ భూమిని స్వాధీనం చేసుకునేలా సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశించాలని ఆళ్ల తరపు న్యాయవాది అభ్యర్థించారు.

టీడీపీ పార్టీ కార్యాలయం ప్రారంభం
గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం అత్మకూరు పరిధిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. కార్యాలయం ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు చేపట్టి పార్టీ జెండాను చంద్రబాబు ఎగురవేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top